వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి

13 Jan, 2020 04:56 IST|Sakshi
మూడు రాజధానుల ఏర్పాటు కోరుతూ రైల్వేకోడూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రజలు

రైల్వే కోడూరులో భారీ ర్యాలీ 

రైల్వేకోడూరు: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరులో ప్రజలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు పురోభివృద్ధి సాధిస్తాయని స్పష్టం చేశారు. ర్యాలీ రెండు కిలోమీటర్ల మేర జరిగింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజలందరూ ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. 

విశాఖ ఎందుకు వద్దో చెప్పండి?
నెల్లిమర్ల/విజయనగరం పూల్‌బాగ్‌: రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణతోనే విజయనగరం జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయుల ఆస్తుల విలువ పెంచుకునేందుకే లేనిపోని ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన అశోక్‌గజపతిరాజు కూడా విజయనగరం అభివృద్ధిని విస్మరించి ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడానికే విశాఖలో రాజధాని వద్దని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట జంక్షన్‌ వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. 
నెల్లిమర్లలో ర్యాలీలో పాల్గొన్న నేతలు,ప్రజలు 

మూడు రాజధానులకు మద్దతుగా కుప్పంలో భారీ ర్యాలీ
కుప్పం: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చంద్రమౌళి తనయుడు భరత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతి చుట్టూ వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని, వాటి విలువ తగ్గిపోతుందనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సమగ్ర అభివృద్ధే ముద్దు
రామచంద్రపురం రూరల్‌: మూడు రాజధానులకు మద్దతుగా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందితో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం, బాపనయ్యచెరువు, నెలపర్తిపాడు, వెలంపాలెం, హసన్‌బాద, ఉండూరు, కాపవరం, కందులపాలెం గ్రామాల్లో ఈ ర్యాలీ సాగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు కావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. యువతరం, మహిళలతో పాటు వృద్ధులు కూడా ఈ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వేణు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఒక్కచోటే అభివృద్ధి వద్దు..
పాలకొండ: ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలతో పాలకొండ పట్టణం హోరెత్తింది.. ఆదివారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీవో సంఘం, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు వేల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా