పాలకుల కుట్రలపై జనం కన్నెర్ర

24 Sep, 2018 04:19 IST|Sakshi

మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన 
మన పిల్లలను చంపి మనల బంధించిన 
మానవాధములను మండలాధీశులను  
మరచిపోకుండగ గురుతుంచుకోవాలె 
కసి ఆరిపోకుండ గురుతుంచుకోవాలె 
కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలే 
కాలంబు రాగానే కాటేసి తీరాలె 

   – ప్రజాకవి కాళోజీ నారాయణరావు 

ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  రాష్ట్రంలో అతివృష్టి కాదంటే అనావృష్టి. వర్షాలు లేక పంటలు దెబ్బతిని, గిట్టుబాటు లేక వ్యవసాయం నిర్వీర్యమై పోయింది. రైతులపై ఒత్తిళ్లు, రుణాలు చెల్లించడం లేదని కేసులు, నిరాదరణకు గురైన చేతివృత్తులు, కుదేలైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కరెంటు చార్జీలు కూడా కట్టలేని దుస్థితిలో రైతులు, అన్నదాతల ఆత్మహత్యలు, వంచనకు గురైన అక్కచెల్లెమ్మలు, యువతీయువకులు, ఉద్యోగులు. వాళ్ల గోడు వినే నాయకుడొకరు కావాలి.. వెళ్లి వారితో మాట్లాడాలి.. వారు అనుభవిస్తున్న కష్టాలు అడిగి తెలుసుకోవాలి.. ప్రతి గుండె గోడూ వినాలి.. కన్నీరు తుడవాలి.. ప్రతి పల్లెనూ పలకరించాలి.. ఆత్మహత్యలు వద్దని ధైర్యం చెప్పాలి.. భరోసా ఇవ్వాలి. భవిష్యత్‌పై బెంగ వద్దని అండగా నిలవాలి. కలుస్తూనే ముందడగు వేయాలి. ఈ ఆలోచన ప్రతిరూపమే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సాహసోపేతమైన ప్రజా సంకల్ప యాత్ర. 

- విశాఖ జిల్లా చోడవరం మండలం ఖండిపల్లికి చెందిన విద్యార్థి దుర్గారావు పుట్టు అంధుడు. 2014 వరకు పింఛన్‌ అందుకున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీల పుణ్యమాని పింఛన్‌ కోల్పోయాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. 
- తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తికి చెందిన బోదవరపు నాగిరెడ్డికి 81 ఏళ్లు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత క్రమేపీ చూపూ మందగించింది. పెన్షన్‌ కోసం ప్రతి అధికారినీ బతిమాలాడు. తుదకు ఎందుకిలా అని ఆరా తీస్తే వైఎస్సార్‌సీపీ అభిమాని కావడమే కారణమని తెలిసింది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక.. 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన గోపాలం కుమారుడు అంకమరావు ఇంజనీరింగ్‌ విద్యార్థి. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా రాక తన చదువు కోసం తండ్రి పడే ఇబ్బందుల్ని చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు.  
ఇలా ఒకటా.. రెండా.. వేలు, లక్షల ఈతిబాధలు.. ప్రతి సమస్యా హృదయాన్ని కదిలించేదే. మనసును కకావికలం చేసేదే. ఇప్పటివరకు యాత్ర సాగిన 11 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఓ పక్క సమస్యలను సావధానంగా వింటూ పరిష్కరించగలిగేవి అక్కడికక్కడే పరిష్కరిస్తూ.. మిగతా వాటిని క్షుణ్నంగా విచారించి, నివేదికలు రూపొందించి సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించాలని తన సిబ్బందిని ఆదేశిస్తూ జననేత వైఎస్‌ జగన్‌ యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. 

డొంక రోడ్డులో.. మట్టి దారిలో..
డొంకరోడ్డులో.. మట్టిదారిలో ఎగిసిపడే దుమ్ము, ధూళిలో పల్లెతల్లులను పలకరిస్తూ, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ జనం తోడుగా జననేత వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఓ ప్రవాహమై సాగుతోంది. అడుగడుక్కో కథ.. గుండె గుండెకో వ్యథ... వందలకొద్దీ గ్రామాలు, వెల్లువలా జనాలూ.. కదిలిస్తే చాలు కళ్లలో సుడులు తిరిగే కఠోర వాస్తవాలు..  రుణమాఫీ మాయ, ప్రత్యేక హోదా మాయ, పోలవరం మాయ, పొదుపు సంఘాలకు అప్పులమాఫీ మాయ.. ఇలా మోసం, దగాలతో సాగుతున్న చంద్రబాబు పాలనపై సమర శంఖం పూరిస్తోంది. గనిలో, పనిలో, పొలంలో, కర్మాగారాల్లో.. ఇలా మరెన్నో చోట్ల పని చేస్తున్నవారికి ఆదరవుగా నిలవాలని దారిపొడవునా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ‘పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల’ అని ఓ కవి అంటే చంద్రబాబు పాలనలో కనిపిస్తున్న కుట్రలతోనే పల్లెలు కంటనీరు పెడుతున్నాయి. ఈ పీడ విరగడయ్యే మార్గం చూపమని పల్లెలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అడుగడుగునా అభ్యర్థిస్తున్నాయి. అలుపెరగని బాటసారి సాగిస్తున్న ఈ ప్రయాణం నేడు 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించనుంది. 

మనిషికి ఇది ఒక అడుగు. మానవాళికి  గొప్ప ముందడగు..  
(ఇది చంద్రునిపై మొట్టమొదటిగా అడుగుపెట్టిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాట.) ఈ మాట జగన్‌ విషయంలో అక్షరాలా 5 కోట్ల ఆంధ్రులకూ వర్తిస్తుంది.   

అనంతపురం జిల్లా అమడగూరు మండలం గుండువారిపల్లెలో  శివన్న అనే రైతుకు ఆయనకు ఐదెకరాల భూమి ఉంది. రూ.90 వేలు అప్పు చేసి వేరుశనగ వేశాడు. వర్షాలు లేక పంట ఎండిపోయింది. అప్పుడు ఇక్కడకు వచ్చిన చంద్రబాబు.. దేవుణ్ణి నమ్ముకోబోకు.. నన్ను నమ్ముకో.. అంటూ పిట్టల దొరలా మాట్లాడాడు. రెయిన్‌ గన్‌తో వర్షం తెప్పిస్తానని  చెప్పాడు. అధికారులు టార్పాలిన్‌ తెచ్చి గుంటలో పరిచారు. ఒక ట్యాంకర్‌ నీళ్లు తెచ్చి ఆ గుంటలో పోసి రెయిన్‌గన్‌ తెచ్చిపెట్టారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు. ఆ తర్వాత రెయిన్‌గన్‌ను ఆన్‌ చేశారు. ఆ గన్ను అటూ ఇటూ అలా అలా నీళ్లు చిమ్మింది. కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత శివన్న పరిస్థితి ఏమిటో తెలుసా..  ఆ ఏడాది శివన్నకు అర బస్తా కూడా దిగుబడి రాలేదు. చివరకు వడియాలు అమ్ముకుంటున్నాడు’.  
– వైఎస్‌ జగన్‌ చెప్పిన ఈ వాస్తవ కథ అందరినీ ఆకట్టుకుంది. బాబు పాలన తీరును ఎత్తి చూపింది.  

చదవండి: రావాలి జగన్‌.. కావాలి జగన్‌..
జననేత వెంట జనప్రవాహం
రాజకీయ ప్రభంజనం
బీసీల ఆశా దీపం నువ్వేనన్నా..

 

మరిన్ని వార్తలు