‘లోహియా’ పేరిట రాజకీయాలు

24 Mar, 2019 03:40 IST|Sakshi

కాంగ్రెస్‌తో కలిసి ‘కల్తీ కూటమి’ని ఏర్పాటు చేస్తున్నాయి

ఈ పరిణామాలతో లోహియా ఆత్మ  క్షోభిస్తుంది: నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/లక్నో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రామ్‌మనోహర్‌ లోహియా అనుచరులమని చెప్పుకునే పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. లోహియా సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పే పార్టీలు ఆయన పోరాడిన కాంగ్రెస్‌ పార్టీతోనే పొత్తుకు ప్రయత్నాలు సాగించడం గర్హనీయమన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ‘అవకాశవాద కల్తీ కూటమి’గా ఏర్పడుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే లోహియా ఆత్మ నిజంగా క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు.

తలాక్‌ బిల్లును వ్యతిరేకించారు..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు తెలిస్తే లోహియా గర్వపడేవారని మోదీ తెలిపారు. ‘ లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కృషి సించాయ్‌ యోజన, ఈ–నామ్, భూసార పరీక్ష కార్డులు(ఎస్‌హెచ్‌సీ) జారీచేస్తున్నాం’ అని వెల్లడించారు. కులతత్వం, లింగ వివక్ష లోహియాను చాలా బాధించేవన్నారు. ‘కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయిన రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోలేదు. వీరంతా లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నామని అబద్ధాలు చెప్పారు’ అని అన్నారు.

దేశానికీ ద్రోహం చేస్తారు
లోహియా ఎప్పుడూ మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ భయంతో వణికిపోయేదని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో రైతులను వేధించింది. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచింది. కానీ కాంగ్రెస్‌ నేతల స్నేహితులు, బంధువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. దేశభద్రతను విస్మరించారు. లోహియా కరుడుకట్టిన కాంగ్రెస్‌ వ్యతిరేకి. ఈరోజు లోహియా తమకు స్ఫూర్తి అని చెప్పుకునే పార్టీలు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఆయన్ను అవమానించే ఏ అవకాశాన్నీ విపక్ష నేతలు వదులుకోవడం లేదు.

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని ఆయన చూసుంటే భయపడిపోయేవారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ విమర్శలను  ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ తిప్పికొట్టారు. బీజేపీ ప్రస్తుతం మనోవైకల్యంతో బాధపడుతోందన్నారు. ‘ఓవైపు మహాత్మాగాంధీ, డా.బీఆర్‌ అంబేద్కర్, రామ్‌మనోహర్‌ లోహియా, భగత్‌సింగ్, సర్దార్‌ పటేల్‌ ఆదర్శాలను పాటిస్తున్నట్లు బీజేపీ చెబుతుంది. అంతలోనే ఈ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించే, అసహ్యించుకునే వ్యక్తులను అనుసరిస్తోంది. వాళ్లు ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకావట్లేదు’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు