‘బాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

7 Apr, 2020 19:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా బాధితుల కోసం 24 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో శాంపిల్స్‌ ఎక్కువగానే సేకరించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రోజుకు 1,175 శాంపిల్స్‌ పరీక్షలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఎన్‌-95 మాస్కులు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సమాచార సేకరణ చేపడుతున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 28,662 మందిని గుర్తించామన్నారు. వారందరినీ నిర్బంధ పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. వీరిలో 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. మిగతావారికి 14 రోజుల హోం క్వారంటైన్‌ పూర్తి కావచ్చిందని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ మర్కజ్‌ వెళ్లివచ్చిన 1,042 మందిని గుర్తించామని.. వీరిలో 196 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. వీరందరూ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,175 మందిని హోం క్వారంటైన్‌ చేశామని.. వారందరిపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు. 

చదవండి : కేసులు తగ్గొచ్చని భావిస్తున్నాం: ఏపీ అధికారులు

వారికి సాయం అందించండి : సీఎం జగన్‌

మరిన్ని వార్తలు