‘ఇదే నా సవాల్‌.. దమ్ముంటే అలా చెప్పాలి’

17 Dec, 2019 18:55 IST|Sakshi

అనవసర భయాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం

రాంచి : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కావాలనే కాంగ్రెస్‌ నేతలు సీఏఏపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలలో భయాల్ని రెచ్చగొట్టి అల్లర్లకు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని బెర్‌హైత్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ..

‘ఈ సభ ద్వారా కాంగ్రెస్‌.. దాని అనుబంధ పార్టీ నాయకులకు ఛాలెంజ్‌ విసురుతున్నా. వాళ్లకు దమ్ముంటే.. పాకిస్తానీయులకు భారత పౌరసత్వం ఇవ్వడం తమకు సమ్మతమేనని, ఆర్టికల్‌ 370 కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పాలి. అప్పుడు వారినేం చేయాలో భారత ప్రజలే నిర్ణయిస్తారు’అని అన్నారు. ఏ ఒక్క భారతీయుడి హక్కులకు పౌరసత్వ చట్టం విఘాతం కలిగిందని ప్రధాని పునరుద్ఘాటించారు. 

‘పొరుగు దేశాల్లో ఉన్న.. పీడనకు గురవుతున్న మైనారిటీల కోసం ఈ చట్టం తెచ్చాం. 2015కు ముందు భారత్‌కు వచ్చిన  పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం. దీంతో భారత ప్రజల హక్కులకు భంగం ఎలా కలుగుతుంది..? కాంగ్రెస్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కావాలనే ముస్లిం ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్‌ విభజించు పాలించు విధానంతో ఇప్పటికే  దేశం ఓసారి ముక్కలైంది. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మళ్లీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ’అని ప్రధాని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు