ఆ హామీలపై మోదీ మాట్లాడరు

4 May, 2019 04:32 IST|Sakshi

ఖాతాలో రూ.15లక్షల జమ, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలపై రాహుల్‌ గాంధీ విమర్శ

లక్నో/రెవా: ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేయడం, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల కల్పన అంశాలపై మాట్లాడవద్దని ప్రధాని  మోదీకి ఆయన టెలీప్రాంప్టర్లు చెబుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రెవా, రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ల్లో రాహుల్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మోదీజీ 2014 ఎన్నికల ప్రచారసమయంలో ఇచ్చిన ఉద్యోగ కల్పన, ప్రతీ భారతీయుడి ఖాతాలోకి రూ.15 లక్షలు జమచేసే çహామీలపై పొరపాటున కూడా మాట్లాడకూడదని ఆయన టెలీప్రాంప్టర్ల మీద స్పష్టంగా రాసుంది’ అని రాహుల్‌ అన్నారు. మోదీ ఎన్నికల ప్రచార సభల్లో అనేకసార్లు సొంతంగానే మాట్లాడుతున్నప్పటికీ ఆయన కొన్నిసార్లు టెలీప్రాంప్టర్లను ఉపయోగించారు.

45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం
మోదీ మాటలను నమ్మి అత్యంత ఎక్కవగా మోసపోయింది దేశ యువతేననీ రాహుల్‌ అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారనీ, ఇప్పుడు చూస్తే కొత్త ఉద్యోగాలు పెద్దగా రాకపోగా, ప్రతీ 24 గంటలకు 27 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ నిరుద్యోగం రేటు ఈ స్థాయిలో లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

అమేథీలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తా..
తాను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాహుల్‌ శుక్రవారం ఓ బహిరంగ లేఖ రాస్తూ ఆ నియోజకవర్గంలో సాగుతున్న, బీజేపీ అడ్డుకుంటున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని చెప్పారు. ‘అమేథీ కుటుంబం’కు రాహుల్‌ భావోద్వేగంతో ఈ లేఖ రాశారు. తాను దృఢంగా నిలబడటానికి, ప్రజల కష్టాలు విని వారి తరఫున పోరాటం చేయటానికి అవసరమైన శక్తిని తాను అమేథీ ప్రజల నుంచే పొందినట్లు రాహుల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే, బీజేపీ నిలిపివేసిన పనులను మేం ప్రారంభిస్తామని అమేథీ ప్రజలకు నేను మాట ఇస్తున్నా’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు