అడుగుకో కన్నీటి గాథ..!

25 May, 2018 07:21 IST|Sakshi
ఉండి మండలం ఆరేడు వద్ద అశేషజనవాహినికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

ఉప్పొంగిన ప్రజాభిమానం

వెల్లువెత్తిన సమస్యలు  

అడుగడుగునా హారతులు

రక్షణ లేని అక్కచెల్లెళ్లు.. ఉపాధి లేనితమ్ముళ్లు.. కష్టానికి తగ్గ ఫలితం లేని కార్మికులు, కర్షకులు.. వయోభారం, అనారోగ్యంతోఆసరా లేని జీవులు.. ఇలా ఒక్కొక్కరిదీఒక్కో బాధ.. అడుగుకో గాథ.. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీఅధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందరికష్టాలు విని చలించిపోతున్నారు. దుష్టపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భరోసా ఇస్తున్నారు. అడుగడుగునాబాధాద్రష్టులకు ధైర్యం చెబుతూ.. సర్కారుపై సమరశంఖం పూరిస్తూ.. ముందుకుసాగుతున్నారు. ఇది సంక్షేమ యాత్ర..ప్రజాసంకల్ప యాత్ర అని నిరూపిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు : వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. తమ సమస్యలు చెప్పుకుని కడగండ్లు తీర్చాలని విన్నవిస్తున్నారు. అనారోగ్య బాధలు, సొంతింటి కోసం వినతులు.. సేద్యానికి సాయం లేక అన్నదాతలు, ఆక్వా రైతుల ఆవేదనలు.. పల్లెల్లో దాహార్తి కేకలు.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులతో జగనన్న వద్దకు తరలివస్తున్నారు. వారందరి కష్టాలను జననేత ఓర్పుగా విని.. నేనున్నానని భరోసా ఇస్తున్నారు. కన్నీళ్లు తుడుస్తూ.. ధైర్యం చెబుతూ.. ముందుకు సాగుతున్నారు. జన సంక్షేమమే తన అజెండా అని నిరూపిస్తున్నారు.

గురువారం యాత్ర సాగిందిలా..
ప్రజా సంకల్పయాత్ర 170వ రోజు గురువారం ఉదయం 8.35గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం సరిపల్లి శివారు నుంచి ప్రారంభమై ఆరేడు వద్ద ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడ ఆ నియోజకవర్గ పార్టీ కన్వీనర్‌ పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు జననేతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆరేడు, ఉప్పులూరు క్రాస్, కోలమూరు, పాములపర్రు, వెంకట్రాజుపురం మీదుగా పెదకాపవరం గ్రామం వరకూ యాత్ర సాగింది. అడుగడుగునా జననేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెళ్లు హారతులు పట్టారు. విజయీభవ అంటూ దీవించారు. యువత ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించింది.  భారీజన సందోహం మధ్య జగన్‌ పాదయాత్ర సాగింది.

ఆక్వా రైతుల ఆనందం
ఆరేడులో ఆక్వా రైతులు జగనన్నను కలిసి చేపలు, రొయ్యల చెరువుల రైతులకు వరాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పాములపర్రు దాటిన తర్వాత కొందరు ఆక్వా రైతులు కలిసి ధరలు తగ్గిపోవడం, నీటి లభ్యత లేకపోవడంపై జగన్‌కు మొరపెట్టుకున్నారు. కోలమూరులో తిరుపతిరాజు  తన ఒంగోలు గిత్తను జననేతకు చూపించి మురిసిపోయారు. భీమడోలు మండలం పూళ్ల నుంచి వచ్చిన ప్రజలు తమ గ్రామంలో అధికార పార్టీ నేతలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి అక్రమంగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదు చేశారు. వెంకట్రాజుపురం గ్రామ శివారులో ఎస్టీ కాలనీ వాసులు జననేతను కలిసి ఉండి నియోజకవర్గంలో తమది ఏకైక కాలనీ అని, సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీసం అధికారులు కులధ్రువీకరణ పత్రాలూ ఇవ్వటంలేదని గోడు వెళ్లబోసుకున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ వల్ల తాము నష్టపోతున్నామని ఆరేడులో ఉద్యోగులు జననేతను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని విన్నవించారు.

తరలివచ్చిన పార్టీ శ్రేణులు
పాదయాత్రకు పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ జిల్లా పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్,  ఉండి కన్వీనర్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, ఉంగుటూరు  కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే  పాతపాటి సర్రాజు, గాదిరాజు సుబ్బరాజు, వంక రవీంద్రనాథ్, డాక్టర్‌ వేగిరాజు రామకృష్ణంరాజు, మంతెన బాబు, మేడిది జాన్సన్, గూడూరి ఉమాబాల, జక్కంపూడి రాజా, దిరిశాల కృష్ణశ్రీనివాస్, కమ్మ శివరామకృష్ణ, అల్లూరి వెంకటరాజు, ఏడిద వెంకటేశ్వరరావు, మేకా శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

మీరు ముఖ్యమంత్రి అయితేనే మాకు మేలు  అడుగడుగునా ప్రజల స్పష్టీకరణ
గురువారం నాటి పాదయాత్రలో జననేతకు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి.  టీడీపీ నేతల దాష్టీకాలపై కాగుపాడు గ్రామస్తులు జగనన్న వద్ద ఏకరువు పెట్టారు. దళితులమైన తమపై అధికార పార్టీ నేతల అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయని, మీరు అధికారంలోకి వస్తేగానీ ఆ ఆగడాలకు అడ్డుకట్టపడదని, తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరు గ్రామమైన ఆగడాలలంక మహిళలు భారీ సంఖ్యలో జననేత వద్దకు వచ్చారు. తమ గ్రామంలో తాగునీరు కలుషితమవుతోందని, రంగుమారి దుర్వాసన వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కారం చూపించాలని వేడుకున్నారు. దీంతో జగనన్న శాశ్వత పరిష్కారం చూపిస్తానని మహిళలకు భరోసా ఇచ్చారు.  కొల్లేరు రీసర్వే చేసి అదనంగా వచ్చిన భూములను పేదలకు పంచుతానని పేర్కొన్నారు. మీ నుంచే ఒకరిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి కొల్లేరు సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు