విజయం వైపు నడిపిన ‘పైలెట్‌’

12 Dec, 2018 05:06 IST|Sakshi

జైపూర్‌/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజేష్‌ పైలెట్‌ కుమారుడే సచిన్‌ పైలెట్‌(41). ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌(యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్‌ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్‌ పైలెట్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్‌ 1995లో అమెరికాలో ప్రైవేట్‌ పైలెట్‌ లైసెన్స్‌ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో కమిషన్డ్‌ ఆఫీసర్‌గానూ పనిచేశారు. డ్రైవింగ్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం.

ప్రముఖులు.. గెలుపోటములు
రాజస్తాన్‌ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్‌రాపటన్‌), పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌సింగ్‌ కుమారుడు మాన్వేంద్ర సింగ్‌ను ఝల్‌రాపటన్‌ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్‌ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్‌ కైలాష్‌ మేఘ్‌వాల్‌ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు.

కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్‌ మీనా(రాజ్‌గఢ్‌–లక్ష్మణ్‌గఢ్‌), మదన్‌ ప్రజాపత్‌(పచ్‌పద్ర), జహీదా ఖాన్‌(కమన్‌), రామ్‌లాల్‌ జాట్‌(మండల్‌), ప్రశాంత్‌ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్‌(అనూప్‌గఢ్‌), కాలూరామ్‌(దాగ్‌), సామారామ్‌ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్‌(రియోదార్‌) విజయం సాధించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్‌ కుమార్‌(తిజారా), వజీబ్‌ అలీ(నాగర్‌) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్‌ పునియా (భద్ర), గిరిధారీలాల్‌ మహియా (శ్రీ దుంగార్‌గఢ్‌)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్‌ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్‌ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్‌ఖాన్‌ ఓటమి పాలయ్యారు.  

 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు