పబ్లిసిటీ కోసం ప్రాణాలతో చెలగాటం

29 Mar, 2019 09:42 IST|Sakshi
మసీదు బాల్కనీపై మదరసా విద్యార్థులు, అనంతపురం సర్వజనాస్పత్రిలో ఓ క్షతగాత్రురాలి పరిస్థితి 

బాబు సభకు మదరసా విద్యార్థుల తరలింపు

మసీదు బాల్కనీ కూలి 40 మందికిపైగా తీవ్ర గాయాలు

రాత్రి ‘అనంత’లోనే బస చేసినా పరామర్శించని సీఎం

టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: సీఎం చంద్రబాబు  ప్రచార యావ  పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది.  బుధవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రం సప్తగిరి సర్కిల్‌లో టీడీపీ బహిరంగ సభ జరిగింది.అయితే సభకు చంద్రబాబు వస్తున్నా.. జనం రాకపోవడంతో బెంబేలెత్తిన టీడీపీ శ్రేణులంతా  జనాన్ని తీసుకొచ్చేందుకు తలో దిక్కుకు పరుగులు పెట్టారు.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైనార్టీ నేత షకీల్‌షఫి తాను ముతవల్లీగా ఉన్న జామియా మసీదుకు అనుబంధంగా కొనసాగుతున్న మదరసా నుంచి హడావుడిగా విద్యార్థులను తీసుకొచ్చారు. అయితే నిబంధనల ప్రకారం మదరసా విద్యార్థులను రాజకీయ పార్టీల సభలకు తీసుకురాకూడదు. కానీ, సీఎం చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకు షకీల్‌షఫి వారిని తీసుకొచ్చి..వారి చేతికి పూల బుట్టలిచ్చి మసీదు బాల్కనీపైకి ఎక్కించి సీఎంపై చల్లాలని సూచించారు. దీంతో చిన్నారులంతా పూలు చల్లే క్రమంలో ఒక్కసారిగా గెంతడంతో బాల్కనీ కూలిపోయింది. ఘటనలో పైన ఉన్న మదరసా చిన్నారులతో పాటు.. మసీదులో ప్రార్థనలు చేసేందుకు వచ్చినవారు.. బాల్కనీ కింద ఉన్న పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన షకీల్‌షఫి.. తనకు చెడ్డపేరు వస్తుందనే భయంతో రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తరలించకుండా ప్రైవేటు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. వారి పరిస్థితి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. 

ముస్లింలు తమ వెంటే ఉన్నట్లు ప్రచారం కోసమే! 
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు పూర్తిస్థాయిలో తమ వెంటే ఉన్నారని ప్రచారం చేసుకునేందుకే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జామియా మసీదు ముతవల్లి షకీల్‌ షఫి మదరసా విద్యార్థులను తరలించారని ముస్లిం మత పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు.  

పరామర్శించని సీఎం చంద్రబాబు
బహిరంగ సభ జరుగుతున్న సమయంలో మసీదు బాల్కనీ కూలి దాదాపు 40 మందికి పైగా గాయపడినా.. చంద్రబాబు పట్టించుకోలేదు.  క్షతగాత్రులను పరామర్శించేందుకు రాలేదు. దీంతో ఆయనకు ఓట్లు కావాలి కానీ.. జనం పాట్లు పట్టవా అంటూ క్షతగాత్రుల బంధువులు విమర్శించారు. 

మరిన్ని వార్తలు