ఒవైసీ ఒత్తిడితోనే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

19 Feb, 2020 02:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌

మజ్లిస్‌ అధినేతకు లొంగిపోయిన కేసీఆర్‌

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఒత్తిడితోనే తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలంటూ మూడ్రోజుల క్రితం తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం చేయడం కూడా ఒవైసీ ఒత్తిడి ఫలితమేనని అన్నారు. వెంటనే ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకసారి పార్లమెంట్‌లో చట్టం అయిన తర్వాత అది భారతదేశ చట్టంగా మారుతుందని, దాన్ని అన్ని రాష్ట్రాలు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మత ప్రాతిపదికన ప్రజల మధ్య విభజన కోసం యత్నించే మజ్లిస్‌ పార్టీ బుట్టలో కేసీఆర్‌ పడిపోయారని, ఆయన కూడా మత రాజకీయాల వైపు నడవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఏఏపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అసదుద్దీన్‌ ఒవైసీని ముస్లింలు కూడా నమ్మరని, ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని కొట్టిపడేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారని.. ఆ తర్వాత రెండ్రోజులకే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని ఆరోపించారు. తెలంగాణ పురోగతికి కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని, అందుకు తగ్గట్టు నిధులు కేటాయిస్తోందని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతోంది..
తెలంగాణలో బీజేపీ బాగా బలపడుతోందన్నారు. గత నలుగురు ఎంపీ అభ్యర్థులు గెలవడం, మున్సిపల్‌ ఎన్నికల్లో బలాన్ని రెట్టింపు చేసుకోవడం దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు అరవింద్, సంజయ్, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు