శ్మశానాలనూ వదలడం లేదన్నా.. 

23 Sep, 2018 04:37 IST|Sakshi
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రామవరం వద్ద అవ్వలు కోరడంతో వారితో కలిసి సెల్ఫీ దిగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

మంత్రి గంటా అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు పలువురి ఫిర్యాదు

పార్టీపరమైన వివక్ష చూపుతూ పథకాలు అందకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు

ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో అప్పుచేసి మరీ తన భర్తకు వైద్యం చేయించుకున్నానన్న ఓ సోదరి 

మనందరి ప్రభుత్వం రాగానే అందరి కష్టాలు తీరతాయని వైఎస్‌ జగన్‌ భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రభుత్వ భూములను వదలడం లేదు.. ఎక్కడబడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నారు.. చెరువులు, శ్మశానాలనూ ఆక్రమించేస్తున్నారు’ అంటూ చందక గ్రామానికి చెందిన జి.రమణ, డి.రమణలు జననేతకు ఫిర్యాదు చేశారు. గంటా అనుచరులు అబ్దుల్‌చౌదరి, పి.గోవిందులు ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని.. ఆ భూమిలో శ్మశాన భూమి, చెరువులు కూడా ఉన్నట్లు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 267వ రోజు శనివారం విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం కోలవానిపాలెం, కోలవానిపాలెం క్రాస్, భీమేంద్రపాలెం, ఎర్రవానిపాలెం, రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు సాగింది. దారి పొడవునా జనం పెద్ద సంఖ్యలో జననేతకు ఘన స్వాగతం పలుకుతూ ఆయన అడుగులో అడుగులు వేశారు. వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. 
 
అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారన్నా.. 
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై పాలక పార్టీ వారు వివక్ష చూపుతున్నారని, అధికారులు సైతం అదే రకమైన వివక్షతో ప్రభుత్వ పథకాలను అందకుండా చేస్తున్నారని ఆనందపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు జగన్‌ ఎదుట వాపోయారు. ఇళ్లను కూడా అధికారులు టీడీపీ వారికే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని చెబుతూ.. టీడీపీ వారికి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్లు, పింఛన్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని తమ్మయ్యపాలేనికి చెందిన గిరిజనులు, భర్తను కోల్పోయిన తమకు పింఛన్‌లు ఇవ్వడం లేదని భీమన్నదొరపాలేనికి చెందిన బంగారమ్మ, కోలవానిపాలేనికి చెందిన దాసరి పద్మ, తన భర్త అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో అప్పు చేసి వైద్యం చేయించాల్సి వచ్చిందని సూర్యకాంతం తదితరులు జననేత వద్ద మొరపెట్టుకున్నారు.  
 
విజయనగరం మున్సిపాల్టీలో సీనియర్‌ సిటిజన్లకు అన్యాయం 
పాదయాత్ర విజయనగరం సరిహద్దులు సమీపిస్తుండటంతో ఆ జిల్లా వాసులు కూడా వైఎస్‌ జగన్‌కు ఎదురేగి తమ కష్టాలు చెప్పుకొంటున్నారు. విజయనగరం మున్సిపాల్టీలో సీనియర్‌ సిటిజన్లకు అన్యాయం జరుగుతోందని.. 65 ఏళ్లు దాటినా పింఛన్లు ఇవ్వడం లేదని నారాయణరావు ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే అందరి కష్టాలూ తీరతాయని భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన ఎండీ ముజరుద్దీన్, రహమ్‌తుల్లా ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మైనార్టీలు జగన్‌కు ఎదురేగి.. ఆయన యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఒక రక్షను కట్టారు.  
వైఎస్‌ హయాంలో ఉద్యోగులకు లబ్ధి  
ఉద్యోగంలో చేరినప్పుడు రూ.2 వేలు జీతం తీసుకునే నాకు.. మహానేత దయవల్ల రిటైర్‌ అయ్యే సమయానికి రూ. 90 వేలు అందుకున్నాను. పోలీసు శాఖలో సిబ్బంది ప్రయోజనాల కోసం వైఎస్‌ ఎంతో కృషిచేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డను బీమందొరపాలెం వద్ద కలిశాను. వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీఎం కావడం తథ్యం.. 
– ఎం ఆనందరావు, రిటైర్డ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్, విజయనగరం

జాబు రావాలంటే జగనన్న రావాలి 
అన్నా.. నేను డిప్లమా చదువుతున్నాను. ఈ ప్రభుత్వం ఉంటే ఉద్యోగాలు వచ్చేలా లేవు. నువ్వు అ«ధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పించన్నా.. మా ఆశలన్నీ నీ మీదే. నువ్వు కచ్చితంగా సీఎం అవుతావు. నువ్వొస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుంది.
– జగన్‌తో మహేంద్ర 

మేఘఛత్రం.. అభిమాన వర్షం  
జిల్లాలో అడుగు పెట్టింది మొదలు కొన్ని చోట్ల సూరీడు కాస్త చిటపటలాడినా.. జననేత వెంట నేనున్నానంటూ వరుణుడు వర్షించాడు. ప్రతి నియోజకవర్గ సరిహద్దుల్లో జడివానతో పలుకరించాడు. కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసినా లెక్కచేయకుండా తన కోసం ఎదురు చూస్తున్న వేలాది మందిని ఉత్సాహపరుస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. భారీ వర్షం వల్ల ఒక్కరోజు తప్పనిసరై పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది.   

కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. 
అవ్వాతాతలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తుల వారు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరట పొందారు. ఒక్క పథకం వర్తింప చేయడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందరి కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డి.ఎర్రవరం జంక్షన్‌లో జోరువానలోనే వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఇసుకేస్తే రాలనంతగా జనం 
గ్రామీణ జిల్లాలో నర్సీపట్నంలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పాయకరావుపేట, యలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి మీదుగా సాగింది. ఇక సిటీలో విశాఖ పశ్చిమలో అడుగుపెట్టిన పాదయాత్ర విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, తూర్పు, భీమిలి నియోజకవర్గాల మీదుగా సాగింది. ఏజెన్సీ పరిధిలోని అరకు, పాడేరుతో పాటు విశాఖ సిటీలోని గాజువాక మినహా 12 నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర చేశారు. తొమ్మిది బహిరంగ సభల్లో జననేత ప్రసంగించారు. ప్రతి సభకూ జనం పోటెత్తారు. విశాఖలోని కంచరపాలెంలో జరిగిన బహిరంగ సభ పూరీ జగన్నాథ రథయాత్రను తలపించింది. దీంతో విశాఖ జనసంద్రమైంది. సీఎం చంద్రబాబు, ఈ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల అవినీతి బాగోతాలను జననేత ఎండగట్టినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక చంద్రబాబు మాటలు నమ్మబోమని ప్రతి సభలోనూ జనం ప్రతిస్పందించారు. విశాఖలో బ్రాహ్మణులు, ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సుల్లో జననేత పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశానికి కూడా విశాఖ వేదికైంది. మరో వైపు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌తో పాటు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. మొత్తంమీద పాదయాత్ర వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపితే, టీడీపీ వెన్నులో వణుకు పుట్టించింది. 

మరిన్ని వార్తలు