జన్మభూమి కమిటీల ఆగడాలు మితిమీరాయన్నా..

19 Dec, 2018 02:34 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రేగులపాడులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు సమస్యలు వివరిస్తున్న క్యాలీఫ్లవర్, పెసర, టమాట రైతులు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న జనం 

ప్రశ్నిస్తే చాలు తీవ్రంగా వేధిస్తున్నారు.. 

సంక్షేమ పథకాలన్నీ టీడీపీ వాళ్లకే ఇస్తున్నారు.. 

‘తిత్లీ’ పరిహారంలో రాజకీయం చేస్తున్నారు.. 

అచ్చెన్నాయుడి దౌర్జన్యాలు పెరిగిపోయాయి.. 

అందరి కష్టాలు విని ధైర్యం చెప్పిన జగన్‌  

అక్రమార్కులను ఇంటికి పంపాలని పిలుపు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల అవినీతి, వేధింపులు భరించలేకపోతున్నాం. నాలుగున్నరేళ్లుగా సామాన్యులు మొదలుకుని ఎవరినీ విడిచిపెట్టడం లేదు. పార్టీ పేరు చెప్పి సంక్షేమ పథకాలలో అర్హులైన నిరుపేదలను అడ్డగోలుగా దూరం పెడుతున్నారు. ఇళ్లు, పెన్షన్లు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, పంట రుణాలు.. ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ లంచాలు ఇచ్చిన వారికేనంటూ పీడిస్తున్నారు’ అని వివిధ గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 324వ రోజు మంగళవారం ఆయన నరసన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని టెక్కలి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర సాగిన మార్గంలో జనం భారీగా తరలివచ్చి జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూనే సమస్యలూ చెప్పుకున్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడి ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెథాయ్‌ తుపాను ప్రభావంతో చిరుజల్లులు పడుతున్నా జగన్‌ యాత్రను కొనసాగించారు.


 
అడుగడుగునా వివక్ష  
ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు సైతం జన్మభూమి కమిటీలు అడ్డం పడుతున్నాయని దరివాడకు చెందిన నల్ల రామయ్య జగన్‌ దృష్టికి తీసుకొచ్చాడు. తనకంటే వెనక దరఖాస్తు చేసిన టీడీపీ సానుభూతిపరులకు రుణాలు ఇచ్చారని ఆయన వాపోయాడు. జన్మభూమి కమిటీల పేరుతో మంత్రి అనుచరులు ఇళ్లు, పెన్షన్లు, తిత్లీ నష్టపరిహారంలో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని సౌడాం గ్రామానికి చెందిన చెట్టు దమయంతి జగన్‌కు ఫిర్యాదు చేసింది. రాజకీయ స్వార్థం కోసం తన కుటుంబంలో మంత్రి అనుచరులు తగాదాలు పెట్టి తన భర్తను దూరం చేశారని, తనను న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్నారని చింతలగారకు చెందిన వండాన దేవి కన్నీరు పెట్టుకుంది. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులమని తిత్లీ నష్ట పరిహారం అందజేయడంలో వివక్ష చూపుతున్నారని దరివాడలో రైతు కొన్నాన సింహాచలం, వివక్షతో ఇల్లు మంజూరు చేయలేదని దన్నాన లలిత, రెండున్నర ఎకరాల్లో క్యాబేజీ, టమాటా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా పరిహారం ఇవ్వలేదని రేగులపాడుకు చెందిన రైతు గొలివి శ్రీనివాసరావు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 

ఇలాగైతే ఎలా బతకాలన్నా.. 
మంత్రి ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ఊళ్లు ఖాళీచేసి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు జగన్‌కు విలపిస్తూ చెప్పారు. తమకు నచ్చిన వారికే పథకాలిస్తామని, ఎవరైనా సరే తాము చెప్పిందే చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు. తిత్లీ తుపాను పంట నష్టం అర్హులకు కాకుండా మంత్రి సిఫార్సు ఉన్న వారికి మాత్రమే అందచేశారని చెప్పారు. 30 సెంట్లు భూమి కూడా లేని టీడీపీ కార్యకర్తలకు లక్షల్లో పరిహారం ఇచ్చారని, భారీగా పంట నష్టపోయిన వారికి మొండి చేయి చూపించారని పోలాకి మండలం మిరియాబెల్లిపేటకు చెందిన రైతు బగాది అర్జునరావు కన్నీటిపర్యంతమయ్యాడు. కేంద్ర నిధులతో చేస్తోన్న పనులను మంత్రి బంధువులు, బినామీ కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారని సౌడాం గ్రామానికి చెందిన సింహాచలం ఫిర్యాదు చేశాడు. నాణ్యతలేని పనులు చేస్తున్నారని ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అవినీతిపై సౌదాం గ్రామస్తులు సంయుక్తంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహానేత వైఎస్‌ 400 ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే వాటిలో 200 పట్టాలు రద్దు చేయించి, మంత్రి అనుచరులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్తపేట వాసి దుక్క రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలను సైతం కనికరించకుండా కుంటిసాకులతో ఇళ్లను రద్దు చేయిస్తున్నారని జగన్‌కు చెప్పుకున్నారు. పెథాయ్‌ తుపాన్‌తో పంటలు దెబ్బతిన్నాయని రైతులు జగన్‌ దృష్టికి తెచ్చారు.  

ఆశలన్నీ మీపైనే.. 
మీరు సీఎం కాగానే లింగాలవలస ఎత్తిపోతల పథకం ద్వారా మా గ్రామానికి సాగు నీరందించాలని దరివాడ మాజీ సర్పంచ్‌ పైడి విఠల్‌రావు, రైతులు దుంగ నారాయణరావు, కొర్ని ప్రకాశరావు తదితరులు జగన్‌ను కోరారు. రాజశేఖరరెడ్డి చలువతో జలుమూరు మండలం జోనంకిలో ఏర్పాటైన వెంకటాపురం ఎత్తిపోతల పథకాన్ని ఈ సర్కారు నీరుగార్చిందని ఊడిగలపాడు రైతు మామిడి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్‌ హయాంలో తమను ఎస్టీలుగా గుర్తించారని, ఇప్పుడా పరిస్థితి లేదని.. మీరు సీఎం కాగానే న్యాయం చేయాలని ఏనేటి కొండ కులస్తులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. అందరికీ ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఒక్కటై అక్రమార్కులను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.      

పేదరికంలో మగ్గిపోతున్నామయ్యా.. 
ఒరియా బ్రాహ్మణులం పేదరికంలో మగ్గిపోతున్నాం. కంద దుంపలు పండించి విక్రయించగా వచ్చే అరకొర ఆదాయంతో బతుకుతున్నాం. ప్రకృతి విపత్తులతో పూర్తిగా నష్టపోయాం. తినటానికి తిండి లేని పరిస్థితి. మేం ఉన్నామని గుర్తించే నాథుడే లేడు.  కనీసం పిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించలేని దుస్థితి మమ్మల్ని వెంటాడుతోంది. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోయాం. మీరు సీఎం కాగానే మమ్మల్ని బీసీలుగా గుర్తించండి.      
– నీలాద్రి పాడీ, ఒరియా బ్రాహ్మణుల సంఘం జిల్లా సెక్రట్రరీ, శ్రీకాకుళం. 

మంత్రి అరాచకాలు భరించలేకపోతున్నాం 
అన్నా.. మంత్రి అచ్చెన్నాయుడు అరాచకాలు మితిమీరాయి. భరించలేకపోతున్నాం. ఇటీవల తిత్లీ తుపానులో పంట నష్ట బాధితుల్లో నిజమైన అర్హులకు న్యాయం జరగలేదు. ఆయన చెప్పిన వారికి మాత్రమే పరిహారం అందించారు. 30 సెంట్లు భూమి లేని టీడీపీ కార్యకర్తలకు లక్షల్లో పరిహారం ఇచ్చి, భారీగా పంట నష్టపోయిన రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు. సుమారు 4 వేల మంది అర్హులకు న్యాయం జరగలేదు. 
– బగాది అర్జునరావు, మిరియాబెల్లిపేట, పోలాకి మండలం  

వైఎస్‌ పాలన మీతోనే సాద్యం... 
మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్న నడిచి వచ్చినట్లుంది. మీ నాన్నగారి పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు వర్తింపజేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రచారం మినహాయిస్తే పథాకాల అమలు అధ్వానంగా ఉంది. మా గ్రామంలో అధికార పార్టీ అనేది సంక్షేమ పథకాలకు అర్హతగా భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పేరు చెబితే ఉన్న సంక్షేమాన్ని కూడా దూరం చేస్తున్నారు. మీరు సీఎంగా రావాలి. మా కష్టాలు తీరాలి. 
    – పట్టా అప్పన్న, తిలారు, కోటబొమ్మాళి మండలం. 

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి 
శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర శిబిరంలో మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ విలువల కోసం వైఎస్‌ జగన్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైఎస్‌ అడుగుజాడల్లో జగన్‌ నడుస్తున్నారని, తిరిగి రాజన్న రాజ్యం రావడం ఖాయం అన్నారు. ఆనాడు ఎన్‌జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, తర్వాత ఇందులో 61 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్‌ గౌతు లచ్చన్నలకు ముఖ్య అనుచరుడు. 

మరిన్ని వార్తలు