మీ గూండాగిరీ.. ఇక్కడ చెల్లదు

12 Mar, 2020 03:40 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి స్పష్టీకరణ

బుద్ధా వెంకన్న, బొండా ఉమా పది కార్లు వేసుకొని మాచర్లకు రావాల్సిన అవసరం ఏమిటి?   

మాచర్ల: ‘నేను ఛాలెంజ్‌ చేస్తున్నా. మా దగ్గరికి వచ్చి గూండాయిజం చేస్తామంటే కుదరదు. పల్నాడు ప్రాంతంలో హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయడం అలవాటు. ఏదో షో చేసి మీడియా ముందు మాట్లాడటం కాదు. మీకు చేతనైతే మాచర్లకు రండి... లేదా నేనే విజయవాడ వస్తా’’ అంటూ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన బుధవారం మాచర్లలో విలేకరులతో మట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వారి అనుచరులు పది కార్లలో మాచర్లకు తరలివచ్చారని, దివ్యాంగుడిపై కారు వేగంగా వెళ్లటంతో అక్కడ స్థానికులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డం పెట్టుకొని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 
- విజయవాడలో గల్లీ రాజకీయాలు చేసే బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు పది కార్లు వేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? 
- ప్రతిదీ రాజకీయం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలజడి సృష్టించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు ఇక్కడ గొడవలు చేయాల్సిన పని ఏమిటి? మీ గూండాగిరీ పల్నాడులో చెల్లదు. 
- ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతి వద్ద నాపై దాడి చేయించారు. 
టీడీపీ తరఫున నామినేషన్లు వేసేవారు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకొని గల్లీ గూండాలు నాటకాలకు తెరతీశారు. 
మా పార్టీ శ్రేణులపై దాడులు చేయడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వచ్చి కారు నడిపి ఒక దివ్యాంగుడిని గాయపరచడం వల్లే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు నానా హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టారు.

మరిన్ని వార్తలు