80 పదిలం

9 Dec, 2018 04:51 IST|Sakshi
శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో మందకృష్ణ, ఎల్‌.రమణ, చాడ తదితరులు

12న ఏర్పడేది కూటమి ప్రభుత్వమే: ఉత్తమ్‌

తెలంగాణ జర్నలిస్టులందరికీ సెల్యూట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి 75 నుంచి 80 సీట్లలో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో సంబంధం లేకుండా.. తామే గెలుస్తామన్నారు. ఈ నెల 12న తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. నిన్న మొన్నటివరకు 105–106 స్థానాల్లో గెలుస్తామన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు 80 సీట్లలో తమదే విజయం అంటున్నారని.. 11న ఫలితాల తర్వాత 30 స్థానాలకే పరిమితం అవుతా రని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలను 2019 పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారని, ఈ సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ 5–0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుంద న్నారు. శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఆయన ప్రజాకూటమి నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి(సీపీఐ), విద్యాధర్‌రెడ్డి (టీజేఎస్‌), మంద కృష్ణమాదిగ(ఎమ్మార్పీఎస్‌), టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ సరళి తమకు అను కూలంగానే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం చేసిన మోసం పై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో రాజకీయ, రాజకీయేతర శక్తుల కలయిక తమకు కలిసొస్తుందన్నారు. దుర్మార్గపు, అణచివేత, నియంతృత్వ పాలన అవసరం లేదని తాము చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకున్నారని ఉత్తమ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రకటించిన హామీలు కూడా ప్రజల మనసులను హత్తుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కూటమి స్ఫూర్తితో పనిచేసిన కారణంగా ఓట్ల బదిలీ కూడా 100% జరిగిందని ఆయన పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు, సంస్థల కార్యకర్తలు, నేతలు, పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ఉత్తమ్‌ ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు పక్కాగానే ఉన్నారు
ఆత్మగౌరవం లేని పాలన తమకు అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓట్లేసేందుకు వెళ్లారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్‌కు గులామ్‌లము కాదనే ఈ ఎన్నికలతో తెలంగాణ ప్రజలు చెప్పబోతున్నారన్నారు. రోజురోజుకూ కూటమికి ప్రజాదరణ పెరిగిందని, దీనికి తగ్గట్లుగానే ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. అందుకే వందల కోట్ల ధనాన్ని వెదజల్లినా ఓటర్ల ఆలోచనను ప్రభావితం చేయలేకపోయారని, తమకు 75–80 స్థానాలు వస్తాయని, కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఓటు రూపంలో అస్త్రం సంధించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ టీడీపీ తరఫున ధన్యవాదాలు చెపుతున్నామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని, ప్రజల్లో సానుకూల సంకేతాలు కనిపించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్పారు. కూటమి సర్దుబాటు మరో 10–15 రోజుల ముందు జరిగి ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు వీలుండేదని వ్యాఖ్యానించారు. టీజేఎస్‌ నేత విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ నియంతృత్వ, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పారదర్శక ప్రజాపాలన కోసం ఓట్లేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కూటమి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్‌ ఓటమి, కూటమి గెలుపు ఖాయమయ్యాయన్నారు. దొరలు ఓడిపోతున్నారని, ప్రజాస్వామ్యం గెలుస్తోందని వ్యాఖ్యానించారు.

రాజ్‌దీప్‌ ఫోన్‌ చేసి..
ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేల గురించి విలేకరులు అడగ్గా, వాటి గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని ఉత్తమ్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌కు 72–91 స్థానాలు వస్తాయని ఇండియాటుడే చానల్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పారని, కానీ, తమ సర్వేను చూసి ఆందోళన చెందవద్దని, తెలంగాణలో ఇరుపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఆ పోల్‌ను నిర్వహించిన రాజ్‌దీప్‌సర్దేశాయ్‌ తనకు ఫోన్‌ చేసి చెప్పాడని ఉత్తమ్‌ వెల్లడించారు. తనకు ఫోన్‌ చేసి చెప్పడమే కాకుండా ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడని చెప్పారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వార్తలురాసిన విలేకరులు, పత్రిక, టీవీ చానళ్ల యజమానులకు ఉత్తమ్‌ కృతజ్ఞతలు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు ఇంకా సమయం ఉందని, ఉద్యోగులు ఆలోచించుకుని ఐఆర్, పీఆర్‌సీ అమలు, పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణ కోసం కూటమి అభ్యర్థులకు ఓట్లేయాలని కోరారు.

ఈవీఎంలు జరభద్రం
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్‌ కోరారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున అధికార పార్టీ ఈవీఎంలను మార్చడం లేదా ట్యాంపరింగ్‌ చేసేందుకు అవకాశం ఉందని ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవీఎంల రవాణా జరుగుతున్నప్పుడు, స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచినప్పుడు, ఆ తర్వాత వాటిని కౌంటింగ్‌ కేంద్రాన్ని తీసుకువచ్చేటప్పుడు కూటమి నేతలు ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రంపై ఈవీఎంను పెట్టినప్పుడు ఆ ఈవీఎం నెంబర్‌ రాసుకోవాలని సూచించారు.

ఇందుకోసం పోలింగ్‌ ఏజెంట్లనే కౌంటింగ్‌ ఏజెంట్లుగా అనుమతిస్తే బాగుంటుందని, ఈ మేరకు కూటమి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అధికారులు కూడా అక్కడికి వెళ్లకూడదని, కొన్ని చోట్ల కొందరు అధికారులు ఆ గదుల్లోకి వెళ్లి వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఈసీ విఫలమయిందని ఉత్తమ్‌ ఆరోపించారు. లక్షలాది మంది అర్హుల ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని తాము మొదటి నుంచీ చెపుతున్నప్పటికీ ఈసీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని, ఇప్పుడు సాక్షాత్తూ ఎన్నికల సీఈవోనే ఓటర్ల గల్లంతుపై క్షమాపణలు అడగడం శోచనీయమన్నారు.

మరిన్ని వార్తలు