వారి నమ్మకమే నడిపిస్తోంది

7 Dec, 2017 04:00 IST|Sakshi

జనం కష్టాలు తెలుసుకుని భరోసానిచ్చేందుకే పాదయాత్ర

జగన్‌ వస్తే తమ కష్టాలు పోతాయని నమ్ముతున్నారు..

ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : ‘‘ఎన్నో కష్టాలు.. ఎన్నో కడగండ్లు.. ఎన్నో సమస్యలు.. ఎన్నో కన్నీళ్లు.. ఎన్నో విజ్ఞాపనలు.. మరెన్నో వినతిపత్రాలు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలన్నిటినీ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, మోడల్‌ స్కూల్స్‌ టీచర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ వృత్తిదారులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ సమస్యలతో సతమతమవుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని, ఈ పాలనలో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. జగన్‌ వస్తే తమ కష్టాలు పోతాయని వారు నమ్ముతున్నారు. వారి నమ్మకమే నన్ను నడిపిస్తోంది. ’’ అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

నాలుగేళ్లుగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కడగండ్లను తెలుసుకోవాలని, కష్టాలు పడుతున్న ప్రజలకు అండగా ఉన్నానంటూ భరోసా కల్పించాలనే మహాసంకల్పంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. నెల రోజుల్లో మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌.. సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇవీ...

నెల రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఎలా ఉంది ఈ అనుభవం?
పాదయాత్ర  కొత్త అనుభూతులు ఇస్తోంది. ప్రజల సమస్యలు తెలియని వ్యక్తిని కాదు. ఓదార్పుయాత్ర చేశాను. అది కూడా గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంతో ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోగలిగా.  ప్రజల కష్టాలను నిజంగా తెలుసుకోగలిగా. ఎందుకంటే ఎవరూ చేయని, ఎవరూ మామూలుగా పోలేని పూరి గుడిసెల్లోకి కూడా ఓదార్పు నన్ను తీసుకెళ్లింది. దారి పొడవునా ఎక్కడ ఓ పది మంది అవ్వాతాతలు,  ఎవరు కనిపించినా ఆగి మాట్లాడి వెళ్లే గుణం నాది కాబట్టి.  ఓదార్పు కూడా ప్రజల కష్టాలను బాగా తెలియజెప్పింది. పాదయాత్ర అనేది దానికంటే ఒకడుగు ముందుకు...

అంటే దానికీ దీనికీ పోలిక ఉందన్నమాట..
దానికన్నా ఇది మరింత ప్రభావవంతమైనది. కారణమేమంటే... నేను ఏదారిలో పయనిస్తాననేది అందరికీ తెలుసు. కాబట్టి  దారిపొడవునా ఎవరైనా నన్ను కలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి కలిసి అర్జీలు  ఇస్తున్నారు. సమస్యలు చెబుతున్నారు. మోడల్‌ స్కూల్స్‌లో  ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఇలాంటివి  శతకోటి సమస్యలు. ప్రతి సమస్యపైనా వాళ్లు వచ్చి మనకు అర్జీ ఇచ్చి చెప్పగలిగే పరిస్థితి ఉన్నందున పాదయాత్ర అనేది భిన్న అనుభూతులు మిగుల్చుతోంది.

ప్రజల నుంచి ఎలాంటి స్పందన గమనిస్తున్నారు? వారి నుంచి అనుబంధం అనండి. ఆత్మీయత అనండి. ఎలా ఉంది?
ప్రజలు నడిపిస్తున్నారు కాబట్టే నేను నడవగలుగుతున్నా. నిజంగా ప్రజల్లో ఆ ఆప్యాయత కనబడకపోతే ఇన్నివేల కిలోమీటర్లు నడవడం, అది కూడా పగటి పూట ఈ ఎండ, ఈ దుమ్ము ఇవన్నీ ఏవీ లెక్కపెట్టకుండా  చేయగలుగుతున్నామంటే వారు చూపుతున్న ఆప్యాయతాభిమానాలవల్లే. నిజంగా మీరన్నట్లు బిగ్గెస్ట్‌ కిక్‌ అదే. ప్రజల ఆప్యాయత, అనురాగాలే నడిపిస్తున్నాయి.

మీ కాళ్లకు బొబ్బలు వచ్చాయని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది కదా?
ఇన్ని వందల కిలోమీటర్లు నడిచేప్పుడు సాధారణంగా ఇలాంటి బొబ్బలు రావడం లాంటివి సహజమే.  బొబ్బలొచ్చిన చోట్ల గట్టిగా బ్యాండేజీ వేసేసి నడిచేస్తున్నా. దాంతో బొబ్బలు గట్టిపడిపోతాయి.

మీ పాదయాత్రపై స్పందన ఎలా ఉంది?
దేవుని దయవల్ల అన్ని వర్గాల వారు అభిమానం చూపుతున్నారు. విశ్వసనీయత   అతి ముఖ్యమైన అంశంగా  పదే పదే చెప్పడంవల్ల  ప్రజలు కూడా దానిని గ్రహిస్తున్నారు. సాధారణంగా ఒక మనిషిని మరొకరు నమ్మాలన్నా,  ఒక నాయకుణ్ణి ఇంకొకరెవరైనా నమ్మాలన్నా విశ్వసనీయత ఉండాలి.  నమ్మకం అనేది వారు ఇచ్చే మాటను బట్టి,  చేసే పనులను బట్టి ఉంటుంది.

మీ పాదయాత్ర ప్రధాన అస్త్రం విశ్వసనీయతేనా?
చంద్రబాబు గానీ మరొకరు గానీ ఔనన్నా కాదన్నా విశ్వసనీయత అనేది ప్రతి మనిషిలో ఉండాలి. ఇదే ప్రధానమైన అంశం. రాజకీయాలు దేవుడు ఆశీర్వదిస్తే చేస్తాం. లేకుంటే ఇంటికి పోతాం. ఇది వేరే విషయం. అయితే  దేవుడు ఆశీర్వదించినప్పుడు మోసం చేయడమనేది సరికాదు. అబద్ధాలు చెప్పడం సమంజసం కాదు. అది చాలా ముఖ్యం. ప్రాథమిక అంశం. చంద్రబాబు మోసం చేశారన్నది ప్రజల్లో బాగా నాటుకుపోయింది.

పాదయాత్రలో ప్రధాన సమస్యలు మీరేమి గుర్తించారు?
ప్రజలకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం అన్నిరకాలుగా మోసం చేసింది, అన్యాయం చేసిందనేది ప్రజల్లో విపరీతంగా నాటుకుపోయింది. దేవుడి దయవల్ల మనకు  కచ్చితంగా  జగన్‌ ఏదో చేస్తాడు. జగన్‌ మనకు భరోసా ఇవ్వడానికి ఎండలో తిరుగుతూ వస్తున్నాడు. జగన్‌కు చెబితే కచ్చితంగా ఈరోజు కాకపోయినా కచ్చితంగా మంచి చేసే పరిస్థితి ఉంటుంది ఎప్పుడో ఒకసారి జగన్‌ను దేవుడు, మనందరం ఆశీర్వదిస్తాం. ఆయన మేలు చేస్తారనే నమ్మకం అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. వారిలోని  ఆ నమ్మకం చూసి వీళ్లకు ఏదైనా చేయాలనే తపన నాలో పెరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి అనేది అయిదు కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒకరికే ఇస్తారు. అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఆ దీవెనలతో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఎంత చేయాలంటే... రేపు పొద్దున మనం ఉన్నా లేకపోయినా మనం చనిపోయినా ప్రతి ఇంట్లో మన ఫొటో ఉండాలి.  ప్రతి గుండెలోనూ మనం బతికే ఉండాలి అనే ఆరాటం ఈ కష్టాలను చూసినప్పుడు ఎక్కువైంది. ఈ కష్టాల్లో నుంచి వీరిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలనే భావన మనసులో బలంగా నాటుకుపోతోంది.

మీరు పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవం ఏమిటి?
ఇవన్నీ కూడా నేను కొత్తగా ఈరోజు చెబుతున్నవి కాదు. నవరత్నాలు ప్లీనరీలో కొన్ని నెలల క్రితమే ప్రకటించాం. పాదయాత్రలో అవే పునరుద్ఘాటిస్తున్నా.  వాటికి జత చేసింది అతి స్వల్పం. బహుశా కరెంటు విషయంలో 200 యూనిట్లు  అంటూ కొంచెం పెంచామనుకుంటా. మిగతావన్నీ చిన్న చిన్న చేర్పులే. వైఎస్‌ భరోసా ఎంతవుతుంది?   ఇవాళ రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంది. బహుశా మనం అధికారం లోకి వచ్చేసరికి బడ్జెట్‌ రూ.  1.80 లక్షల కోట్లకు చేరుతుంది. అంత బడ్జెట్‌లో ఇవి చాలా చిన్నవి. మేజర్‌గా చెప్పేవన్నీ  ప్లీనరీలోనే చెప్పేశా. ఆరోజు ఎవరూ  విమర్శలు చేయలేదు. ఇప్పుడు  ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఏదో అంటుండటం సహజమే.

45 ఏళ్లకే పింఛను అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ధర్మవరంలో చేనేతల కష్టాలను చూసిన సందర్భంగా 45 ఏళ్లకే పింఛను అని హామీ ఇచ్చా. దాదాపు 35 రోజుల నుంచి వారు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. 35 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు నేను వెళ్లిన రోజు రిలే దీక్షలో మహిళలు పాల్గొన్నారు.  వాళ్ల కష్టాలను చూసి  ఉద్వేగానికి లోనయ్యా. చేనేతలు, మత్స్యకారులు.... కూలికి వెళితే గానీ కడుపు నిండని పరిస్థితి. పొలాల్లో కూలి పనులు చేస్తూ కనిపించేది పేదవర్గాల అక్కచెల్లెమ్మలే. పనులకు వెళితే తప్ప కడుపు నిండని పరిస్థితి వీరిది. పనులు చేసి చేసి 45 ఏళ్ల వయసు వచ్చేసరికి వీరి పని సామర్థ్యం దారుణంగా తగ్గిపోతుంది. వీరు అనారోగ్యం వల్లో ఒంటినొప్పుల వల్లో పనులకు పోలేకపోతే  పస్తుండాలి. ఇలాంటి వారికి 45 ఏళ్లకే రూ. 2,000 ఇవ్వడంలో తప్పేముంది? మనిషిలో ఆమాత్రం మానవతా దృక్పథం లేకపోతే నా దృష్టిలో మానవతకు, అమానవతకు తేడా ఏమీ లేనట్లే.

జగన్‌ పాదయాత్రను జనం పట్టించుకోనందున మీరు కూడా పట్టించుకోవద్దని టీడీపీ నేతలకు బాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి..
జనం పట్టించుకోవడంలేదని ఆయనంతట ఆయనే ఒక అబద్ధాన్ని నిజమనుకుని ఇంకో నలుగురికి ఇదే అబద్ధం చెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. వాస్తవాలను చూడను అనుకుంటే ఆయన మూర్ఖత్వం.  ప్రజలు పట్టించుకుంటున్నారా? లేదా అనేది పాదయాత్ర సందర్భంగా టీవీలు చూపిస్తున్నాయి. లైవ్‌ టెలికాస్టులు జరుగుతున్నాయి. ఏరకంగా ప్రజలు పట్టించుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.  బాగా జరుగుతోందని చెప్పడానికి ఆయన మనసు అంగీకరించదు. అందువల్ల కథలు అల్లుతాడు.

ఎన్నికల నాటికి పార్టీలో మీరు ఒక్కరే మిగులుతారని, ఇంకా ఎవరెవరో వెళ్లిపోతారని, ఎమ్మెల్యేలంతా వెళ్లిపోతారని వాళ్లు అంటుంటారు కదా? దీనిపై మీ అభిప్రాయం?
ఎవరో ఒక మనిషిని తీసేస్తేనో, ఒక లీడర్‌నో, ఒక ఎమ్మెల్యేనో తీసేస్తేనో పార్టీ ఉండదన్న తప్పుడు అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి ఆలోచన చేయడం మూర్ఖత్వం. 2011లో పార్టీ పెట్టినప్పుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. 175 సీట్లలో పులివెందుల తప్ప మిగతా 174 ఖాళీయే. ఆ తర్వాత ప్రజలు దీవించారు, దేవుడు ఆశీర్వదించారు. ఈ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు మన జెండా మోస్తారు. ఒక నాయకుడు పోతే ఇంకొకరు వస్తారు. ప్రజలు వాళ్లవైపు నిలుస్తారు. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలి. అవతలి మనిషికి రూ.25 కోట్లో, రూ.30 కోట్లో ఇచ్చి పదవుల వ్యామోహం చూపించి తీసుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. చంద్రబాబు లాంటి వ్యక్తులు వాళ్లకు హామీలు ఇవ్వడం, ప్రలోభ పర్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజ్యాంగం ప్రకారం చట్టం చేయాల్సిన చట్టసభల్లోని వ్యక్తులే చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉంటే చంద్రబాబు అనుకూల మీడియా ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ ప్రచారం చేస్తుండటం, తప్పును తప్పు అని చెప్పలేకుండా ఉండడం విస్మయం కలిగిస్తోంది.

ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోతున్నారంటూ మీపైనే నిందలు వేస్తున్నారు కదా?
నిలబెట్టుకోవడం లేదూ అంటే నేను కూడా రివర్స్‌లో రూ.25 కోట్లో, రూ.30 కోట్లో ఇవ్వాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. చంద్రబాబు అవినీతితో విపరీతంగా సంపాదించాడు కాబట్టి కొంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు కాబట్టి  ఆ పని చేస్తున్నాడు. కానీ, నాకు ప్రజలపై, దేవుడిపై విశ్వాసం ఎక్కువ. మనుషులకు వ్యక్తిత్వం ఉండాలని నేను ఆశిస్తా. నేనూ అలాగే ఉంటా. నాతోపాటు నడిచే ఎమ్మెల్యేలు, నాయకులూ అలాగే ఉండాలని భావిస్తా. అప్పుడు మాత్రమే ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలుగుతాం. ఒక నాయకుడు పోతే ఇంకొకరు ఆ ఖాళీని భర్తీ చేస్తారు. ప్రజలే నాయకులను తయారు చేస్తారు.

గత ఎన్నికల్లో మీరు రుణమాఫీ వంటి కొన్ని హామీలు ఇవ్వలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు కదా? చంద్రబాబు ఇచ్చిన హామీలను బట్టి చూస్తే ప్రతిపక్షానికి అసలు సీట్లే రాకూడదు. కానీ, మీరు 67 సీట్లు గెలిచారు.  ఆ రోజు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని తెలిసే మావాళ్లు చాలామంది ఆయన ఇచ్చే హామీలేవో మనమూ ఇస్తే సరిపోతుంది కదా! అని సలహా ఇచ్చారు. అబద్ధాలు చెప్పడం ధర్మం కాదు. రాజకీయం చేసేటప్పుడు విశ్వసనీయత ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలు దీవిస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. ఆ విషయంలో మేము చాలా దృఢంగా ఉన్నాం. ఆ రోజు అంత నిజాయతీగా, అబద్ధాలు చెప్పకుండా విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇప్పుడు నేను ఏ అధికారంలో లేకపోయినా, సినిమా యాక్టర్‌ను కాకపోయినా ప్రజలు నాకు తోడుగా నిలబడ్డారు. నాయకుడిని చూసి ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. నేను అది ఎల్లప్పుడూ నమ్ముతా.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆశాభంగం కలిగించిందా?
ఆ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. రూ.200 కోట్లు ఖర్చు పెట్టడం.. ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేయడం... మాకు ఓటు వేసినా చంద్రబాబే అధికారంలో కొనసాగుతాడన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం.. చంద్రబాబుకు ఓటు వేయకపోతే పింఛన్, బియ్యం రావన్న భయం, 13 వేల ఇళ్లు కట్టిస్తామని ప్రజలను ప్రలోభపెట్టిన తీరు అందరికీ తెలిసిందే. ఒకవేళ తనకు ఓటు వేయకపోతే తెలిసిపోతుందని, ఏ బూత్‌లో ఓట్లు తగ్గాయో (మైనస్‌) గుర్తించి జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని భయపెట్టడం వంటి కారణాలు అక్కడ పని చేశాయి. అందువల్ల చంద్రబాబు గెలిచారు.

మరి ఇలాంటి పరిస్థితే వచ్చే ఎన్నికల్లో రాదా? దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు?
ఉప ఎన్నికకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. ఉప ఎన్నికల్లో ఓటు వేసినా, వేయకపోయినా చంద్రబాబు అధికారంలో కొనసాగుతారు. చంద్రబాబు నైజం వల్ల వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని జన్మభూమి కమిటీలతో భయపెట్టించారు. రోడ్లు మధ్యలో ఆగిపోతాయని బెదిరించారు. అదే సాధారణ ఎన్నికలైతే పరిస్థితి వేరుగా ఉంటుంది. అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకునే బదులు జగన్‌ను అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు మాదిరి మోసం చేయడు కదా, మనకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది కదా అన్న భావనకు వస్తారు.

పోలవరం ప్రాజెక్టు హాట్‌ టాపిక్‌గా మారింది. మీరెలా స్పందిస్తారు?
చంద్రబాబు తాను చేయాల్సిన పనిని చేయలేక ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును ఎందుకు చేపట్టలేకపోతున్నాడో కారణాలు అందరికీ తెలిసినవే. అంచనా వ్యయాన్ని రూ.16 వేల నుంచి రూ.56 వేల కోట్లకు పెంచేసి, నామినేషన్‌ పద్ధతిలో ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తే కేంద్రం ఊరుకుంటుందా? నిబంధనల ప్రకారం టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కేంద్రంపై బండలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారు. కాపుల రిజర్వేషన్లు, బోయలను ఎస్టీలుగా మార్చడంలోనూ అదే జరిగింది. ఈ అంశాలను కేంద్రం కోర్టులోనే వేస్తున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేసేస్తానని చెప్పి, నాలుగేళ్లయినా చేయలేక, ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంజునాథ అనే ఆయన బీసీ కమిషన్‌ ఛైర్మన్‌. ఆ కమిషన్‌ ఛైర్మనే నేను నివేదిక ఇవ్వలేదంటుంటే... నివేదిక ఇచ్చారని, దాని ఆధారంగా తీర్మానం పెట్టామని అంటున్నారు. వాస్తవానికి దాన్ని ఎవ్వరూ చూడలేదు. అయినా సరే దానిపై తీర్మానం చేసి పంపామంటున్నారు. ఇలా చేసిన తీర్మానాన్ని ఏ కోర్టయినా ప్రశ్నిస్తుంది.  

బీజేపీతో చంద్రబాబు విడిపోయే అవకాశం ఉందా?
విడిపోయేంత ధైర్యం చేయడానికి చంద్రబాబు ఇప్పుడు భయపడతారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయాడు. ఇంకా ఎన్నో అవినీతి కేసులున్నాయి. కాబట్టి కేంద్రంతో అంత త్వరగా విభేదించడు. చివరి నాలుగు నెలల్లో,  ఆరు నెలల్లో చేయొచ్చు. కచ్చితంగా చేసిన తప్పులన్నీ నావి కాదు, కేంద్రం నన్ను పనిచేయనివ్వలేదని సహజంగానే నెపం వాళ్లమీద వేసేస్తాడు.

మీరు బీజేపీతో కలిసే అవకాశముందని ఇప్పటికే వార్త కూడా వచ్చింది.
చంద్రబాబు ఎలాంటి విలువలు లేని వ్యక్తి. ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు. అయినా కూడా జగన్‌ బీజేపీతో కలుస్తాడని చెప్పి తనంతట తానే ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి తన తోక పత్రికలు, తోక మీడియాలో వార్తలు రాయిస్తారు. ఒకవైపు తానే బీజేపీతో ఉండి, వేరొకరు బీజేపీతో పోతారంటూ ప్రచారం చేయిస్తారు.

మీరు కాంగ్రెస్‌తో డిఫర్‌ అయ్యారు. బయటకు వచ్చేశారు. అలా వచ్చినప్పుడు వ్యూహాత్మకంగా మీరు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు?
పలు కారణాల వల్ల పొత్తు పెట్టుకోలేదు. కానీ, ఈ రోజుకు కూడా కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ వాళ్ల వ్యక్తిగత బలం రాష్ట్రంలో ఏమీ లేదు. ఏదో ఒక పార్టీపై ఆధారపడి వారు ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ రోజు మా వైఖరిలో ఎలాంటి దాపరికం లేదు. నేను స్పష్టంగా చెబుతున్నా. ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇస్తేనే మీతో నేను ఉంటాను. మనం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోం.

ప్రధాని మోదీ గారిని కలిశారు కదా?
మోదీగారితో కూడా అన్నాను. సార్‌.. నాది ఒక్కటే రిక్వెస్టు. ప్రత్యేక హోదా ఇవ్వండి, హోదా ఇస్తే మీతో కలిసి పనిచేస్తాను అని చెప్పాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇస్తారన్న నమ్మకం నాకుంది. ఇస్తే కలుస్తాం. ఇవ్వకపోతే కలవాల్సిన పనిలేదు.

పవన్‌ కల్యాణ్‌ యాక్టివిటీస్‌ గురించి..?
ప్రస్తుత పరిస్థితిలో ఆయన చంద్రబాబునాయుడిని విమర్శించడు. బాబుకి ఎప్పుడు అవసరముంటే అప్పుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చి చంద్రబాబుకి అంతో ఇంతో మేలు చేసే దిశగానే ఇంతవరకు ఆయన ప్రస్థానం జరిగింది. వియ్‌ ఆర్‌ హోపింగ్‌. పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌ చంద్రబాబునాయుడు షెల్‌లో నుంచి బయటకు రావాలి. చంద్రబాబునాయుడు మోసం, అన్యాయం చేసే వ్యక్తి అని ఆయన రియలైజ్‌ అయితే, గమనించగలిగితే ఆరోజు డిఫరెంట్‌ బాల్‌గేమ్‌ అవుతుంది.

పాదయాత్ర నేపథ్యంలో ఇంట్లో అమ్మగారు, భారతిగారు, పిల్లలు ఎట్లా రియాక్ట్‌ అవుతున్నారు?
పాదయాత్ర అనేది ముందు నాన్న చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలకు అతి సమీపంగా దగ్గరుండి చూసే ప్రస్థానం ఇది. వారితో మమేకం కావడం,  ఇంతకు ముందు ఓదార్పు యాత్ర చేసిన దానికంటే మోర్‌ ఇంటెన్సివ్‌ ఇది. ఇటువంటి కార్యక్రమంలో కుటుంబం మద్దతు చాలా ముఖ్యం. దేవుడి దయ వల్ల ఫ్యామిలీ సపోర్ట్‌ చాలా ఉంది.

మీరు ఎక్కువగా దేవున్ని నమ్ముతారా?
కచ్చితంగా నమ్ముతాను. ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్‌. ఏమైనా జరగాలి అంటే దేవుని చిత్తం లేనిదే ఏమీ జరగదని గట్టిగా నమ్ముతాను. నన్ను జైలులో పెట్టడం, ఓదార్పుయాత్ర చేస్తూ ఇంట్లో తక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ సమయం పిల్లలతో గడపలేకపోయాను. అయితే ఉన్న కొద్ది సమయంలో మాత్రం పిల్లలతో చాలా దగ్గరగా ఉంటాను. పాప అంత బాగా చదివి ప్రెస్టీజియస్‌ లండన్‌ స్కూల్లో సీటు రావడమన్నది మెచ్చుకోదగింది. వాళ్లమ్మను కూడా అప్రిషియేట్‌ చేయాలి.

అమ్మగారు కానీ, మీ సోదరి కానీ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా ఉంటున్నారా? మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడం వంటివి ఉంటాయా?
అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా చేస్తారు. వాళ్లేమీ రాజకీయాల్లో ఉండాలని అనుకోలేదు. ఆరోజు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టి పార్టీయే లేకుండా చేయాలని చూశారు. మూడు నెలల్లో కచ్చితంగా చట్ట ప్రకారం బెయిల్‌ రావాల్సి ఉన్నా రానీయకుండా చేశారు. ఆరు నెలల పాటు మనిషే లేకుండాపోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో వీళ్లు చేసిన కుట్రల్లో నుంచి వారిద్దరూ బయటకు వచ్చారు. నాకు తోడుగా నిలబడ్డారు. పదవీ వ్యామోహం అమ్మకు.. పాపకు.. నా భార్యకు లేదు. ఎవరూ అలాంటి భావనతో ఉండరు. రిలేషన్‌షిప్స్‌ కూడా మా ఇంట్లో చాలా స్ట్రాంగ్‌. మా ఇంటి ఆడవాళ్లలో చాలా బలమైన బంధం ఉంది.  

దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది.  ఎప్పుడైనా ఎందుకీ పోరాటం అని అనిపిస్తోందా?
నాన్న చనిపోయి తొమ్మిదేళ్లు అయింది. నాన్న చనిపోయినప్పటి నుంచి పోరాటమే కదా!  కోటి 30 లక్షల మంది ప్రజలు మనల్ని నమ్ముకొని ఓటు వేశారు. మన మీద నమ్మకంతో తోడుగా ఉన్నారు. గెలుపుకి, ఓటమికి మధ్య తేడా ఒక్క శాతం మాత్రమే. 5 లక్షల ఓట్లు తేడా. 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. మిగిలిన చోట ఓడిపోయిన వాళ్లు కూడా మనతో ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నప్పుడు మనం చేసే ఏ చర్య అయినా వాళ్లల్లో ఏమాత్రం తేడా రాకూడదు. మనం.. వాళ్ల కోసం ఉండాలి. అది కాకుండా దేవుడు అవకాశమిస్తే చరిత్ర సృష్టించాలన్న తపన నాలో ఉంది. 30 ఏళ్లపాటు ఎంత గొప్ప పరిపాలన ఇవ్వాలంటే నా జీవితమున్నంత కాలం నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాయన ఫొటో పక్కన నా ఫొటో ఉండాలనుకుంటున్నా. ఒక్క అవకాశం.. 5కోట్ల మంది జనాభాలో దేవుడు ఒక్కరికి ఇస్తాడు.

గతంలో సోనియాగాంధీతో తేడా ఎక్కడ వచ్చింది?
ఆమె ఓదార్పుయాత్రకు పర్మిషన్‌ ఇచ్చి ఉంటే అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఎందుకో నెగిటివ్‌ చెప్పేవాళ్లు ఎక్కువయినారో కాకపోతే ఆమెనే అట్లా మైండ్‌సెట్‌ మారిందో మొత్తానికి ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో నాకున్న ఎమోషనల్‌ కనెక్టును ఆమె అర్థం చేసుకోలేకపోయింది. నేను, అమ్మ, పాప.. ముగ్గురం ఫైనల్‌గా రిక్వెస్టు చేసి కన్విన్స్‌ చేసి ఒప్పించడానికి పోయినం. ఆమె (సోనియాగాంధీ) ఎంతసేపు చెప్పినా వినలేదు.. అందరినీ ఒకేచోట ఓదార్చండి అన్నారు.

మీరు పెద్దనాయకులు అయిపోతున్నారన్న ఫీలింగ్‌ ఏమన్నా ఉందా? ఎవరైనా ఎక్కించి ఉంటారా?
ఏమో మరి ఆవిడ ఏమనుకుందో ఏమో కాని నిజం చెప్పాలంటే అసలు ఆరోజు ఆవిడ ఒప్పుకొని ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. అమ్మ నేను, పాప ముగ్గురం పోయి మేము అడిగిందేమిటి? ఓదార్పుకు పర్మిషన్‌ ఇవ్వండని. అసలు ఓదార్పుకు పర్మిషన్‌ తీసుకోవడమంటేనే ఒక ఆశ్చర్యం. నాన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఇంకొకరి పర్మిషన్‌ కావాలనడమే బిగ్గెస్ట్‌ ఆశ్చర్యం. నాకైతే కాంగ్రెస్‌ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయి వందరోజులైంది. అంతలోపలే నాన్న చనిపోయారు. మామూలుగా ఎవరైనా చనిపోతే పరామర్శకు పోతాం మనం. దానికి పర్మిషన్‌ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. నాన్న చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పాము. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఎలా అని మనసును కదలిస్తా ఉంది. ఆవిడకేమో అర్థం కాదు. ఆవిడ ఎంతసేపు ఉన్నా వేరే యాంగిల్‌లో చూసేదేమో నాకు తెలీదు కానీ అందరినీ ఒకే చోటుకు పిలిచి మాట్లాడదామన్నారు.

కేవీపీ గారు చెప్పారట కదా? వద్దు మనం వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఇబ్బందులు వస్తాయని చెప్పారంటారు.?
నేను మాట ఇచ్చిన తరువాత ఏమైనా చెప్పొచ్చు. నేను మాట ఇచ్చిన తరువాత మాట ఎందుకిచ్చావని అడిగితే ఏం చెబుతాం. హెలికాప్టర్‌ ప్రమాదంలో నాయిన చనిపోయిన ప్రదేశానికి వెళ్లినం. 20 రోజులు కూడా కాలా. ఆ ప్రాంతం చూసిన తరువాత కిందికి నడుచుకుంటూ వస్తున్నాం. మాటల్లో నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారనే చర్చ వచ్చింది. అది మనసులో ఎందుకో తిరుగుతా ఉంది. కిందకు వస్తే  సంతాప సభ. దాదాపు కొన్ని వేలమందితో కండోలెన్సు మీటింగ్‌ జరుగుతా ఉంది. అప్పుడు నాటైమ్‌ వచ్చినప్పుడు నేను మాట్టాడేదానికి మైక్‌ తీసుకున్నాను. మాట్లాడేప్పుడు ఎమోషనల్‌గా చెప్పిన. చనిపోయిన ప్రతి కుటుంబంలోని వాళ్లంతా నా కుటుంబ సభ్యులే. వాళ్ల ఇంటికి వస్తా. వారికి తోడుగా ఉంటా. వారికి భరోసా ఇస్తానని చెప్పిన. ఎందుకు చెప్పావంటే నాకు తెలీదు. జస్ట్‌ ఎమోషనల్‌గా చెప్పిన. నాయిన చనిపోయిన ప్రదేశంలో  చెప్పినం కాబట్టి మాట నిలబెట్టుకోవాలని నా ఆరాటం. అది వీళ్లకు అర్థం కాదు. అది చినికిచినికి గాలివాన అయి అది లాస్ట్‌కు ఏ స్టేజికి వచ్చిందంటే నువ్వు పోతే నిన్ను ఇబ్బందులు పెడతాం. నువ్వు ఉండాలంటే మాట తప్పాల. నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాము. ఇంకోటిస్తాం. తరువాత ముఖ్యమంత్రిని చేస్తాం. ఇలా రకరకాలుగా ప్రలోభాలు. బట్‌ ఎండ్‌ ఆఫ్‌ద డే. అవన్నీ ఏమొచ్చినాయో దేవుడెరుగు. తీసుకున్నా నాకు వేల్యూ ఉండదు. ఇక్కడ విశ్వసనీయత పోయిన తరువాత, ఆయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పిన తరువాత.. చివరకు నేను, అమ్మ, పాప ముగ్గురమూ వచ్చాం. ముగ్గురమూ మాట్లాడాం. నేను అమ్మకు ఒక్కటే చెప్పాను. అమ్మా రెండు దారులున్నాయి. ఒకదారి అయితే మాట తప్పమంటున్నారు.. పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి అయితే మాట మీదే నిలబడతాం.. పదవులు రావు బహుశా ఇబ్బందులూ పెడతారు. బట్‌ మాట మీదయితే నిలబడతాం. మాట మీద నిలబడతారన్న పేరయితే నాన్నకు ఉంది. అల్టిమేట్‌గా ఏదో ఒకరోజు అందరమూ చనిపోతాం. చనిపోయిన తరువాత మన గురించి ప్రజలేమనుకుంటారనేది వాట్‌ విల్‌ లీవ్‌ బ్యాక్‌. ఆ మాట నేనన్నప్పుడు షర్మిల, అమ్మ, భారతి నన్ను సపోర్టుచేశారు. నీ ఆలోచనే కరెక్టు. మాట చెప్పిన తరువాత దానిపై నిలబడాల్సిందే. చేయాల్సిందే. తప్పేమీ కాదు. నిజాయితీగా ఉన్నాం.  సోనియాగాంధీ గారికి రాజీనామా లేఖ రాసేసి పార్టీనుంచి బయటకు వచ్చేసినం. ఆ స్టేజికి వచ్చింది కనుక. బయటకు వచ్చినప్పుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్, రాజంపేట ఎమ్మెల్యే అమరనా«థ్‌రెడ్డి నా దగ్గరకు వచ్చి అన్నా మీతో పాటు మేము కూడా వస్తామన్నా అన్నారు. అసలు నాకే నా పొలిటికల్‌ జీవితమేమిటన్నది నాకే తెలియటంలా. నీవు నాతో ఫాలో అవుతానంటున్నావు. వద్దు శ్రీకాంత్‌. దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు కావాలంటే వద్దువులే అన్నాను. నాదంటే ఒక మాట చెప్పినం ఆ మాటకు కట్టుబడాలా. అయితే అయ్యింది లేకపోతే  లేదు. తినేదానికి ఏమీ లేని పరిస్థితుల్లో లేము కదా? రాజకీయాలు చేస్తే న్యాయంగా చేస్తం. ధర్మంగా చేస్తం అనిచెప్పి వచ్చేసిన. దేవుడు ఆశీర్వదించాడు. ప్రజలు ఆదరించారు. ఆ తరువాత కథంతా మీకు తెలిసిందే.

అమరావతి నిర్మాణం తీరు ఎలా ఉంది?
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడని చెబుతాను. నాలుగు పంటలు పండించే భూమిని ప్రజల ఇష్టాలతో సంబంధం లేకుండా తీసుకోవడం. రెండోది రాజధాని భూములను ఒక స్కాముగా వాడుకోవడం. రాజధాని ఎక్కడ వస్తుందని తెలిసి కూడా ఈయన రైతులను మిస్‌లీడ్‌ చేశాడు. అటు తన బినామీలతో తక్కువ రేటుకు భూములు కొనిపించినాడు. కొనిపించాక ఇక్కడే రాజధాని అని డిక్లేర్‌ చేయించాడు. పాపం భూములు అమ్ముకున్న రైతులు నష్టపోయారు. అంతేకాదు బినామీల భూములను వదిలేసి పేదవాడి భూములను అన్యాయంగా లాక్కొన్నారు. ఇంతవరకు పర్మినెంటు అనే పేరుతో ఒక్క ఇటుక పడలేదు. తీసుకున్న భూములన్నీ ఈయన ఇష్టమొచ్చినట్లుగా నచ్చిన వాళ్లకు నచ్చిన రేటులో నామినేషన్‌ పద్ధతిలో భూములు పంపిణీ చేస్తున్నారు. ఈయన ముడుపులు తీసుకొంటున్నారు. ఇది ఏమన్నా రాజధానా? రాజధాని స్కామా?

చంద్రబాబుకు వ్యతిరేక సెంటిమెంటు ఎంతమేరకు, ఏ శాతంలో పెరుగుతోందని మీరు భావిస్తున్నారు. 80 శాతం మంది సంతృప్తిగా ఉన్నారంటున్నారు?
ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా వన్‌సైడ్‌ తీర్పు ఇస్తుంది. 1999లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కాంగ్రెస్‌కు ఒక్కో సీటు వచ్చాయి. అదే రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు 2004కు వచ్చేసరికి తూర్పులో 19 కాంగ్రెస్‌కు, చంద్రబాబునాయుడికి రెండు. పశ్చిమలో 12 కాంగ్రెస్‌కు, చంద్రబాబుకు నాలుగు. 294 నియోజకవర్గాల్లో చంద్రబాబుకు 15 శాతమూ రాలేదు. దానర్థమేమంటే ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పుడూ వన్‌సైడ్‌ గుద్దుతారు. ఈయనకు చట్టం లేదు. న్యాయం లేదు. అవినీతి చేస్తూ పట్టుబడినా కూడా ఏమాత్రం కూడా రిపెంట్‌ లేదు. రిగ్రెట్‌ లేదు. ఏమీ లేని వ్యక్తి. అన్ని రకాలుగా అబద్ధాలు, మోసాలు చేశాడని ప్రజలకు బాగా అర్థం అయిన çపరిస్థితి. గ్రాస్‌రూట్లో ప్రజలకు ఏమీ చేయలేదు సో వన్‌సైడెడ్‌గా ఎలక్షన్‌ ఉంటుంది.

పాదయాత్ర సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం
తోడుగా నిలవండి.. మీ బిడ్డను ఆశీర్వదించండి.

(వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి పాఠం వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు