పింఛన్లు పీకేస్తున్నారు

17 Aug, 2018 02:46 IST|Sakshi
విశాఖ జిల్లా ఎరకంపేటక్రాస్‌ వద్ద ఓ అవ్వ ఆవేదన వింటున్న వైఎస్‌ జగన్‌

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన జనం

     గూడు లేనోళ్ల గోడు వినట్లేదు.. కాసులిస్తేనే రేషన్‌కార్డులిస్తారట 

     జబ్బు చేస్తే సర్కారు వైద్యం అందడం లేదు.. 

     వందల్లో డెంగీ కేసులు నమోదవుతున్నా సర్కారులో చలనం లేదు 

     ప్రభుత్వ పథకాలు పొందేందుకు మాకు అర్హత లేదా? 

     జన్మభూమి కమిటీలకు లంచాలిచ్చుకోలేమని ఆవేదన 

     అందరి కష్టాలు విని ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘బతకలేక బతుకుతున్నామయ్యా.. అణిచి వేస్తున్నారు.. అణిగిమణిగి ఉండాలంటున్నారు.. లేకుంటే బువ్వ ఉండదట.. కాసులిస్తేనే రేషన్‌ కార్డులిస్తున్నారు.. పగబట్టి మరీ పింఛన్లు పీకేస్తున్నారు’ అంటూ అనేక మంది ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలనలో సాగుతున్న దౌర్జన్యాలను ఏకరవు పెడుతూ.. వారు అనుభవిస్తున్న నరకయాతనను అభిమాన నేతకు చెప్పుకుని బావురుమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 238వ రోజు గురువారం జగన్‌.. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో పాదయాత్ర సాగించారు. డి.ఎర్రవరం జంక్షన్, ఎరకంపేట, ములగపూడి శివారు వరకు సాగిన యాత్రలో అన్ని వర్గాల ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన నేతకు మంగళహారతులు పడుతూ.. పూలబాటలు పరిచారు. జయజయ ధ్వానాలతో నినదించారు. ఆప్యాయంగా పలకరించారు. అడుగులో అడుగేస్తూ ఆనందపడ్డారు. కష్టాలూ చెప్పుకున్నారు. 

డెంగీ చంపేస్తున్నా.. పట్టించుకునే దిక్కులేదు 
డెంగీ వ్యాధి కోరలు చాచి కబళిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదంటూ నర్సీపట్నం పరిసర ప్రాంతాల గిరిజనులు  జగన్‌ ఎదుట వాపోయారు. ‘సర్కారీ వైద్యం అందడం లేదు.. సర్కారు మొద్దు నిద్రలో ఉంది.. వణికిపోతూ ప్రాణాలు కోల్పోతున్నాము’ అని నర్సీపట్నం శివారుకు చెందిన పోచయ్య వాపోయాడు. మారుమూల పల్లెలకు రహదారి లేదని, ప్రాణం మీదకొస్తే చేతులమీదే పట్నం తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నాడు. దోమల నివారణకు ఎలాంటి చర్యలు లేవన్నాడు. వేలకు వేలు ఖర్చుపెట్టి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేకపోతున్నామని తెలిపాడు. డెంగీ కేసులు వందల్లో నమోదవుతున్నాయని స్థానిక వైద్యులు సైతం తెలిపారు. ఐటీడీఏ పథకాలే తమకు తెలియవని గోలుగొండ మండలానికి చెందిన గిరిజనులు జగన్‌ దృష్టికి తెచ్చారు. లక్షలాది గిరిజనుల పరిస్థితి ఇదేనంటూ వాపోయారు. మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక న్యాయం చేయాలంటూ అర్జీలిచ్చారు.  

అందరి నోటా అదే మాటే.. 
ఈ సర్కార్‌కు ఇంత నిర్దయేంటయ్యా.. అంటూ ములగపూడి గ్రామానికి చెందిన దలియ వరలక్ష్మి ప్రశ్నించింది. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలను భారంగా పోషించుకుంటోందామె. ప్రభుత్వ పథకం తీసుకునే అర్హత లేదా.. అని వాపోయింది. ఈ ప్రభుత్వం పోవాలని, జగన్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానంది. ‘చంద్రబాబు టోకరా వేశాడు సారో..’ అని నెక్కంటి వెంకటలక్ష్మి అనే మహిళ చెప్పుకొచ్చింది. ఆయన రుణమాఫీ హామీ నమ్మి నట్టేట మునిగిపోయానంది. రూ.70 వేల బ్యాంకు రుణం మాఫీ కాలేదట. బ్యాంకు నోటీసులు మీద మీద వస్తోంటే అప్పు చేసి మరీ కట్టిందట. జగనన్న ప్రకటించిన నవరత్నాలు విని గుండె ధైర్యమొచ్చిందని, ఆయన అధికారంలోకి రావాల ని ఊరూవాడా చెబుతున్నానని తెలిపింది. చంద్రన్న బీమా పథకానికి ప్రీమియం చెల్లించినా బాండే ఇవ్వలేదని కేతరవరపు వెంకటరమణ  ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

పదిసార్లు దరఖాస్తు చేశా.. 
నా మనవడు అధికారంలోకి వస్తాడు.. నాకు పెన్షన్‌ వస్తుందని 80 ఏళ్ల కొప్పాక భాస్కరం అనే వృద్ధుడు అన్నాడు. పదిసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయానన్నాడు. ‘నేను కాదయ్యా.. ఈ ప్రభుత్వం అవిటిది.. గుడ్డిది..’ అని నారాయణమ్మ అనే మహిళ  రోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పక్షవాతంతో చేతులు పని చేయడం లేదామెకు. మాట సరిగా రావడం లేదు. ఆదాయం లేదు. అయినవాళ్లపై ఆధారపడి బతకడం చిన్నతనంగా ఉందని తెలిపింది. పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని.. జన్మభూమి కమిటీ సిఫార్సు కావాలంటున్నారని.. వాళ్లకు లంచాలిచ్చుకునే స్థితి నాకెక్కడిదని వాపోయింది. తన గోడు జగన్‌కు చెప్పుకోవడంతో ఊరట లభించిందని తెలిపింది. అందరి కష్టాలను ఓపికగా విన్న జగన్‌.. అందరికీ ధైర్యం చెప్పారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.  

కాదంటే కన్నెర్ర.. ఇదెక్కడి అన్యాయం? 
పల్లెల్లో పచ్చచొక్కా ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు జననేతకు తెలిపారు. అనుకూలంగా లేకపోతే వెంటాడి వేధిస్తున్నారని, తాడిత పీడిత జనాలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. 40 ఏళ్ల క్రితం మంజూరైన పింఛన్‌ను తెలుగుదేశపోళ్లు తీసేశారంటూ ములగపూడికి చెందిన మహాలక్ష్మి తెలిపింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉండటమే కారణమని జన్మభూమి కమిటీలు అంటున్నాయని చెప్పింది. ఇదెక్కడి అన్యాయమని అధికారులను నిలదీసినా ఏమాత్రం కనికరించడం లేదని కన్నీరు పెట్టుకుంది. ఐదేళ్ల క్రితం మంజూరైన ఇంటికి టీడీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదని నాతవరం మండలానికి చెందిన ఎన్నుకోటి శృతి తెలిపింది. అప్పు చేసి ఇల్లు పూర్తిచేశానంది. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే దిక్కేలేదంది. జగనన్నకు చెప్పామంది. అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు