చంద్రబాబు యూటర్న్‌పై మోదీ ఆరా..

13 Jun, 2018 18:03 IST|Sakshi
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను అడిగారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలతో జరిగిన భేటీ గురించి బుధవారం ఆయన ఇతర నాయకులతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

అమరావతి శంకుస్థాపన సమయంలో చంద్రబాబే నీళ్లు, మట్టి తెమ్మని ప్రధాని మోదీని అడిగారని వెల్లడించారు. దాంతో ప్రధాని నీరు, మట్టి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా మోదీ నీళ్లు, మట్టి ఇచ్చారని వస్తున్న విమర్శలపై కన్నా మండిపడ్డారు. రాష్ట్రానికి కావాల్సినవన్నీ తీసుకుంటూనే చంద్రబాబు బీజేపీ గురించి రాష్ట్ర ప్రజల మనసులో విష బీజాలు నాటారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉందని అమిత్‌ షా చెప్పినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడంపై మోదీ అడిగారని తెలిపారు. ఆయనకు మనం అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చాం, అడిగినవన్నీ చేశాం, అయినా ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారని చెప్పారు. అందుకు సమాధానంగా నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పానని కన్నా తెలిపారు.

1999లో అనుభవం ఉండి కూడా 2014లో మళ్లీ ఆయన్ను నమ్మడం మన తప్పేనని చెప్పినట్లు వివరించారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌, పెట్రోలియం ప్రాజెక్టులు, పోర్టు అన్నీ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. త్వరగా వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు కన్నా.

మరిన్ని వార్తలు