'మీ కాళ్లు మొక్కుతా.. చంద్రబాబును అడగండి'

23 Feb, 2018 11:30 IST|Sakshi
ఒకప్పుడు ప్రత్యేక హోదాపై చంద్రబాబు చెప్పిన మాటల వీడియోను సెల్‌ఫోన్‌ ద్వారా మీడియాకు చూపుతున్న సోము వీర్రాజు

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా అనే మాట ఎవరైనా అంటే వారిని జైలులో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత సోము వీర్రాజు అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ప్రత్యేక హోదా విషయంలో నిలదీస్తున్న సమయంలో చంద్రబాబు ఈ మాటలు అన్నారని గుర్తు చేశారు. మిత్రపక్షమైన బీజేపీపై సవాల్‌ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. వివిధ సందర్భాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన ప్రకటనలు సోము వీర్రాజు మీడియాకు బహిర్గతం చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో సోము వీర్రాజు మాట్లాడాతూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను మీడియాకు చూపించారు.

'ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు అన్నారు. హోదాతో ఒరిగేదేం లేదు. హోదా రాకపోతే నష్టం 3వేల కోట్లేనని తెలుగుదేశం పెద్దలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది మేం నమ్మాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా విశ్వసించింది. కానీ, ఇప్పుడు జైలుకు ఎవరు వెళ్లాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుంది. మీ కాల్లకు మొక్కుతున్నాను.. ఈ విషయాలపై మీడియా మిత్రులు సీఎం చంద్రబాబును ప్రశ్నించండి. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించాంమని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చిన కథనాలే. ఆధారాలుంటే రండి చెప్పండి అని అన్నారు.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి?

ఆరోజు ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేస్తున్న ప్రతిపక్షాలకు సవాల్‌ అన్న చంద్రబాబు ఈ రోజు మాత్రం మిత్రపక్షాలకు సవాల్‌ అని అంటున్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చిందని, దానికి కేబినెట్‌ తీర్మానం చేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారు. త్రికరణ శుద్ధిగా చంద్రబాబు చెప్పిన మాటలు సత్యాలు అని నమ్మాం. ఈ విషయాలు అడగాల్సిన ధర్మం మీడియా మిత్రులకు ఉంది. ఎవరైనా ఆందోళన చేస్తే చట్టం తన పనితాను చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తుంది చంద్రబాబే. చంద్రబాబుకు ఆ చట్టం వర్తించదా. తేదీల వారిగా ఆయన ఏమేం చెప్పారో అవన్నీ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎనిమిది ప్రకటనలు చేశారు. సుజనా చౌదరి కూడా కేంద్రం అన్ని ఇచ్చింది.. ఇంతకంటే ఎక్కువగా కేంద్రాన్ని అడగలేం. ఈ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది.  ప్రత్యేక హోదాకు రాయితీలకు సంబంధం లేదు.. ఒక వేళ ఇచ్చినా ఈ ఏడాది మార్చి వరకే ఉంటుందని సుజనా చౌదరీ చెప్పారు.. మీడియా ఈ విషయాలపై కూడా వారినే ప్రశ్నించాలి.

10.9.2016న వార్త ప్రకారం హోదాకు సమానంగా ఇచ్చిన ప్యాకేజీ తీసుకోవద్దా.. ప్రతిపక్షాల నిరసనలకు ప్రజలు సహకరించవద్దు అని చంద్రబాబు అన్నారు. పోలవరం 2018నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్యాకేజీపై అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం చేశారు. అప్పుడు మాట్లాడింది నిజమా ఇప్పుడు మాట్లాడింది నిజమా? చంద్రబాబు హోదా వద్దు? ప్యాకేజీనే ముద్దు అన్నారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఉద్యమం చేస్తుంటే దానికి మద్దతివ్వొద్దని చంద్రబాబు అన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు వైఖరిలో ఎందుకింత మార్పు వచ్చింది. హెదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఈ విషయాలు అన్ని కూడా అసెంబ్లీలో, బయటా మాట్లాడారు' అని పలు విషయాలను ఆధారాలతో సహా సోము వీర్రాజు మీడియా ముందు పెట్టారు.

మరిన్ని వార్తలు