ఓటు హక్కును పణంగా పెడతారా?

21 Sep, 2018 01:24 IST|Sakshi

అప్పుడది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నిక ఎలా అవుతుంది?

సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మర్రి శశిధర్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు లక్షలాది మంది ఓటు హక్కును పణంగా పెడితే అది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నిక ఎలా అవుతుందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీం కోర్టులో బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోందని, అసెంబ్లీ రద్దయినా 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పని లేదని, ఆర్టికల్‌ 324 ద్వారా సంఘానికి విశేష అధికారం ఉందని చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అంతకుముందే ఆగస్టు 28న.. 2019 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ జారీ చేసిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని, తిరిగి 2018 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ సెప్టెంబర్‌ 8న స్వల్పకాల షెడ్యూలును జారీ చేసిందని, ఆ షెడ్యూలు ప్రకారం తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ శశిధర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా సెప్టెంబర్‌ 6న అసెంబ్లీ రద్దయినందున మార్చి 6 వరకు గడువుందని శశిధర్‌రెడ్డి కోర్టు నివేదించారు. కాబట్టి పాత షెడ్యూలు ప్రకారం 2019 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సమయం ఉందన్నారు. ఎన్నికల సంఘం అలా చేయకుండా అమలులో ఉన్న ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని కోర్టుకు నివేదించారు.  

ఓటు హక్కును కాపాడాల్సింది ‘సంఘమే’
ఓటరు జాబితా చట్టబద్ధంగా లేనపుడు, ఎన్నికల సంఘం తగినంత సంసిద్ధతతో లేనప్పుడు ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను సవాలు చేయకుండా ఆర్టికల్‌ 329(బి) నిరోధించడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ‘ఇంద్రజిత్‌ బారువా వర్సెస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’కేసులో రాజ్యాంగ ధర్మాస నం ఈ మేరకు స్పష్టంగా పేర్కొందని నివేదించారు. ఈ విషయమై పదేపదే తాము చేసిన విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని విన్న వించారు. ఆర్టికల్‌ 326 ఓటు వేసే హక్కును కల్పిస్తోందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. కానీ ఈసీ వీటిని పట్టించుకోకుండా లక్షలాది మంది కొత్త ఓటర్లను ఎన్నికలకు దూరం చేస్తోందని కోర్టుకు విన్నవించారు.

ఆ బృందం రాకుండానే షెడ్యూలు రద్దు
‘అసెంబ్లీ రద్దయిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించి ఎన్నికలకు సంసిద్ధతపై అంచనాకు రావాల్సి ఉంటుంది. కానీ ఆ బృం దం రాకుండానే ఆగస్టు 28న.. 2019 జనవరి 1 అర్హ త తేదీతో ఓటరు నమోదుకు జారీ చేసిన షెడ్యూలు ను ఈసీ రద్దు చేసింది. 2018 జనవరి 1 అర్హత తేదీ తో ఓటరు నమోదుకు తిరిగి సెప్టెంబర్‌ 8న రెండో షెడ్యూలు జారీచేసింది’ అని కోర్టుకు పిటిషనర్‌ తెలి పారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 8 నాటి షెడ్యూ లు ను రద్దు చేసేలా, ఓటరు జాబితాలో అవకతవకలను సరిదిద్దేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

జాబితాలో ఎన్నో లోపాలు
ఏపీ, తెలంగాణ ఓటర్ల జాబితాలో ఎక్కువ సంఖ్యలో లోపాలున్నాయని కోర్టుకు పిటిషనర్‌ నివేదించారు. సెప్టెంబర్‌ 10న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో 30 లక్షల పేర్లు పునరావృతం అయ్యాయన్నారు. 2014 నుంచి 2018 మధ్య 20 లక్షల ఓటర్లను తొలగించారని.. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి విన్నవించగా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వెళ్లడం వల్ల జరిగి ఉంటుందని చెప్పినట్లు తెలిపారు.

కానీ ఏపీలోనూ 17 లక్షల ఓట్లు తగ్గి నట్లు తాము గమనించామని పిటిషనర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. దాదాపు 48 లక్షల ఓటర్ల విషయంలో గందరగోళం ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం తొలుత జారీ చేసిన షెడ్యూలు ను రద్దు చేసిందని తెలిపారు. ఈ అవకతవకలు సరిచేయకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికం గా నిర్వహించడం సాధ్యం కాదని నివేదించారు.

మరిన్ని వార్తలు