చిత్తశుద్ధి ఏదీ!

25 Jan, 2018 07:44 IST|Sakshi

కమల్, రజనీలపై ప్రజల కస్సుబుస్సు

పెంచిన బస్సు చార్జీలు పట్టవాని నిలదీత

ట్వీట్‌ చేసిన కమల్‌

26న అభిమానులతో రజనీ సమావేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెడిపోయిన వ్యవస్థను చక్కదిద్దుతాం, రాజకీయాల్లోకి వస్తాం, రాష్ట్రంలో మార్పులు తెస్తాం అంటూ ప్రగల్బాలు పలికిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ తమ చిత్తశుద్ధిని కనపర్చడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భరించలేని బస్సు చార్జీల భారంపై ప్రజాందోళనలు జరుగుతుండగా కమల్, రజనీ ప్రజల పక్షం నిలవకపోగా కనీస స్థాయిలో ఖండించక పోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.

ప్రభుత్వం ఈనెల 20 నుంచీ బస్సు చార్జీలను నూరు శాతం పెంచింది. రాత్రికి రాత్రే అకస్మాత్తుగా పెరిగిన చార్జీలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన పోరాటాలు కొనసాగిస్తున్నాయి. పెరిగిన చార్జీల భారాన్ని భరించలేక ప్రజలు బస్సులు ఎక్కడాన్ని మానుకుంటున్నారు. నామమాత్రపు చార్జీలున్న లోకల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. బస్సు చార్జీలపై ప్రజలు భగ్గుమన్నా రజనీ, కమల్‌హాసన్‌ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. బహిరంగ విమర్శలు, సామాజిక మాధ్యమాల్లో విసుర్లు రావడంతో ఉలిక్కిపడిన కమల్‌హాసన్‌ మంగళవారం రాత్రి ఎట్టకేలకూ ట్వీట్‌ చేశారు. బస్సు చార్జీలను విపరీతంగా పెంచడం ద్వారా ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని అన్నాడీఎంకే ప్రభుత్వం నిరూపించుకుందని కమల్‌ విమర్శించారు. ఏకపక్షంగా చార్జీలు పెంచి నేడు అభిప్రాయసేకరణకు పూనుకోవడం ద్వారా తమ రాజకీయ చాణుక్యాన్ని చాటుకుందని వ్యాఖ్యానించారు. చార్జీలు పెంచకుండా రాబడి పెంచే ఉపాయాలను చెప్పేందుకు ఎందరో అధికారులు రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు.

కమల్‌లో కదలిక వచ్చిన తరువాత కూడా రజనీకాంత్‌ మౌనం పాటించడాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఖజానా లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఒక నటుడు చెప్పడం విడ్డూరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ పరోక్షంగా కమల్‌ను దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో నటించింది ఖజానాను నింపుకున్న కమల్‌ రాజకీయాల్లో నిజాయితీ పాటిస్తానంటేæ తాను నమ్మనని అన్నారు. రాష్ట్రంలో మార్పు తెస్తాం అంటూ తమిళనాడుపై ప్రయోగాలు చేసేందుకు పర్యటనలు జరుపనున్నారని రజనీ, కమల్‌ గురించి ఆమె విమర్శించారు. సినిమాలు ఫ్లాపులు కావడం వల్లనే రజనీ, కమల్‌ రాజకీయబాట పట్టారని మాజీ మంత్రి వలర్మతి ఎద్దేవా చేశారు.

సినిమాల్లో తాగుబోతు, తిరుగుబోతు వేషాలు వేయకుండా మహిళల పట్ల గౌరవభావం కనపరిచినందునే ఎంజీ రామచంద్రన్‌ను తమిళనాడు ప్రజలు దేవుడిగా పూజించారని అన్నారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వెండితెరపై మెరిసిన రజనీ, కమల్‌కు రాజకీయాల్లో ఛేదు అనుభవం తప్పదని ఆమె వ్యాఖ్యానించారు. నటులు రజనీకాంత్‌ రాజకీయ సన్నాహాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన చెన్నై అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశం అవుతున్నారు. చెన్నై జిల్లాలోని యువజన, మహిళా సంఘ నిర్వాహకులను ఎంపిక చేసే నిమిత్తం చెన్నై కోడంబాక్కంలోని తనకు సొంతమైన రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు