తప్పు చేయకుంటే అశోక్‌ ఎందుకు పరారీలో ఉన్నట్టు?

7 Mar, 2019 12:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రతి నియోజకవర్గంలోను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనే 9 వేల ఓట్లను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారం-7ను టీడీపీ నేతలు ఓట్ల తొలగింపుకు వాడుకుంటున్నారని విమర్శించారు. గత పది రోజులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందని గుర్గుచేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ విచారణ చేసి ఓట్ల తొలగింపులో వాస్తవాలు బయటపెట్టాలని కోరారు.

టీడీపీ సేవామిత్ర యాప్‌ వ్యవహారం బహిర్గతం కావడంతో.. దాన్ని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌ ఎందుకు పరారీలో ఉన్నాడని సూటిగా ప్రశ్నించారు. గుట్టు బయటపడుతుందని అశోక్‌ను, ఇతర సిబ్బందిని దాస్తోంది టీడీపీ కాదా అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన ఐదు రకాల వ్యక్తిగత డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సిట్‌ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. ఓ పథకం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓట్ల తొలగింపు చేపట్టారని ఆరోపించారు. సర్వేలన్నీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ భయంతోనే చంద్రబాబు 59 లక్షల ఓట్లను తొలగించారని వ్యాఖ్యానించారు. నేరాన్ని అంగీకరించి చంద్రబాబు తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు