ఆవిడ బొమ్మెల్యే!. ఆయనే ఎమ్మెల్యే!!

8 Oct, 2018 13:21 IST|Sakshi
వలసపాకలలో సిమెంట్‌ రోడ్డు శంకుస్థాపన శిలాఫలకంపై పిల్లి అనంతలక్ష్మితో పాటు సత్తిబాబు ఫొటో

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో సత్తిబాబు ఫొటోలతో శిలాఫలకాలు

ఇదేం విడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్న జనాలు

ఎమ్మెల్యే భర్త హోదాలో పెత్తనం చలాయిస్తున్న వైనం

దాసోహమై అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు

ప్రజాధనంతో వ్యక్తిగత ప్రచారానికి పెద్ద పీట

సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు

పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని సామెత.. అచ్చం అలాగే ఉంది కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని పరిస్థితి. ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి నామమాత్రంగా అధి కారం చలాయిస్తుండగా ఆమె భర్త సత్యనారాయణమూర్తి ఉరఫ్‌ సత్తిబాబు పెత్తనానికి కేరాఫ్‌ అయ్యారు. అన్ని వ్యవహారా లు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నా యి. అధికారులు కూడా ఆయన కొమ్ము కాస్తున్నారు. ఏ అధికార పదవీ లేని ఆయన పేరు, ఫొటోతో ఏకంగా శిలాఫలకాలే వేయిస్తున్నారు. మంది సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సత్తిబాబు ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తుంటే.. ఎప్పటికీ పనులు పూర్తికాని శిలాఫలకాలు అధికార దుర్వినియోగానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో ఒకే నివాస గృహం ఉన్న ఏరియాలో రూ. 8లక్షలతో వేసిన రోడ్డు కోసం నిర్మించిన శిలాఫలకమిది.  శిలాఫలకంపై ఇద్దరు ఫొటోలు ఉన్నాయి. అందులో ఒకటి  ఎమ్మెల్యే పిల్లి అనంత  లక్ష్మిది అయితే మరొకటి  ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ( సత్తిబాబు)ది. ఈయనేమీ ప్రజాప్రతినిధి కాదు. ఎమ్మెల్యే భర్త కావడమే ఆయనకున్న అర్హత.

సాక్షి ప్రతినిధి, కాకినాడ:  కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో నిర్మించిన శిలాఫలకాలపై వేసిన ఫొటోలు ఇప్పుడందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. అధికారులు ఎంత బరి తెగించేశారో అందరికీ అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పసుపు రంగుతో, ఫొటోలతో శిలాఫలకాలు వేయడం, దాంట్లో ప్రజాప్రతినిధి కాని ఎమ్మెల్యే భర్త ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలకు ముఖ్యంగా షాడో నేతలకు అధికారులు ఎంత దాసోహమై పోయారో... ఏ స్థాయిలో అడుగులకు మడుగులు ఒత్తుతున్నారో రూరల్‌ నియోజకవర్గంలో వేసిన శిలాఫలాకాలను చూస్తే స్పష్టమవుతుంది. ప్రజలు ఎన్నుకున్న మహిళా నేతల విషయంలో పురుషాధిక్యం పెత్తనం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. సర్పంచైనా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ సభ్యులు అయినా, ఎమ్మెల్యే అయినా భర్తల పెత్తనం, షాడోల అజమాయిషీ ఎక్కువగా ఉందనేది సర్వత్రా విన్నదే. కానీ, ఎమ్మెల్యే భర్త హోదాలో ఏకంగా శిలాఫలాకాలపై ప్రజాప్రతిని«ధి కాని పిల్లి సత్తిబాబు ఫొటోను ముద్రించడం చూస్తుంటే ఇక్కడ ఏ స్థాయిలో షాడో ఎమ్మెల్యేగా ఆయన దందా సాగిస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నది.

ప్రతి దందాలోనూ ఆయన జోక్యం
ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తగా తప్ప పిల్లి సత్తిబాబుకు మరే హోదా లేదు. కనీసం వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా, కార్పొరేటర్‌గా కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కానీ, అధికారులంతా ఆయన కనుసైగల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ ఎమ్మెల్యేగా అన్నింట్లోనూ తలదూర్చుతున్నారు. ఎమ్మెల్యేను వెనక ఉంచి అంతా తానై వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి దందాలోనూ సత్తిబాబు జోక్యం ఉంటున్నది. అడ్డగోలు వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏ ఒక్క అధికారి నియోజకవర్గానికి వచ్చినా తొలుత ఆయనను కలవాల్సిందే. ఆయనకు చెప్పే నియోజకవర్గంలోకి రావాలి. అంతకన్న ముందు నియోజకవర్గంలో పనిచేయాలనుకుంటే సత్తిబాబు అనుమతి తీసుకోవాలి. ఆ స్థాయిలో నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. అయితే ఇదంతా అనధికారికంగానే జరుగుతోంది. కానీ అధికారులు పిల్లి సత్తిబాబుకు మాత్రం అధికారిక హోదా కట్టబెడుతున్నారు. ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ అత్యుత్సాహంతోనో.... సత్తిబాబు ఆదేశాలతోనూ తెలియదు గాని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలాకాల్లో ఏకంగా ఫొటో పెడుతున్నారు.

ఎమ్మెల్యేతో పాటు సత్తిబాబు ఫొటోను వేసి శిలాఫలకాలను నిర్మిస్తున్నారు. పదవి లేని సత్తిబాబు ఫొటో వేయడం సరికాదని ఇంతవరకు ఏ ఒక్క అధికారీ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవు.  చెప్పాలంటే మెప్పు కోసం ప్రభుత్వ ధనంతో ఇష్టారీతిన శిలాఫలాకాలు వేసేస్తున్నారు. లక్షలాది రూపాయలు శిలాఫలాకాల కోసమే ఖర్చు పెడుతున్నారు. నియోజకవర్గ మొత్తం మీద 2,500 నుంచి 3,000 వరకు ఈ రకంగా శిలాఫలాకాలు వేసినట్టుగా తెలుస్తోంది. ఏ పదవీ లేకుండా తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ శిలాఫలాకాలు చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉంటే చాలు...పదవి లేకపోయినా శిలాఫలకాలపై ఫొటోలు వేసుకోవచ్చనే పరిస్థితి వచ్చేసిందని గుసగుసలాడుకుంటున్నారు. షాడో నేతగా పిల్లి సత్తిబాబు పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్న ఆధారం ఇంకేమి కావాలని జనం బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే శంకుస్థాపనలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా పనులకు మోక్షం కలగడం లేదు. శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపడం లేదు.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో అంగన్‌వాడీ సెంటర్‌ నుంచి లోపలికి ఉన్న ఇళ్ల కోసం రూ.10 లక్షలతో రోడ్డు నిర్మించేందుకు గతేడాది అక్టోబర్‌లో వేసిన శిలాఫలకమిది. ఇంతవరకు రోడ్డైతే వేయలేదు గాని అనంతలక్ష్మి దంపతులతో అట్టహాసంగా నిర్మించిన శిలాఫలకం మాత్రం అటుగా వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది.

మరిన్ని వార్తలు