కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారీ ఒప్పందం

30 May, 2018 04:01 IST|Sakshi

     అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ పాలనలో అన్యాయం

     పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

పుంగనూరు: కాంగ్రెస్‌ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు సిద్ధపడుతోందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో లాలూచీ పడిన చంద్రబాబు.. చిదంబరం సాయంతో  కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని తనమీద ఉన్న కేసులు విచారణకు రాకుండా తప్పించుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌పై కోపంతో జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపేందుకు సోనియా, చిదంబరంతో కలిసి బాబు కుట్రచేశారని దుయ్యబట్టారు.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించి, బెంగళూరులో రాహుల్‌ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటిస్తున్నా బీజేపీతో కలిసి పోటీ చేస్తామనే తప్పుడు సంకేతాలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు మంత్రులుగా, ఆయనపై చెప్పులు వేయించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం టీడీపీ దౌర్భాగ్యమన్నారు.

టీడీపీకి అవసాన దశ ఆరంభమైందని, రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఎన్,రెడ్డెప్ప, నాగభూషణం, నాగరాజరెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, ఆవుల అమరేంద్ర, ఫక్రు ద్ధీన్‌షరీఫ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు