కేసీఆర్‌దే ‘బంగారు కుటుంబం’

4 Dec, 2018 06:09 IST|Sakshi
గద్వాల సభలో అభివాదం చేస్తున్న రాహుల్‌. చిత్రంలో డీకే అరుణ, ఉత్తమ్‌

ప్రజా ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ పాలన: రాహుల్‌ గాంధీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/గద్వాల: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్‌.. పాలనలో తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావించామని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు,æ అమరవీరుల ఆశయాలకు భిన్నంగా పనిచేసిందని దుయ్యబట్టారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేసిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గద్దెనెక్కిన మరుక్షణమే ప్రాజెక్టుల రీడిజైన్‌ను మొదలుపెట్టిన ఆయన అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని ఆరోపించారు. ప్రతి దాంట్లో కమీషన్‌ ముట్టందే ఆయన పనిచేయరని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10 వేల కోట్లు అయితే దాన్ని రూ.60 వేల కోట్లకు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని, రంగారెడ్డి జిల్లాకు ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నది కూడా టీఆర్‌ఎస్సేనని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ జీ విశ్రాంతి తీసుకో..!
‘తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న హామీని విస్మరించావు.. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ చేస్తానన్న హామీని తుంగలో తొక్కావు. అడుగడుగునా తెలంగాణ ప్రజానీకాన్ని వంచించిన నీకు పాలన చేతకాదు. మీరు రూ.300 కోట్ల భవంతిలో విశ్రాంతి తీసుకుంటే.. మేం అన్ని పనులు చేసి చూపిస్తాం. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజనం, ఆహార భద్రత పథకాలను కేసీఆర్‌ సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రజల దగ్గర వసూలు చేసిన ప్రతి పైసా తన ఖజానాకు మళ్లించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతీ రూపాయి మీ అవసరాల కోసమే ఉపయోగిస్తాం. ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి, విద్య, ఇతర అవసరాల కోసం వినియోగిస్తాం’అని రాహుల్‌ అన్నారు.

కేసీఆర్‌ అవినీతికి మోదీ కాపలాదారు..
‘కేసీఆర్‌ చేసే ప్రతి అవినీతి పనికి మోదీ కొమ్ముకాస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు అంశాలను దేశమంతా వ్యతిరేకిస్తే.. కేసీఆర్‌ మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించడం వెనుక చీకటి ఒప్పందం దాగుంది. మోదీకి కేసీఆర్‌ నమ్మిన బంటు. కేసీఆర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారు గనుకే.. మోదీ ముందు చేతులు కట్టుకొని నిల్చుంటున్నారు. కేంద్రా న్ని పల్లెత్తు మాట అనడానికి ధైర్యం చేయడం లేదు. టీఆర్‌ఎస్, మజ్లిస్‌.. బీజేపీకి రహస్య మిత్రులు. మహారాష్ట్ర, అస్సాం ఎన్నికల్లో బలం లేకున్నా కాం గ్రెస్‌ ఓటమే లక్ష్యంగా బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం మద్దతు పలికింది’అని రాహుల్‌ విమర్శించారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ప్రజాకూటమి చైర్మన్‌ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాండూరు అభ్యర్థి రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.

గద్వాలలో...
‘ఐదేళ్లకు ముందు తెలంగాణ ప్రజలు ఓ కల కన్నారు. నయా తెలంగాణ ఏర్పడుతుందని.. నీళ్లు, నిధులు, నియామకాలు దక్కితే భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటందని ఆశించారు.. సీఎంగా కేసీఆర్‌ మీ కలలు నెరవేరుస్తారని ఆశించారు.. కానీ ఆ స్వప్నాలను నెరవేర్చకుండా మోసం చేశారు’అని ఏఐసీసీ రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో 22లక్షల మందికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా, ఐదు వేల మందికి కూడా అందలేదు. దళితులు, ఆదివాసీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. ప్రజలు కలలుగన్న తెలంగాణ నిర్మిస్తానని బంగారు భవిష్యత్‌ ఉంటుందని మాయమాటలు చెప్పి ఆ తర్వాతా ప్రజలను వంచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు నిలిపివేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతా లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుంది. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చి రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. రైతుల అనుమతి లేకుండా భూ సేకరణ చేస్తే ఆ రైతుకు నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలనే చట్టంలోని నిబంధనలను కేసీఆర్‌ తుంగలో తొక్కారు. తమ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని అడిగిన వారిపై కేసులు నమోదు చేసి బేడీలు వేసి జైలుకు తరలించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జీఎస్టీని సమీక్షిస్తాం. జల్, జంగల్, జమీన్‌ పేరిట గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తాం’అని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గద్వాల ప్రజాకూటమి అభ్యర్థి డీ.కే.అరుణతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, ప్రజా గాయకుడు గద్దర్, నాయకులు సలీంఅహ్మద్, నన్నూరి నర్సిరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ మంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సోమవారం తాండూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రజలు
 

మరిన్ని వార్తలు