కాంగ్రెస్‌తోనే మందిర్‌ నిర్మాణంలో జాప్యం : మోదీ

25 Nov, 2018 16:59 IST|Sakshi

జైపూర్‌ : అయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపిం‍చారు. రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్వార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్‌ న్యాయవ్యవస్ధను రాజకీయాల్లోకి లాగుతోందని, 2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా అయోధ్యపై కోర్టు తీర్పును వాయిదా వేయాలని ఓ కాంగ్రెస్‌ నేత కోరారని చెప్పారు.

న్యాయస్ధానాలపై భీతిగొలిపే వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పూనుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు సరైనవి కాదన్నారు. గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన గరీబీ హఠావో నినాదంతో మార్పు రాలేదని, బ్యాంకుల జాతీయీకరణ విఫలమైందని శనివారం ప్రధాని మోదీ ప్రత్యర్ధి పార్టీపై ఆరోపణలు గుప్పించారు.

భారత తొలి ప్రధానిగా సర్ధార్‌ పటేల్‌ బాధ్యతలు చేపడితే రైతుల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేవారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో వెల్లడించాలని శివసేన చీఫ్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో మందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడం గమనార్హం.

మరిన్ని వార్తలు