జన దీవెన

27 Feb, 2018 07:24 IST|Sakshi
పొదిలిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజా సంకల్పయాత్రలో కిక్కిరిసిన జన సందోహం

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి అడుగులో అడుగు

అడుగడుగునా సమస్యల విన్నపాలు

98వ రోజు 13.5 కి.మీ సాగిన జగన్‌ పాదయాత్ర

సంక్షేమం పట్టని పాలనపై కట్టలు తెంచుకునే ఆగ్రహం..జననేతకు చెప్పాలనే ఆరాటం.. పల్లె పల్లెనూ కదిలిస్తోంది..ప్రజా సంకల్పానికి బాసటగా నిలుస్తోంది.ఆత్మీయతను పంచుతూ.. భరోసానిస్తూ సాగుతున్నజనహితుడి పాదయాత్రను జనప్రవాహం అనుసరిస్తోంది..పేద బతుకుల్లో సంతోషం చూడాలని పరితపిస్తున్నజగన్‌ ‘సంకల్పం’ నెరవేరాలని కోరుకుంటోంది.బహిరంగ సభల్లో జనవాహిని కెరటంలా ఎగసిపడుతోందిజగన్నినాదాలతో హోరెత్తిస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పశ్చిమ ప్రకాశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెల్లవారక ముందే జగన్‌ శిబిరం వద్దకు వేలాదిగా జనం చేరుకుంటున్నారు. ఆయన్ను కలిసి అడుగులో అడుగు వేసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో సోమవారం ప్రజాసంకల్ప యాత్ర జనసంద్రంగా మారింది. పదో రోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర కొనకనమిట్ల మండలం చినారికట్ల వద్ద ప్రారంభమై చినారికట్ల జంక్షన్, కంభాలపాడు మీదుగా మధ్యాహ్నానికి పోతవరం చేరుకుంది. భోజన విరామం అనంతరం పొదిలి వరకు పాదయాత్ర సాగింది. అనంతరం పొదిలిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఆ తర్వాత సాయంత్రానికి యాత్ర పొదిలి శివారుకు చేరుకుంది. పదో రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 13.5 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు. పాదయాత్రలో పలువురు బాధితులు జగన్‌కు సమస్యలు విన్నవించారు. చంద్రబాబు పాలనలో తాము పడుతున్న బాధలు ఏకరువు పెట్టారు. అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని, రుణమాఫీ పేరుతో మోసగించారని, మహిళలకు రుణమాఫీ చేయకుండా వంచించారని, కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు జగన్‌కు విన్నవించారు. వెలిగొండ పరిధిలో నిర్వాసితులకు పరిహారం సైతం అందలేదని పలు రకాల సమస్యలను ప్రజలు జగన్‌ దృష్టికి తెచ్చారు.  మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని  వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జనానికి భరోసా ఇచ్చారు.

వైఎస్‌.జగన్‌కు వినతుల వెల్లువ
మూడేళ్ల నుంచి వర్షాలు సక్రమంగా లేక, వేసిన బోర్లలో నీరు పడక, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చినారికట్ల గ్రామ మహిళలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు.
పనుల్లేక కూలీ పనుల కోసం యడవల్లి నుంచి కొనకనమిట్ల మండలం కొత్తపల్లి మిరప కోతకు వెళ్తున్నామని వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించారు.
దివ్యాంగుల సమస్యలు పట్టించుకొని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పించేలా చూడాలని కంభాలపాడు వద్ద దివ్యాంగులు వైఎస్‌ జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు.
చినారికట్ల గ్రామంలోని కాలనీలో సారాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని సారాయి అమ్మకాలను నిలుపుదల చేయాలని మాదిరెడ్డి ఆదెమ్మ విన్నవించారు. 

జగన్‌తో కలిసి నడిచిన నేతలు: జిల్లాలో పదో రోజు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త ఐ.వి.రెడ్డి, పర్చూరు సమన్వయకర్త ఆర్‌.రామనాథం బాబు, పార్టీ నేతలు వెన్నా హనుమారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు