ఆహా..! ఆమె నవ్వు.. మోదీ విసుర్లు

7 Feb, 2018 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులతోపాటు రేణుకా చౌదరి పదేపదే మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఓ దశలో సభాపతిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను మందలించారు కూడా. అయితే, ఈ సమయంలో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రసంగిస్తుండగా రేణుక గట్టిగా నవ్వుతుండటంతో.. 'సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని కోరుతున్నా.. రామాయణం సీరియల్‌ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది' అంటూ మోదీ అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.

ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలోని ఆసక్తికర వ్యాఖ్యలు..

  • ఆధార్‌ను మేమే తీసుకొచ్చామని కాంగ్రెస్‌ పార్టీ పదేపదే చెప్తోంది. కానీ, 1998లో రాజ్యసభలో జరిగిన చర్చలో ఎల్‌కే అద్వానీ ఈ విషయం గురించి చెప్పారు. ఆధార్‌ మూలాలు అద్వానీ ప్రసంగంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తించాలి
  • ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులో మార్పులు చేయాలని మీరు (కాంగ్రెస్‌) అంత బలంగా భావిస్తే.. చాలాకాలం మీరు అధికారంలో ఉన్నారుగా.. అప్పుడెందుకు ఈ చట్టాన్ని తీసుకురాలేదు?
  • కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛ భారత్‌, మేకిన్‌ ఇండియా, సర్జికల్‌ స్ట్రైక్స్‌, యోగా డే ఇలా మా ప్రతి పథకాన్ని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కాంగ్రెస్‌ కావాలనుకుంటే ఇలా మమ్నల్ని విమర్శించవచ్చు, కానీ ఎందుకు ట్రిపుల్‌ తలాక్‌, ఓబీసీ కమిషన్‌ బిల్లులను అడ్డుకుంటోంది. ఓబీసీల ఆకాంక్షలు కాంగ్రెస్‌కు పట్టవా?
  • బీజేపీపై విమర్శలు చేస్తూ.. మోదీని తిడుతూ.. మీరు(కాంగ్రెస్‌) దేశాన్ని కూడా తిడుతున్నారు. ఇది సరైనదేనా

మరిన్ని వార్తలు