శుభ సూచికం మాకిదో అదృష్టం

11 Mar, 2019 13:27 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  కాకినాడ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమర శంఖారావం పూరిస్తారు. ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తూ ప్రసంగిస్తారు. శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తారు. తూర్పు మార్పునకు నాంది. ఈ జిల్లాకో సెంటిమెంట్‌. ఇక్కడి నుంచి ప్రారంభించే కార్యక్రమం విజయవంతం అవుతుంది. సమర శంఖారావం వేళ ఎన్నికల షెడ్యూల్‌ రావడం మాకో శుభ సూచికం’ అని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ నియోజకవర్గ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడలోని జ్యూయల్‌ మెడోస్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ఏర్పాటు చేసిన సభా ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం పార్టీ నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ  సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ  పోల్‌ మేనేజ్‌మెంట్‌పై జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారన్నారు. ప్రస్తుతం అర్హులను తొలగిస్తూ, అనర్హులను చేర్పిస్తూ, దొంగ ఓట్లు సృష్టిస్తూ ఎన్నికల్లో గెలవాలని టీడీపీ చూస్తోందని, ఆ కుట్రలను అడ్డుకునేందుకు ఎలా ఉండాలో ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ తెలియజేస్తారన్నారు.

పోలీసులపై ఒత్తిడి తెచ్చి చిన్న చిన్న కేసులున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బైండోవర్‌ కేసులు పెట్టి, భయపెడుతున్నారు. కురసాల  కన్నబాబు మాట్లాడుతూ  దింపు కళ్లం ఆశలో చంద్రబాబు ఉన్నారని, ముఖ్యమంత్రికి అన్నిదార్లూ మూసుకుపోయాయన్నారు. డబ్బుతో ప్రలోభ పెట్టి గెలవాలనుకుంటున్నారని,  పసుపుకుంకుమ, పెట్టుబడి సాయం, సెల్‌ఫోన్‌ల తాయిలాలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వాటిని కూడా ప్రజలు నమ్మకపోవడంతో ఓట్లను కాజేస్తున్నారన్నారు. తమకు అనుకూల ఓట్లును చేర్పించుకుని, వైఎస్సార్‌సీపీ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర పన్నారన్నారు. రాష్ట్ర ప్రజల డేటా చౌర్యం చేసి దొంగే దొంగా అన్నట్టుగా అరుస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల వరకు కాళ్లు పట్టుకుని, తర్వాత జుత్తు పట్టుకున్న స్వభావం చంద్రబాబుదని, ఇదంతా జనాలకు తెలుసునని అన్నారు. వైఎస్‌ జగన్‌పై నమ్మకం పెరిగిందని, ప్రజలంతా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిపెస్టో ఆచరణ సాధ్యంగా ఉంటుందని నేతలు అన్నారు. వైఎస్‌ జగన్‌ నైతిక విలువలు పాటిస్తూ  పదవులకు రాజీనామా చేయించి ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ  వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకున్నట్టుగానే వైఎస్‌ జగన్‌ను ప్రజల్లో తమ గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు పాలన ఈ రోజుతో అంతమైనట్టేనని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సమన్వయకర్తలు చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణు గోపాలకృష్ణ, అనంత ఉదయ భాస్కర్, కాకినాడ పార్లమెంట్‌ బూత్‌ కమిటీ కన్వీనర్‌ బీవీఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు