ఎన్నికలు వచ్చే..ఉపాధి తెచ్చే

17 Jan, 2020 09:06 IST|Sakshi
డప్పు కళాకారులకు ఆదరణ, కళకళలాడుతున్న జిరాక్స్‌ సెంటర్లు..

పూలు మొదలు వాహనాల వరకు గిరాకీ

సాక్షి, వరంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తోంది. అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారానికి పదును పెట్టారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ప్రత్యర్థులతో పోటాపోటీగా సందడి చేయాల్సిందే. పూల దుకాణాలు మొదలు వాహనాల వరకు మంచి గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నూతన పోకడలకు అభ్యర్థులు శ్రీకారం చుడుతున్నారు. విభిన్న తరహాలో ప్రచార సామగ్రి సమకూర్చుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకుల బాగోగులు చూసుకుంటున్నారు. ఎన్నికల క్రమంలో ఉపాధి తీరుతెన్నులపై ప్రత్యేక కథనం..

డప్పు కళాకారులకు ఆదరణ..
డప్పు చప్పుళ్లతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పది మంది కళాకారుల బృందం రోజుకు రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో వీరికి గిరాకీ అధికంగా ఉంది. 

టెంట్‌హౌస్‌లు, కుర్చీలకు గిరాకీ..
అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సభలో మాట్లాడేందుకు స్థానికులకు కుర్చీలు వేయాల్సి ఉంటుంది. దీంతో టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది. టెంట్లు, కుర్చీలను బట్టి ధర ఉంటుంది. నిత్యం చిన్న సభకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు, పెద్ద బహిరంగ సభ అయితే రూ. 15 వేల నుంచి రూ.20 వేలకు పైగా తీసుకుంటున్నారు.

వంట మనుషులకు..
నాయకులు, కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్, మటన్‌ బిర్యానీ అందిస్తున్నారు. దీనికై ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డుల్లోని ముఖ్య నాయకుల ఇళ్లల్లో కార్యకర్తలు, ప్రచారానికి వచ్చినవారి సదుపాయం కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగా వంట మనుషులకు ఉపాధి లభిస్తోంది. రోజుకు ఒక వంట మనిషికి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఫొటో, వీడియోగ్రాఫర్లకు..
అభ్యర్థుల ఎన్నికల ప్రచారం చిత్రీకరించడానికి ఎన్నికల అధికారులు వీడియో, ఫొటోగ్రాపర్లను ఏర్పాటు చేశారు. సమావేశాలు ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తీయడానికి అభ్యర్థులు సొంత ఖర్చులతో నియమించుకుంటున్నారు.

వాహనాలకు డిమాండ్‌...
ఎన్నికల సందర్భంగా వాహనదారులకు గిరాకీ లభిస్తుంది. అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఐదారు వాహనాలు అవసరం. సొంత వాహనం అభ్యర్థికి అవసరమైతే, మిగతా వారికి అద్దె వాహనాలు సమకూర్చుతున్నారు. ప్రచార రథంతో పాటు బహిరంగ సభలకు జనాన్ని తరలించడానికి వాహనాలు అవసరమవుతుండటంతో ప్రైవేటు వాహన యజమానులకు గిరాకీ లభిస్తుంది. ఇదే అదనుగా వాటి అద్దె ధరలను సైతం పెంచడం విశేషం. దీనికి తోడుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం వాహనాల అద్దెలు పెంచడానికి కారణమవుతుంది. 

కళకళలాడుతున్న జిరాక్స్‌ సెంటర్లు..
ఎన్నికల వేళ జిరాక్స్‌ సెంటర్లకు గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎత్తుగడలు వేస్తుంటారు. ఓటరు జాబితా సేకరించి తదనుగుణంగా ప్రణాళిక రచిస్తారు. అధికారుల నుంచి ఓటరు జాబితాను సేకరించి పదుల సంఖ్యలో జిరాక్స్‌ తీస్తుంటారు. నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం ముగియడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది.

వంట మనుషులకు..
నాయకులు, కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్, మటన్‌ బిర్యానీ అందిస్తున్నారు. దీనికై ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డుల్లోని ముఖ్య నాయకుల ఇళ్లల్లో కార్యకర్తలు, ప్రచారానికి వచ్చినవారి సదుపాయం కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగా వంట మనుషులకు ఉపాధి లభిస్తోంది. రోజుకు ఒక వంట మనిషికి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

హోటళ్లకు పెరిగిన తాకిడి..
ప్రచారానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఉదయం అల్పాహారం తప్పనిసరి. మధ్యాహ్న భోజనంతో మున్సిపాలిటీల్లోని హోటళ్లకు తాకిడి పెరిగింది. ఆర్డర్‌పై కోరిన చోటుకి భోజనాలు వండి తీసుకెళ్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

దర్జీలకు..
రాజకీయ నాయకులకు ముఖ్యమైనది ఎన్నికల పండుగే. నూతన దుస్తులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇటీవల దర్జీలకు గిరాకీ పెరిగింది. 

పూలకు పెరిగిన డిమాండ్‌..
అభ్యర్థులు, ప్రచారానికి వచ్చే నాయకులకు పూలదండలు వేయడానికి కార్యకర్తలు పోటీపడుతుంటారు. ప్రచారంలో అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తున్నారు. పూల వ్యాపారుకు గిరాకీ పెరిగింది. బంతిపూలు, గులాబీ దండల ధర పెరిగిపోయింది. ఒక్కో దండ సుమారు రూ.300 పలుకుతోంది. 

ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులు బిజీ బిజీ..
అభ్యర్థుల బొమ్మలతో పాటు పార్టీ గుర్తు, అధినాయకుల బొమ్మలున్న వాల్‌ పోస్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కరపత్రాలు, ఇతర సామగ్రితో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులు బిజీబిజీగా మారారు. వాహనాలు, ఇళ్లకు అంటించే స్టిక్కర్లు, కీచైన్లు, చేతిపట్టీలు వంటివి తయారు చేసే వారికి సైతం ఉపాధి దొరుకుతోంది. 

మరిన్ని వార్తలు