100 రోజుల్లో పెనుమార్పులు

9 Sep, 2019 03:43 IST|Sakshi
ప్రధాని మోదీకి తలపాగా పెడుతున్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

ఎన్‌డీయే రెండో విడత పాలనపై ప్రధాని మోదీ

ప్రజలకు మాపై విశ్వాసం ఏర్పడింది

హరియాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి

రోహ్‌తక్‌(హరియాణా): ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టాక 100 రోజుల పాలనలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి, విశ్వాసం, భారీ మార్పులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తమ పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగం, జాతీయ భద్రత వంటి అంశాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు 130 కోట్ల మంది భారతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు.

ప్రజల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోహ్‌తక్‌లో జరిగిన ‘విజయ్‌ సంకల్ప్‌’ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించడం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం వంటి వాటి కోసం కీలక చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అత్యధిక బిల్లులు పాసయ్యాయని వెల్లడించారు. దీనికి సహకరించిన ప్రతిపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాబోయే రోజుల్లో దేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఉద్ఘాటించారు. ఏ రంగంలోనైనా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా కసరత్తు చేస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ అంశం, తాగునీటి సంక్షోభం సహా పలు సవాళ్లు తమ ముందున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని వ్యాఖ్యానించారు. ఇండియా తనకు ఎదురైన సవాళ్లను సవాల్‌ చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు.

చంద్రయాన్‌–2 దేశాన్ని ఏకం చేసింది..
ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగం దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌–2 ప్రయోగంలో చివరి 100 సెకన్లు గెలుపు, ఓటముల నిర్వచనాలను మార్చేశాయని తెలిపారు. దేశ ప్రజలు గెలుపు, ఓటముల పరిధిని దాటి ఆలోచిస్తున్నారని.. అలా చేసినప్పుడే దేశం తన లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల స్ఫూర్తిలాగా ప్రస్తుతం ఇస్రో స్ఫూర్తి కొనసాగుతోందని అన్నారు. దేశమంతా మార్పుపై విశ్వాసంతో ముందుకు సాగుతోందని అన్నారు.

మరిన్ని వార్తలు