బాబు మాటలకు ఎన్నాళ్లు మోసపోతారు..?

29 Mar, 2018 11:11 IST|Sakshi
పార్టీ జెండా ఎగురవేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పం పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సీఎం నియోజకవర్గంలో అనూహ్య స్పందన

కుప్పం: చంద్రబాబు మోసపూరిత మాటలకు ఇంకా ఎన్నాళ్లు మోసపోతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె మండలాల్లో ఆయన పర్యటించారు. ఆయన పర్యటనకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ఆయా గ్రామాల్లో పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడక్కడ టీడీపీ నాయకులు ఆటంకాలు కల్పించేందుకు యత్నించినా ఆయన పర్యటన విజయవంతంగా సాగింది. సీఎం ఇలాకాలో పెద్దిరెడ్డి పర్యటన విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. గుడుపల్లె మండలం సోడిగానిపల్లెలో జరిగిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఏళ్ల తరబడి మోసపు మాటలతో కుప్పం ప్రాంతవాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గణేష్‌పురం వద్ద పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచి సర్వేలంతా పూర్తి చేసినా, చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మక్కై నిలిపివేశారని ఆరోపించారు.

30 ఏళ్లుగా శాసన సభ్యులుగా కొనసాగుతున్న చంద్రబాబు కుప్పం ప్రాంతానికి శాశ్వత నీటి సదుపాయం కల్పించలేకపోయారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే హంద్రీ–నీవా కాలువలు, పాలారు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం అని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే నిబంధనలు పెట్టి రైతులను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చుంటానే గాని ఇలాంటి దొంగ హామీలు ఇవ్వనని జగన్‌మోహన్‌రెడ్డి ఆరోజు రుణమాఫీపై వెనకడుగు వేశారని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఓట్లకోసం యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధమని రావడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన సోడిగానిపల్లె గ్రామస్తులు
సోడిగానిపల్లెకు చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌ గోవిందతో పాటు కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న టౌన్‌బ్యాంకు వైస్‌ చైర్మన్, విజయవాణి విద్యాసంస్థల అధినేత భాగ్యరాజ్, పీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, డీకే.పల్లె టీడీపీ యువ నాయకులు చంద్ర పార్టీలో చేరారు. వీరితో పాటు గుండ్లసాగరం గ్రామానికి చెందిన 20 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

>
మరిన్ని వార్తలు