బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం

29 Jun, 2018 04:10 IST|Sakshi
ఢిల్లీ ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీల బాతాఖానీ

ఈసారి ఈయన్ను పెడదాం.. జోనూ లేదు.. గీనూ లేదు

దీక్షలు, హామీల సాధనపై టీడీపీ ఎంపీల వ్యంగ్య సంభాషణ

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

టీడీపీ ఎంపీల చిత్తశుద్ధిపై మండిపడుతున్న ప్రజలు

జీవన్మరణ సమస్యలపై వెటకారమా?

బరువు తగ్గడానికి దీక్ష చేస్తారా? అంటూ విమర్శల వెల్లువ

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్‌ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్‌’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్‌ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు.
 
రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా??
కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు.  టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు.  

గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి
సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్‌ను మించిన వాడని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్‌లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు