మార్ఫింగ్‌ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం

27 Mar, 2019 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలంటూ సోషల్‌ మీడియా ‘ఫేస్‌బుక్‌’లో కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ 2019’ పేరిట వెలిసిన ఫేస్‌బుక్‌ పేజీ వీటిని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఆ ఫొటోలు సోనియా గాంధీవి  కావు. మొట్టమొదటి జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘డాక్టర్‌ నో’లో హీరోయిన్‌గా నటించిన స్విస్‌ తార ‘ఉర్సులా ఆండ్రెస్‌’ వి. ఆ చిత్రంలో ఆమె మొదటి జేమ్స్‌ బాండ్‌ హీరో స్కాటిష్‌ నటుడు ‘సయాన్‌ కానరీ’తో కలిసి నటించారు.

‘డాక్టర్‌ నో’ చిత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ను లైట్‌గా మార్ఫింగ్‌ చేసి ‘సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్‌పోజింగ్‌లో ఉర్సులా ఆండ్రెస్‌ పెట్టింది పేరవడంతో నాటి కుర్రకారు ఆమెను ముద్దుగా ‘ఉర్సులా అన్‌డ్రెస్‌’ అని పిలుచుకునేవారు. ఆ మాటకొస్తే సోనియా గాంధీ ఫొటోలంటూ తప్పుడు ఫొటోలలో దుష్ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ మగవాడి తొడపై కూర్చున్న అలనాటి ‘బార్‌ వెయిట్రెస్‌’ సోనియా గాంధీ అంటూ ఇటీవల కూడా ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వాస్తవానికి ఆ ఫొటో హాలివుడ్‌ నటి ‘రీస్‌ విథర్‌స్పూన్‌’ది. ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోనియా ఫొటోగా ప్రచారం చేశారు.
 
2004లో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి సోనియా గాంధీ ప్రధాని అవుతారని ప్రచారం జరిగినప్పుడు కూడా సోనియా ‘బార్‌ డ్యాన్సర్‌’గా పనిచేసినప్పటి ఫొటో అంటూ ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. నాటి హాలివుడ్‌ అందాల నటి మార్లిన్‌ మాన్రో ఫొటో మార్ఫింగ్‌ చేశారు. వాస్తవానికి సోనియా గాంధీకి ‘బార్‌ వెయిట్రెస్‌ గానో బార్‌ డ్యాన్సర్‌’గానో పనిచేయాల్సిన అవసరం లేదు, రాలేదు. ఆమె తండ్రి స్టెఫానో ఇటలీలో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో సోనియా గాంధీ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కోర్సు చేస్తున్నప్పుడు రాజీవ్‌ గాంధీ పరిచయం అవడంతో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు