అలా చెప్పడానికి పవన్‌కు సిగ్గుండాలి : పేర్ని నాని

17 Jan, 2020 17:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : బీజేపీతో దోస్తీ కట్టిన పవన్‌ కల్యాణ్‌పై రవాణా మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఈ భూమ్మీద పచ్చి అవకాశవాద రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్‌ కల్యాణేనని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు అంబాసిడర్‌గా ఉండేవారని.. బాబు కోరిక మేరకు పవన్ కూడా అలానే చేస్తున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు  కొత్త చిరునామాగా పవన్ నాయుడు తయారయ్యారని చురకలంటించారు. 


(చదవండి : పవన్‌ డాన్స్‌లు, డ్రామాలు వేస్తే పెట్టుబడులు రావు: కేఏ పాల్‌)

ఆయన మాట్లాడుతూ..  ‘బేషరతుగా పవన్ కల్యాణ్‌ ఎందుకు బీజేపీకి మద్దతు తెలిపారు. షరతులు పెట్టి.. హోదా అడిగి.. బీజేపీకి మద్దతు తెలపొచ్చు కదా. మోదీని, అమిత్‌షాను ఏపీకి ప్రత్యేక హోదా కావాలని  ఎందుకు అడగలేదు. బేషరతుగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నాని చెప్పడానికి సిగ్గు లేదా. ఎందుకు బేషరతుగా మద్దతు అంటున్నారు. మీ మీద ఏం కేసులు ఉన్నాయి. ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో పార్టీని అమ్మకానికి పెట్టుకోవచ్చు అనే విధంగా పవన్ తయారయ్యారు. ఓఎల్‌ఎక్స్‌ తత్వవేత్తగా మారాడు’అని పేర్ని నాని పేర్కొన్నారు.
(చదవండి : చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం)

అధిక చార్జీలపై కేసులు నమోదు చేశాం
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ యాజమాన్యాలను హెచ్చరించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. జనవరి 2 నుంచి 16 వ వరకు 3132 కేసులు నమోదు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 552 బస్సులను సీజ్‌ చేశామని చెప్పారు. పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 3 వేల స్పెషల్‌ బస్సులను నడిపామని తెలిపారు. ఈ రోజు (శుక్రవారం) నుంచి 20 తేదీ వరకు ప్రైవేటు ట్రావెల్స్‌పై రైడ్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు