చీకటి బతుకుల్లో..వెలుగు దివ్వె

29 Mar, 2018 07:36 IST|Sakshi
గుడిపూడి సమీపంలో జరిగిన బీసీల ఆత్మీయ సదస్సులో ప్రసంగిస్తున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పాదయాత్రకు పోటెత్తిన జనాలు

గుడిపూడి సమీపంలో బీసీలతో ఆత్మీయ సదస్సు

ప్రజా సంకల్ప యాత్రలో వినతుల వెల్లువ

సమస్యల పరిష్కారానికి జననేత హామీ

జై జగన్‌ నినాదాలతో పాదయాత్ర పొడవునా హోరెత్తించిన యువత

సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుడిపూడి సమీపంలో బుధవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సదస్సుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు జంగాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో బీసీలు ఏవిధంగా మోసపోతున్నారో వివరించారు. చంద్రబాబు పాలనలో నిజంగా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించగా, సదస్సుకు హాజరైన బీసీలు అందరూ చేతులు పైకెత్తి లేదన్నా అంటూ నినదించారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తున్నారని విమర్శించారు. బీసీల పైన ప్రేమ చూపిన వ్యక్తి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి అని జగన్‌ అనగానే సభికుల నుంచి స్పందన లభించింది. ‘నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే, పేదల కోసం నేను రెండు అడుగులు ముందుకు వేస్తా. మీ పిల్లలను ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా చదివిస్తా’ అంటూ బీసీలకు భరోసా ఇచ్చారు. వడ్డెర, యాదవ, నాయీబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీసీల సమస్యలను అధ్యయనం చేసి బీసీ డిక్లరేషన్‌ ద్వారా అందరికీ తోడుంటానని ప్రకటించారు. వివిధ బీసీ సంఘాల నాయకులు తమ సమస్యలను జననేతకు వివరించారు.

పాదయాత్ర సాగిందిలా...
ప్రజా సంకల్ప యాత్ర 122వ రోజు సత్తెనపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. రామకృష్ణాపురం, నందిగామ, గుడిపూడి కాలనీ, గుడిపూడి సమీపం వరకు కొనసాగింది. బీసీల ఆత్మీయ సదస్సు అనంతరం గుడిపూడిలో కొనసాగి, గ్రామ శివారులో యాత్ర ముగిసింది. 122వ రోజు 11 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు. నందిగామ, గుడిపూడిలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.జై జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేసింది. జగన్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు.

వినతుల వెల్లువ
పాదయాత్ర పొడవునా ప్రజలు తమ సమస్యలను జననేత జగన్‌కు వివరించారు. వాటి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పలువురు యువకులు స్పష్టంచేశారు. గుడిపూడి సమీపంలో నూర్‌బాషాల ఆత్మీయ సమావేశానికి జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదికి రూ.40 కోట్లు కేటాయిస్తానని చంద్రబాబు మోసం చేశారని పలువురు ఆరోపించారు. ఏటా నూర్‌బాషా ముస్లింలకు రూ.40 కోట్లు కేటాయించి మిగిలిన హామీలు పరిష్కరిస్తామని జననేత హామీ ఇచ్చారు. మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా, జనరల్‌ సెక్రటరీ ఎం.ఎన్‌.రఫీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. గుడిపూడి సమీపంలో జగన్‌కు గుంటూరు రూరల్‌ మండలానికి చెందిన ఎస్‌కె.జానీ ఖురాన్, టోపీ, కండువా బహూకరించారు. బీసీల ఆత్మీయ సమ్మేళనంలో గోళ్ల శివశంకర్‌ యాదవ్, గంప పెదనరసింహులు  వైఎస్సార్‌ సీపీలో చేరారు. జగన్‌ వేషధారణలో చిన్నారి రిషిత ఆకట్టుకుంది.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌బాబు, మాజీ ఎంపీ బాలశౌరి, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, జెడ్పీలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ దేవళ్ల రేవతి, బీసీ విభాగం నాయకులు సునిల్‌కుమార్‌ యాదవ్, మండేపూడి పురుషోత్తం, జెడ్పీటీసీ సభ్యులు సునీత, రామిరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆరిమండ వరప్రసాదరెడ్డి, డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు