కాషాయం మాటున అత్యాచారాలు

18 Sep, 2019 02:51 IST|Sakshi

దిగ్విజయ సింగ్‌

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు తొడుక్కున్న వారు అత్యాచారాలు చేస్తున్నారని, అవి దేవాలయాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ చర్యలతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి కుటుంబం నుంచి వేరయ్యాక సాధువుగా మారతారని, ఆధ్యాత్మికతను సంతరించుకుంటారని అన్నారు. అయితే ఇప్పుడు కాషాయ వస్త్రం ధరించిన వాళ్లు నకిలీ ద్రవాలను అమ్ముతున్నారన్నారు. ఈ కాషాయ వస్త్రాల మాటునే దేవాలయాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు క్షమార్హం కానివని, దేవుడు కూడా వారిని క్షమించడని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో స్వామి చిన్మయానంద్‌ మీద ఓలా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు చేయగా, ఈ ఘటనను ఉద్దేశించే దిగ్విజయ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో సాయంత్రం ఒక ట్వీట్‌ చేశారు. ‘హిందూ సాధువులు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి గుర్తు. అందుకే వారి నుంచి మంచితనాన్ని ఆశిస్తాం. సనాతన ధర్మాన్ని కాపాడడం మన విధి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు