ముఖ్యమంత్రిపై కామెంట్స్‌.. బీజేపీ కార్యకర్త అరెస్ట్‌

14 Jun, 2019 11:34 IST|Sakshi

దిస్‌పూర్‌ : సోషల్‌ మీడియా వేదికగా అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన బీజేపీ కార్యకర్తను గువాహటి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మారిగన్‌ జిల్లాకు చెందిన నీతు బోరా  అస్సాం బీజేపీ సోషల్‌ మీడియా టీంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సీఎం సర్బానంద సోనోవాల్‌ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ముస్లిం వలసదారుల నుంచి స్థానిక ప్రజలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించాడు. దీనికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కారణమంటూ నీతు బోరా సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

అంతేకాక జలుక్‌ బరి నియోజక వర్గానికి చెందిన హిమంత బిస్వా శర్మను నూతన హోం శాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ నీతు బోరా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఇవి కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు నీతు బోరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక బుధవారం అర్థరాత్రి బీజేపీ ఐటీ సెల్ మెంబర్‌గా పనిచేస్తున్న హేమంత బరువా అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

అయితే సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు వాక్ స్వాతంత్ర్య హక్కును ఎందుకు కాలరాస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారు తమ అసంతృప్తిని వెలిబుచ్చారే తప్ప ఎవరినీ కించపరచలేదంటున్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్‌ చేశారని ఆరోపిస్తూ.. ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు