కేటీఆర్‌ను కలిసిన రోహిత్‌రెడ్డి

6 Jun, 2019 13:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌​ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పనున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇదివరకే టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపిన రోహిత్‌రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయినట్టుగా సమాచారం. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ చేరారు. తాజాగా రోహిత్‌రెడ్డి చేరికతో ఆ సంఖ్య 12కు పెరిగింది. నల్లగొండ ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంఖ్య 6కు చేరనుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడనున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌లో 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలనున్నారు. 

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ విందు
కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలంతా ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేఖను సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు