ప్రతి మాట..ప్రగతి బాట

5 Apr, 2018 07:12 IST|Sakshi

ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన

జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు

టీడీపీ పాలనతో విసిగిపోయామంటున్న ప్రజలు

హోదా సాధనకు తోడుంటామని నినాదాలు

రానున్నది రాజన్నరాజ్యమేనంటూ భరోసా కల్పించిన జగన్‌

1690 కిలోమీటర్లు.. తొలి అడుగుతో ప్రారంభమైన పాదయాత్రికుని ప్రస్థానంలో ఒక్కో కిలోమీటరు ఒక్కో మజిలీ.. రక్తాన్ని చెమట చుక్కలుగా చిలకరించి పంటకు జీవం పోస్తే మద్దతు ధరకు ఉరి వేసి రైతు మెడకు బిగించారన్నా అంటూ పల్లెలు కన్నీరు పెడుతుంటే జన నేత చలించిపోతున్నాడు. ఆత్మహత్యలొద్దు.. రానున్నది రైతు రాజ్యమంటూ భరోసా కల్పిస్తున్నాడు. ఇదేమి పాలనన్నా పేదోడి ఆకలి పేగులకు పార్టీ రంగు పులిమి పింఛన్‌ కూడా ఎగ్గొట్టారంటూ నిర్భాగులు ఖాళీ కడుపులు చూపుతుంటే ప్రజా బాంధవుడు కదిలిపోతున్నాడు. పేదోళ్ల కంచంలో అన్నం ముద్దనవుతానంటూ అభయమిస్తున్నాడు. ఉద్యోగాల ఊసులేక ఇంజినీరింగ్‌ పట్టాలు గోడకు వేలాడుతుంటే విద్యార్థి భవిష్యత్‌ చూసి రాజన్న బిడ్డ రగిలిపోతున్నాడు. బిడ్డలకు బంగారు భవితే తన ధ్యేయమంటూ ప్రతినబూనుతున్నాడు. ఇలా అడుగుకో సమస్య..అసమర్థ పాలనకు అద్దం పడుతుంటే చలించిపోతున్న జగన్‌మోహన్‌రెడ్డి.. నేనున్నానంటూ ప్రజానీకానికి కొండంత ధైర్యమిస్తున్నాడు. ప్రతి అడుగూ ప్రగతి బాట పట్టిస్తానంటూ గుండె గుండెలో నమ్మకమనే గూడు కడుతున్నాడు. బుధవారం జిల్లాలో సాగిన ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా యాత్ర పొడవునా అభాగ్యులకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కల్పించాడు.  

సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 128వ రోజు బుధవారం గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో సాగింది. గుంటూరు శివారు నుంచి వడ్లమూడి వరకు సాగిన యాత్రలో హోదా వేడి కనిపించింది. హోదా సాధించే వరకు ఉద్యమించాలని జనన్నను వేడుకున్నారు. 

వినతుల వెల్లువ
వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూలపూరుకు చెందిన యలవర్తి నాగభూషణం, రామ్మోహన్‌లు మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని జననేత ఎదుట వాపోయారు. యాదవపాలేనికి చెందిన రైతు తోటా శ్రీనివాసరావు నాలుగు ఎకరాల్లో పందిళ్ల ద్వారా కూరగాయల సాగు చేశానని, సబ్సిడీ రాకుండా అడ్డుకున్నారని వాపోయాడు. అధికార పార్టీ నేతలు కూరగాయల పంట సాగు చేయకపోయినా సబ్సిడీ వచ్చిందని తెలిపారు. ఏళ్ల తరబడి పొలం సాగు చేస్తున్నామని, అవి అటవీ భూములంటూ రిజిస్ట్రేషన్‌ నిలిపేశారని పెదకాకానికి చెందిన అర్ధల గడ్డేశ్వరరావు, ముడయాల మల్లికార్జునరెడ్డి జననేతకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాలైన రెల్లి కులస్తులకు ప్రాధాన్యత కరువైందని రాష్ట్ర అధ్యక్షుడు నీలపు వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నాయకులు జగన్‌ను కలిసి విన్నవించారు.

మంచినీళ్లు కూడా లేవయ్యా..
బుడంపాడులో 77 ఎకరాల మంచినీటి చెరువు ఉన్నప్పటికీ నీటి సరఫరా ఏర్పడిందని గాజుల వర్తి విజయరాణి ఫిర్యాదు చేసింది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చకుండా ఇబ్బందులు పెడుతున్నారని రజక ఫెడరేషన్‌ ప్రతినిధులు వీర కిషోర్‌ యువనేతకు వినతిపత్రం అందించారు. పైపులైను నిర్మాణ పనుల్లో అధికార నిర్లక్ష్యం నా బిడ్డను బలి తీసుకుందంటూ చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బండ నాగమణి జననేత వద్ద కన్నీటి పర్యంతమైంది. ప్రజా సంకల్ప యాత్రలో బుడంపాడు బైపాస్‌ వద్ద జగన్‌ను కలిసి వారు తమ సమస్యలను విన్నవించారు. రెడ్‌ మార్కు పేరుతో పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదని ఆస్మా పర్విన్, నసీమాలు జననేత తెలిపారు. కుమ్మరులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి లలిత్‌ వినతిపత్రం అందజేశారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతలు
గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణ, అంబటి రాంబాబు, గుంటూరు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పీ పార్థసారథి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత ఆదిశేషగిరిరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, ప్రత్తిపాడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్తలు మేకతోటి సుచరిత, కాసు మహేష్‌రెడ్డి, అనకాపల్లి పార్లమెంటు కో– ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు లాల్‌పురం రాము, ఎండీ నసీర్‌ అహమ్మద్, వైఎస్సార్‌ సీపీ సంయుక్త కార్యదర్శి గులాం రసూల్,  జెడ్పీటీసీలు కొలకలూరి కోటేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, నాయకులు పాలపర్తి రాము, జగన్‌ కోటి, పరస కృష్ణారావు, జిలానీ, అంగడి శ్రీనివాసరావు, పసుపులేటి రమణ, ప్రేమ్‌కుమార్, హరనా«థ్‌రెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, కంది సంజీవరెడ్డి, ఎలిక శ్రీకాంత్‌ యాదవ్, గోళ్ల శివశంకర్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.  

పాదయాత్ర సాగిందిలా...
ఉదయం గుంటూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర సాగింది. తూర్పు నియోజక వర్గ నేతలు అబ్దుల్‌ కర్ణుమ్, అబీద్‌బాషా, చాంద్‌బాషా, అనీల్, పునూరు నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు పాదయాత్రలో జగనన్న వెంట నడిచారు. బుడంపాడు, సెయింట్‌ మేరిస్‌ ఉమెన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, నారాకోడూరు, వేజెండ్ల, వడ్లమూడి వరకు 12.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. బుడంపాడు వద్ద ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నియోజకవర్గ సమన్వయకర్త మేకతోటి సుచరిత, పార్టీ నేతలు ఆళ్ల రవిదేవరాజు, కొలకలూరి కోటేశ్వరరావు, డేగల నవీన్, మెట్టు వెంకటప్పారెడ్డి, కంది సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జననేతకు ఘన స్వాగతం పలికారు. నారాకోడూరు సమీపంలో పొన్నూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది.

గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, జెడ్పీటీసీ కోటా శ్రీనివాసరావు, పార్టీ నేతలు మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, వెలగ కృష్ణ, జాలయ్య, స్వామి, కోటేశ్వరరావు, మురళి, వెంకటరెడ్డి, శేషురెడ్డి, కేఎన్‌ ప్రసాద్, వడ్డన ప్రసాద్, ఏడుకొండలు ఆధ్వర్యంలో పార్టీ నేతకు అపూర్వ స్వాగతం లభించింది. అశేష జనవాహిని జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచింది. నారాకోడూరు సమీపంలో మధ్యాహ్నం బస ప్రాంతంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, సాకే నరేష్, తాడికొండ విశ్వనాధం, శర్మ, సదాశివారెడ్డి, అప్పలనాయుడు, భాష్యం నర్సయ్య, మల్లికార్జున నాయుడు, బుల్లి రాజన్న, వీసీ జార్జి విక్టర్‌లు కలిసి ప్రత్యేక హోదా కోసం జగన్‌ చేస్తున్న కృషిని కొనియాడారు.

మరిన్ని వార్తలు