జన సముద్రం.. C/o కంచరపాలెం!

10 Sep, 2018 07:08 IST|Sakshi
బహిరంగ సభకు లక్షల సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిలో ఓ భాగం

సునామీ వచ్చింది.. సముద్రం ఊరిమీదికి వచ్చేస్తోంది.. అప్పుడే కేజీహెచ్‌ దాటిపోయింది.. అదిగో జగదాంబ జంక్షన్‌ను కమ్మేసింది.. ఇదీ 2004లో సునామీ వచ్చినప్పుడు నగరంలో సాగిన ప్రచారం..
కానీ ఆ సునామీనే మించిన ఉప్పెన.. కాదు కాదు.. అంతకంటే మించిన స్థాయిలో.. ఇంకా చెప్పాలంటే సప్తసముద్రాలు కలిసిన పోటెత్తినంత తీవ్రస్థాయిలో కెరటాలు నగరాన్ని తాకాయి.. ఉధృతంగా ఉవ్వెత్తున ఎగసిపడి కంచరపాలేన్ని ముంచెత్తాయి..అవి సాధారణ కెరటాలు కాదు.. నేతల, పార్టీల జాతకాలను మార్చేసే జన కెరటాలు..నగరానికి ఆనుకునే ఉన్న సాగర తరంగాలే చిన్నబోయేస్థాయిలో.. జనతరంగాలు కంచరపాలేన్ని జనకడలిగా మార్చేశాయి.. నగరంలోని అన్ని మూలలా చిన్న అలలుగా మొదలైన తరంగాలు.. సప్త సాగరాలు కలిసిన చందంగా ఏకమై ఉప్పెన స్థాయిలో ఉప్పొంగాయి.ప్రజాసంకల్ప సూరీడిని చూడాలన్నసంకల్పంతో.. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపునందుకొని ప్రభంజనంలా జనం తరలివచ్చారు.. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్లు సభాస్థలికి ఇటు అటూ సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా రోడ్డన్నదే కనిపించనంతగా అన్ని ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

పెద్ద పెద్ద భవనాలు, బస్‌షెల్టర్లను సైతం జనం ఆక్రమించారు.. అంచనాలకు మించి.. విశాఖ చరిత్రలోనే కొత్త శకం సృష్టించే రీతిలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు.. తమ ప్రియతమ నేత వై.ఎస్‌.జగన్‌ విశాఖలో అభివృద్ధి మందగించిన క్రమాన్ని గణాంకాలు, ఉదాహరణలతో వివరిస్తూ.. మహానేత వైఎస్సార్‌ హయాంలో జరిగిన ప్రగతితో పోల్చిచూపిన ప్రతిసందర్భంలోనూ కడలి ఘోషను మించిపోయేలా హర్షధ్వానాలతో హోరెత్తించారు.. మనందరి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తున్నప్పుడల్లా.. సీఎం.. సీఎం.. అంటూ నినదించారు.. సీఎం చంద్రబాబు అవినీతిని ఎండగట్టినప్పుడు.. చేతులెత్తి మరీ అంగీకారం తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం: ‘కేరాఫ్‌ కంచరపాలెం’.. ఇది ఇటీవల విడుదలైన సినిమా టైటిల్‌ కాదు..! విశాఖ నగరం కంచరపాలెంలో మహానేత వైఎస్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు పోటెత్తిన జనాన్ని చూసి అందరి నోట పలికిన మాట. వేలు కాదు.. లక్షలాది మంది జనం అభిమాన తరంగంలా జగన్‌ కోసం తరలివచ్చారు. విశాఖ చరిత్రలో మునుపెన్నడూ ఏ స¿భకూ రానంతమంది వచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఏ నేతకు దక్కనంత అత్యంత అరుదైన గౌరవాన్నిచ్చి జననేత పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నా నీవెంటే మేముంటామంటూ జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచారు. 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బహిరంగ సభ కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం సాయంత్రం జరుగుతుందని తెలుసుకున్న నగరవాసులు అక్కడకు వెళ్లడానికి ఉదయం నుంచే ఉవ్విళ్లూరారు. జగన్‌ సంకల్పానికి తామూ సంఘీభావం తెలపాలని, తమ అభిమాన జననేతను చూడాలని తపించారు. మధ్యాహ్నం నుంచి కంచరపాలెం వైపు అడుగులు వేయడానికి ఆరాటపడ్డారు. అలా ఆ జన సందోహంతో, వారి వాహనాలతో నగర రహదారులు కిక్కిరిసిపోయాయి. వీధులు, సందులు కిటకిటలాడాయి. అటు వైపు రోడ్లపై వెళ్లే మార్గం కనిపించకపోవడంతో వాహనాలు మరో మార్గాన్ని ఎంచుకున్నాయి. జననేత వైఎస్‌ జగన్‌ సభా ప్రాంగణానికి పాదయాత్రగా వెళ్తుంటే వెంట లక్షల పాదాలు ఆయన్ను అనుసరించాయి. జగన్‌ నడిచే దారి పొడవునా రోడ్డుపై అభిమానులు పూలు పరిచారు. తమ ప్రియతమ నేత నడిచి వెళ్తుంటే ఎక్కడికక్కడే పైనుంచి పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇరువైపులా ఉన్న మేడలెక్కి, భవంతుల అంతస్తులెక్కి తమ అభిమాన నాయకుడికి అభివాదాలు చేస్తూ కనిపించారు. ఆడ, మగ తేడా లేదు.. చిన్నా, పెద్దా భేదం లేదు.. అందరిలోనూ ఒక్కటే తపన. జననేతను చూడాలని.. ఆంతకుమించి రాజన్న తనయుడికి అండగా నిలవాలని! వృద్ధులు లేని ఓపికను తెచ్చుకుని మరీ సభకు తరలివచ్చారు. వికలాంగులు కూడా మేము సైతం అంటూ ఏదోలా సభా స్థలికి చేరుకున్నారు. ఇటు జ్ఞానాపురం, తాటిచెట్లపాలెం ప్రాంతాల నుంచి, అటు ఎన్‌ఏడీ, ఊర్వశి కూడలి నుంచి వచ్చే రోడ్లు కిలోమీటర్ల మేర ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. జననేత జగన్‌ ను చూడగానే అందరి మోములు వికసించాయి. పాదయాత్ర సమయంలో మార్గమధ్యలో ఎందరో సెల్ఫీలు దిగారు. రోడ్డుపైకి రాలేనివారు తమ ఇళ్ల నుంచి జగన్‌ పాదయాత్ర దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఇక సభలో జననేత ప్రసంగాన్ని పలువురు అభిమానులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి సభికులు జేజేలు పలుకుతూ తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

సహకరించిన ప్రకృతి..
ఇక జననేతకు ప్రకృతి కూడా తన వంతు సహకరించింది. ఉదయం నుంచి సాయంత్రంవరకు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగనీయలేదు. ఉదయం గోపాలపట్నంనుంచి బయలుదేరే సమయంలో చిరుజల్లులు కురిశాయి. ఆ తర్వాత సాయంత్రం సభ ముగిసేవరకు ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని చల్లదనం పరిచాయి.

అంచనాలకు మించి.. రికార్డు సృష్టించి..
విశాఖ కంచరపాలెం మెట్టు వద్ద జరిగే జగన్‌ సంకల్పయాత్ర సభకు లక్ష మంది వస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంచనా వేశారు. అధికార పార్టీ నాయకులు అంతమంది జనం ఎక్కడొస్తారులే! అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ విశాఖ వాసులు బ్రహ్మరథం పట్టారు. లక్షల్లో పోటెత్తి తమ అభిమానాన్ని ఏకపక్షంగా చాటుకున్నారు. ఈ మహా ప్రభంజనాన్ని ఊహించని పోలీసు, కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు సభకొచ్చిన జనాన్ని చూసి అచ్చెరువువొందాయి. ఇంతలా భారీ సంఖ్యలో గతంలో ఏ నాయకుడికి రాలేదంటూ సభా స్థలిలోనే పలువురు బాహాటంగా చర్చించుకున్నారు. ఇది జగన్‌కు విశాఖలో దక్కిన అరుదైన ఘనతగా కూడా అభివర్ణించారు.

సభ సైడ్‌లైట్స్‌
జగన్‌ సాయంత్రం 5.07 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 6.19 గంటలకు ముగించారు.
జగన్‌ సభకు స్వచ్ఛందంగా జనం తరలివచ్చారు. అందువల్లే ప్రసంగం ఆద్యం తం ఆసక్తితో నిలబడి విన్నారే తప్ప ఎవరూ అక్కడ నుంచి కదలలేదు.
సభా ప్రాంగణంనుంచి ఎటు చూసినా కనుచూపు మేర జనమే కనిపించారు.
దూరం నుంచి జగన్‌ ప్రసంగం అందరికీ కనిపించేలా సభలో పలుచోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
దారిపొడవునా జననేతకు పూలు చల్లారు. బెలూన్లు ఎగురవేశారు.
వంగపండు ఉష నేతృత్వంలోఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.
జగన్‌ అధిక భాగం తన ప్రసంగంలో విశాఖలో టీడీపీ నేతల భూ కబ్జాలను ఎండగట్టారు.
గత నాలుగున్నరేళ్లలో విశాఖలో నేరా లు, హత్యలు జరిగిన తీరును గణాంకాలతో సహా వివరించారు. హత్యలు, మాఫియా నగరంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేజీహెచ్‌లో వైద్యులు, నర్సుల కొరత పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. కేజీహెచ్‌ కార్డియాలజీ విభాగాన్ని ప్రైవేటీకరించేప్రయత్నంపై మండిపడ్డారు.
మహానేత వైఎస్‌ పేదరోగుల కోసం ఏర్పాటు చేసిన విమ్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుండడాన్ని ఎండగట్టారు.
విశాఖ జిల్లా పాడి రైతులను టీడీపీకి చెందిన విశాఖ డెయిరీ, హెరిటేజ్‌ డైరీలు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఏయూలో అధ్యాపకుల ఖాళీలను నింపకపోవడాన్ని ప్రస్తావించారు.
గతంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న విశాఖ పోర్టు ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని విమర్శించారు. కళాసీల జీతాలు పెంచలేదని, ప్రభుత్వం పోర్టు భూములు లాక్కుని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
సీఐఐ సదస్సుల పేరిట భోజనాలకే రూ.53 కోట్లను కొల్లగొట్టిన వైనాన్ని ఎత్తి చూపారు.
వైఎస్‌ హయాంలో విశాఖలో ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రగతి, చంద్రబాబు పాలనలో ఎలా దిగజారిందీ గణాంకాలతో వివరించారు.
బహిరంగసభ ప్రాంగణంలో వైఎస్‌ జగన్‌ ముఖ చిత్రాలు ముద్రించిన 25 భారీ ఎయిర్‌ బెలూన్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న భారీ భవంతులు పొడవునా జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన