జయహో జగన్‌

16 Feb, 2018 07:35 IST|Sakshi

సింహపురిలో జననేతకు జననీరాజనం

అడుగడుగునా పోటెత్తిన అభిమానం

తొమ్మిది నియోజకవర్గాల్లో సాగిన  ప్రజాసంకల్పయాత్ర

14 మండలాలు, 142 గ్రామాల్లో  20 రోజుల పాటు 266.5 కిలోమీటర్లు పాదయాత్ర

అన్నదాతలు మొదలుకుని ఉద్యోగుల వరకు అందరి సమస్యలు విన్న జగన్‌

88వ రోజు కొండాపురంలో  12 కిలోమీటర్ల యాత్ర

నేడు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశం

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో సింహపురి సింహనాదం ప్రతిధ్వనించింది. ఎటుచూసినా జనసమూహమే.. పల్లెల్లో పండుగ వాతావరణం తలపించింది. వెల్లువెత్తిన అశేష జనాభిమానం, కదం తొక్కిన పల్లె ప్రజల మధ్య జిల్లాలో జననేత పాదయాత్ర సాగింది. సూళ్లూరుపేట మొదలుకొని ఉదయగిరి వరకు ఎక్కడ చూసినా అశేష జనసంద్రం. ప్రతిచోటా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడుతూ సాధకబాధకాలను తెలుసుకుంటూ.. కష్టసుఖాలను వింటూ..  జగన్‌ ముందుకు సాగారు. ఈనెల 23వ తేదీన జిల్లాలో ప్రారంభమైన యాత్ర గురువారంతో ముగిసింది. గురువారం రాత్రి జిల్లాలో బసచేసి శుక్రవారం ప్రకాశం జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది. మొత్తం 20 రోజుల పాటు, 266.5 కిలోమీటర్లు మేర పాదయాత్ర కొనసాగింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో జననేత జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజాభిమానం పోటెత్తింది. అశేష జన స్వాగతాల నడుమ గత నెల 23వ తేదీన సూళ్లూరుపేట నియోజకవర్గం  పెళ్లకూరు మండలం పునబాక వద్ద ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అక్క డ నుంచి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. పల్లె ప్రజల ఆత్మీయతల నడుమ అన్నదాతలు మొదలుకుని, పొగాకు రైతులు,  ఏఎన్‌ఎంలు, ఉపా«ధ్యాయులు, కులసంఘాల వరకు అసంఖ్యాకంగా జనం జగన్‌కు సమస్యలు విన్నవించి భరోసా పొందారు. వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యలను విన్నవించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అశేష జనవాహినిని ఉద్దేశించి రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. అక్కడ నుంచి గూడూరు నియోజక వర్గంలో జరిగిన బహిరంగ సభకు భారీగా తరలిచివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. అలాగే వెంకటగిరి నియోజవర్గంలో పాదయాత్రలో కీలక ఘట్టం ఆవిష్కరించారు.

వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని వెంకటగిరి నియోజకవర్గ సైదాపురంలో అ«ధిగమించి అక్కడ విజయ సంకల్ప స్థూపాన్ని ఆవి ష్కరించారు. అనంతరం జననేత వెంట వేలాదిమంది జనసమూహం అడుగులు వేసి వాక్‌విత్‌ జగనన్న కార్యక్రమంలో పా ల్గొంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, నెల్లూరు రూరల్‌ నియోజవర్గంలోని సౌత్‌మోపూరు, కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, కావలి నియోజక వర్గంలోని దగదర్తి, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మం డలాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగించారు.అలాగే  చేనేత, యాదవ, ఆర్యవైశ్య, ముస్లిం మైనార్టీ, మహిళల ఆత్మీయ సదస్సుల్లో ప్రసంగించి ఆయా వర్గాలకు భరోసా కల్పిం చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి రాగానే వారికి చేసే మేలును తెలియజేయడంతో పాటు వారి నుంచి సలహాలు, సూచనలను జననేత జగన్‌ స్వీకరించారు. ఆలాగే ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో 1100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన క్రమంలో అక్కడ మొక్క నాటారు. 

88వ రోజు యాత్ర సాగిందిలా..
ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో జంగాలపల్లి శివారులో గురువారం జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ఆదిమూర్తిపురం చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పింఛను అందడం లేదని చినమాల కొండయ్య, శనగ రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, గిట్టుబాటు ధరలు లేదని వలి అనే కౌలు రైతు విన్నవించారు.  కొండాపురం చేరుకున్న జగన్‌కు అపూర్వస్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. సామినేని రవీంద్ర అనే పొగాకు రైతు కష్టాలను వెళ్లబోసుకున్నారు. పద్మజ జగన్‌తో మాట్లాడుతూ టెట్‌ గతంలో ఒక్కసారే నిర్వహించే వారని ఇప్పుడు షెడ్యూల్‌ పెట్టడంతో అభ్యర్థులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని చెప్పారు.

అలాగే సెకండ్‌ ఏఎన్‌ఎంలు మేరి, ప్రవీణ తమను రెగ్యులర్‌ చేయాలని,  బ్రహ్మయ్య అనే పాల రైతు గిట్టుబాటు ధర రావడం లేదని విన్నవించారు. అనంతరం నేక్‌నామ్‌పేట చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనంతమ్మ అనే మహిళ మాట్లాడుతూ తాను రూ.50 వేలు పొదుపు రుణం తీసుకుంటే ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదని చెప్పారు. అక్కడ నుంచి రేణమాల చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన మహిళల ఆత్మీయ సదస్సులో జననేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. అక్కడ నుంచి తూర్పుపాళెం క్రాస్‌ చేరుకున్న అభిమాననేతకు పెద్ద సంఖ్యలో ప్రజలు కలసి సమస్యలు విన్నవించారు. శుక్రవారం ఉదయం తూర్పుపాళెం క్రాస్‌నుంచి పాదయాత్ర మొదలై ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని కొత్తపేటలోకి ప్రవేశించనుంది.

పల్లెల్లో పండుగ
జననేత జగన్‌ రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో పండుగలు చేసినట్లు ఊరంతా పూలతివాచీలు పరచి తోరణాలతో ముస్తాబు చేసి అడుగడుగునా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రతిచోటా సమస్యలను జననేత దృష్టికి తీసుకుని వచ్చి తమ పక్షాన అండగా నిలిచి మీరే పోరాడలన్నా అంటూ విన్నవించారు. వరి రైతులు మొదలుకొని పొగాకు రైతుల వరకు.. చేతి వృత్తిదారులు మొదలుకుని చేనేతల వరకు.. గ్రామంలో తాగు, సాగునీటి ఇబ్బందులు మొదలుకుని ఫ్లోరైడ్‌ సమస్య వరకు అన్నింటినీ జననేత దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసంకల్పయాత్రతో అనేక దీర్ఘకాలిక సమస్యలు కూడా వెలుగులోకి రావడంతో సాంత్వన చేకూరింది.

ముఖ్యనేతల హాజరు
నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్‌కే రోజా, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు సమన్వయ కర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ నేత పేర్నేటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రూప్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు