బాబును సాగనంపాల్సిందే..

25 Sep, 2018 06:31 IST|Sakshi
ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి పక్కన పార్టీ నాయకులు

టీడీపీ అవినీతి పాలనపై నిప్పులు చెరిగిన నాయకులు

కొత్తవలస బహిరంగ సభకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు

విజయనగరం , ప్రజా సంకల్పయాత్ర బృందం :దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని చంద్రబాబు అతని భజన బృందాన్ని ఇంటికి పంపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన నాయకులకు రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో కొత్తవలసలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభకు ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అశేష ప్రజానీకాన్ని చూసి నాయకులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. టీడీపీ అవినీతి పాలనను తూర్పారబట్టారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించాలని ఆకాంక్షించారు. అంతకుముందు పలువురు జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతూ, తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు.           

జగన్‌తోనే రాజన్న రాజ్యం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలి. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మన జిల్లాలో పూర్తవడం శుభపరిణామం. – ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ జిల్లా పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌

దోచుకోవడమే వారి పని..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదు. టీడీపీ నాయకులకు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ మన జిల్లాకు రావడం మనందరి అదృష్టమన్నారు. రానున్న ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలు గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలి. ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. – కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర  కన్వీనర్‌

ప్రజాకంటక పాలనను అంతమొందించాలి..
టీడీపీ ప్రజాకంటక పాలనను అంతమొందించాలి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవాలి. ఎస్‌.కోట ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు అవినీతిని ప్రోత్సహిస్తూ ప్రజాధనం లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన అశేష ప్రజానీకానికి పేరుపేరునా కృతజ్ఞతలు. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ,

వ్యవహరాల సమన్వయకర్త అవినీతికి చిరునామా..
ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అవినీతికి చిరునామాగా మారింది. అవినీతి ప్రజా ప్రతినిధులకు ర్యాంకులు కేటాయిస్తే లలితకుమారికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం వస్తుంది. బదిలీలకు లంచం.. సంక్షేమ పథకాల మంజూరుకు లంచం..ఇలా ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి ప్రజాధనం దోచుకుంటున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా.. రాజన్న రాజ్యం సిద్ధించాలన్నా వైఎస్సార్‌సీపీని గెలిపించాలి. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి.– కండుబండి శ్రీనివాసరావు, ఎస్‌కోట నియోజకవర్గ సమన్వయకర్త 

ఆర్టీసీని విలీనం చేయాలి..
ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాను. 2005లో డ్యూటీలో ఉండగా లారీ ఢీ కొనడంతో కాలు విరిగిపోయింది. అప్పటినుంచి చాలాకాలం  సిక్‌లో ఉండిపోయాను. అనంతరం  గ్యారేజీలో డ్యూటీ ఇచ్చారు. యాజమాన్యం కార్మికులను చిన్నచూపు చూస్తోంది. మీరు అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండన్నా..–  ఇల్లాపు సూరిబాబు, జంగాలపాలెం,పెందుర్తి

 సహకారం లేదు..
మా ఆయన అప్పారావు 2014లో చనిపోయారన్న. దీంతో మా కుటుంబం బతకడం కష్టమైంది. మాకు సొంత ఇల్లు కాని, స్థలం కాని లేదు. నాకు వితంతు పింఛన్‌ తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఇల్లు కావాలని దరఖాస్తు చేసినా, రుణం కోసం వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. మీరు ముఖ్యమంత్రి అయితే నవరత్నాలుతో మాకు మేలు 
జరుగుతుందన్నా...          – సిమ్మ  సత్యవతి, 102 కాలనీ, పెందుర్తి

‘బాలికా సంరక్షణ’ను గాలికొదిలేశారు...
ఆడపిల్లలున్న కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని గాలికొదిలేసింది. గతంలో బాలికా సంరక్షణ పథకం పేరిట ఎంతో మందికి బాండ్లు ఇచ్చారు. కానీ ఇప్పటి టీడీపీ నాయకులు ఆ పథకానికి పలుమార్లు పేర్లు మార్పు చేశారే తప్ప నిధులు మంజూరు చేయలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నాలాగే ఎందరో ఈ పథకం లేక ఇబ్బంది పడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ఎంతో బాగున్నాయి. ఈ విషయం జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పేందుకే వచ్చా.
–ఇంజిబిల్లి కుమారి, ఎస్సీ కాలనీ, చింతపల్లి, కొత్తవలస మండలం 

 ఒకే ఇంటిలో పదేసి మంది..
మాది కొత్తవలస మండలం చింతపల్లి. మా గ్రామంలో చాలా మందికి ఇళ్లు మంజూరు కాలేదు. ఒకే ఇంటిలో పదేసి మంది ఉంటున్నాం. శివారు కాలనీ కావడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పిల్లలకు వయసు పెరిగిపోతున్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. అలాగే ఉపాధి లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసపోయారు. జగనన్న ప్రకటించిన నవరత్నాలతో అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.   – కె. అప్పలనర్సమ్మ, టి. రమణమ్మ,తదితరులు 

జగన్‌ దృష్టికి జిల్లా వైభవం... 
గురజాడ, ఆదిభట్ల వేషధారణలతో స్వాగతం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోకి అడుగిడిన సందర్భంలో జిల్లా చరిత్రను తెలియజేసే విధంగా ఎస్‌కోట మండలానికి చెందిన లెంక శ్రీను, కర్రి గణేష్‌లు మహాకవి గురజాడ అప్పారావు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వేషధారణలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డికి గురజాడ, ఆదిభట్ల విశిష్టతను యువకులు వివరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేతకు కన్యాశుల్కం గ్రంథాన్ని అందజేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పలికే అవకాశం తమకు రావడం ఎంతో ఆనందంగా ఉందని యువకులు తెలిపారు.  

గుండె నిండా అభిమానం...
అతనికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అన్నా.. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నా వీరాభిమానం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో తాను కూడా పాలుపంచుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచాడు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్‌కే అజీమ్‌ అనే దివ్యాంగుడు. ఇప్పటి వరకు సుమారు 1100 కిలోమీటర్ల సంకల్పయాత్రలో పాల్గొన్నాడు. యువనేత ప్రసంగం వింటే తెలియని ఉత్సాహం వస్తోందని చెబుతున్న అజీమ్‌ను కొత్తవలస ప్రజలు మనస్ఫూర్తిగా అభినందించారు.

ప్లకార్డులతో సమస్యల ప్రస్తావన..
ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్లకార్డుల ద్వారా తమ సమస్యలను తీసుకెళ్లారు. పాదయాత్రలో భాగంగా దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం కొత్తవలస జంక్షన్‌లో జరగనున్న బహిరంగ సభకు వెళ్తుండగా, వైద్యారోగ్య శాఖకు చెందిన కాంట్రాక్ట్‌ సిబ్బంది రోడ్డు పక్కనే నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. తమను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని అలా నిలబడే వేడుకున్నారు.

మరిన్ని వార్తలు