అనుమానాలొద్దు..రాష్ట్రానికి అండగా ఉంటాం: మోదీ

9 Mar, 2018 15:34 IST|Sakshi
అగర్తలాలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

త్రిపురలో బీజేపీ సర్కారుకు ప్రధాని హామీ

అగర్తలా : త్రిపురలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి కేంద్రం పూర్తిస్థాయిలో అండగా నిలబడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. సమాఖ్య స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాలను మరింతగా వృద్ధిలోకి తెస్తామన్నారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో శుక్రవారం జరగిన ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

‘‘అపారమైన సహజవనరులు ఈశాన్యాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కొత్త శిఖరాలను చేరే మీ(ఈశాన్య) ప్రయాణంలో యావత్‌ దేశం అండగా నిలుస్తుంది. త్రిపుర ప్రజల జీవితాల్లో కొత్తవెలుగులు నింపడానికి అవసరమైన సహాయసహకారాలన్నీ కేంద్రం అందిస్తుంది. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు’’ అని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సదర్భంగా త్రిపుర కొత్త సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ను, డిప్యూటీ సీఎం విష్ణు దెబార్మా, ఇతర మంత్రులకు శుభాభినందనలు తెలిపారు.

ఏపీ, బిహార్‌, అసోంలకూ ఇలాగే : పార్లమెంట్‌లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశైంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన హామీల తాలూకు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఏపీకి హోదా కల్పిస్తామని సాక్షాత్తూ వేంకటేశ్వరుడి సన్నిధిలో మోదీ ప్రకటించడం, బిహార్‌ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్రానికి రూ.1.50లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాననడం, అసోం ఎన్నికల ప్రచారంలోనూ భారీ తాయిలాలు ప్రకటించడం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని ఎన్డీయే ప్రభుత్వాల్లో ఏమేరకు మోదీ హామీలు అమలుజరిగాయన్నది విదితమే!

మరిన్ని వార్తలు