రావాలయ్యా.. నువ్వే కావాలయ్యా..

25 May, 2018 06:53 IST|Sakshi
ఉపాధ్యాయులతో కలసి ఫ్ల కార్డు పట్టుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పశ్చిమగోదావరి : ఉద్యోగులకు భద్రత లేదు.. దళితులకు రక్షణ లేదు.. కాలనీలపై కనికరం లేదు.. ఇన్ని లేనప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? అంటే.. ఉంది..! ఇసుక మాఫియాలో.. మద్యం దందాలో.. వైఎస్సార్‌ సీపీ అనుకూలురుపై కక్ష సాధింపులో టీడీపీ పాలకులు బిజీగా ఉన్నారు. అందుకే గురువారం కూడా జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు వినతులు వెల్లువెత్తాయి. ఆయన పాలన కోసం కళ్లనే కర్పూర హారతులు చేసి స్వాగతం పలుకుతున్నారు.

సీపీఎస్‌ రద్దు కోరుతూ విజ్ఞప్తి
ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేస్తోన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌)రద్దు చేయడానికి కృషి చేయాలని కోరుతూ గణపవరం మండల సీపీఎస్‌ ఉద్యోగులు వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు గురువారం గణపవరం మండల సరిపల్లె శివారున జగన్‌మోహన్‌రెడ్డి బస చేసిన ప్రాంతానికి ప్రదర్శనగా వచ్చారు. వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మూడు, నాలుగు దశాబ్దాలు ప్రభుత్వానికి సేవచేసిన ఉద్యోగులకు పింఛను సదుపాయం శ్రీరామరక్ష అని, అలాంటి పింఛను విధానం రద్దు చేసి ఉద్యోగుల గొంతుకోయడం ఈ ప్రభుత్వానికి తగదని అన్నారు. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగులకు కలిగే నష్టాలను వివరించారు. ఈ సమస్యపై ఇప్పటికే పలు చోట్ల తమ పార్టీ విధానం ప్రకటించామని, తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తామని వారికి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగులతో పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వారి చేతిలోని ఫ్లకార్డు పట్టుకుని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం సీపీఎస్‌ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పుప్పాల సూర్య ప్రకాశరావు, బి.రమేష్, మద్దాల వెంకటేశ్వరరావు, టి.వెంకటేశ్వర్లు, సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.   

నా భర్తకు ఇక్కడపోస్టింగ్‌ ఇప్పించన్నా..
ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా నా భర్తకు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆర్‌టీసీ డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పడు భీమవరం డిపోలో పనిచేసేవారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎక్కడి వారు అక్కడకు వెళ్లాలనడంతో నా భర్త మళ్లీ రంగారెడ్డి వెళ్లవలసి వచ్చింది. కుటుంబం అంతా సరిపల్లిలోనే ఉంటున్నాం. నా భర్తకు భీమవరంలో పోస్టింగ్‌ ఇచ్చే విధంగా కృషి చేయన్నా అంటూ గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన మందలంక కిరణ్‌కుమారి సరిపల్లి పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.-మందలంక కిరణ్‌కుమారి, సరిపల్లి

>
మరిన్ని వార్తలు