మోదీకి ట్రిపుల్‌ సవాల్‌!

4 Feb, 2019 04:27 IST|Sakshi
మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ

మమత, మాయావతి, ప్రియాంకలతో ఢీ

అందరి లక్ష్యం మోదీని గద్దె దించడమే

వాళ్లు ముగ్గురూ ముగ్గురే. ఒక్కొక్కరు ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారు. అయితేనేం అత్యంత శక్తిమంతమైన మహిళలు. పశ్చిమబెంగాల్‌లో ఎర్రకోటను బద్దలు కొట్టి 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించి, ఫైర్‌ బ్రాండ్‌గా ఎదిగిన బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎవరి ఊహకూ అందని విధంగా దళితులు, అగ్రవర్ణాల అరుదైన సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములాతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్ని శాసించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిగా ప్రధాన కార్యదర్శి హోదాలో రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ.. ఈ ముగ్గురమ్మలు ఈసారి ఎన్నికల్లో ప్రధాని మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తారా? ఈ ముగ్గుర్నీ ఎదుర్కోవడమే మోదీ ముందున్న అతి పెద్ద సవాలా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మమత, మాయావతిలు ప్రత్యర్థులు విలవిల్లాడేలా రాజకీయ వ్యూహాలను రచించడంలో దిట్టలు. ఎన్డీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే  ప్రధాని పదవి రేసులో ముందున్నవారు. ప్రియాంకకు రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ నాన్నమ్మ ఇందిరాగాంధీ పోలికల్ని పుణికిపుచ్చుకోవడంతో ప్రజల్లో ఆమెకున్న ఛరిష్మా వేరు.

మాయావతి
ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. ఈస్థాయి విజయాన్ని ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ జీర్ణించుకోలేకపోయాయి. ఈసారి మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్‌ కూడా తమకు మిత్రపక్షమేనన్న పరోక్ష సంకేతాలు పంపుతూ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సొంత నియోజకవర్గాలైన  రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పోటీకి కూడా దిగడం లేదు. ఎన్నికల అనంతరం పొత్తులపై  కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. పైపెచ్చు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు కూడా తెలుపుతోంది. 63 ఏళ్ల వయసున్న మాయావతి.. మోదీకి చెక్‌ పెట్టడం కోసం తనకు ఆగర్భ శత్రువైన ఎస్పీతో కూడా చేతులు కలిపారు.

మమతా బెనర్జీ
ఇక అన్నీ కలిసి వస్తే ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీచేసి రైల్వే మంత్రిగా కూడా పనిచేసిన మమత ఈ ఎన్నికల్లో బీజేపీపై ఏ మాత్రం మమత చూపించడం లేదు. గత నెలలోనే కోల్‌కతాలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్డీయే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్‌తో నేరుగా ఎలాంటి పొత్తు లేకపోయినప్పటికీ మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆమె ఎవరితో చేతులు కలిపేందుకైనా సిద్ధమవుతున్నారు.

ప్రియాంక గాంధీ
ఇక రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో మంచి జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాకు చెక్‌ పెట్టడం కోసమే తమ పార్టీ తురుపు ముక్క ప్రియాంకను రంగంలోకి దించుతోంది. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయంగా మద్దతునిచ్చే బ్రాహ్మణులు, ఠాకూర్లు ఇటీవల కాలంలో బీజేపీ వైపు మళ్లిపోయారు. ప్రియాంక రాకతో వారు కాంగ్రెస్‌ గూటికి తిరిగి వస్తారన్న ఆశలు పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇక ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో దళితులు, ముస్లింలు ఆ కూటమికే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇవన్నీ బీజేపీ విజయావకాశాల్ని దెబ్బ తీస్తుందనే అంచనాలున్నాయి. 

విపక్షాల్లోనే ఎక్కువ
ఎన్డీయేతో పోల్చి చూస్తే విపక్షపార్టీల్లోనే శక్తిమంతమైన మహిళా నేతలు ఉన్నారు. సహజంగానే వారివైపు మహిళా ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తారో వారే అధికార అందలాన్ని అందుకునే అవకాశమైతే ఉంది. ‘‘బీజేపీ చాలా ఆందోళనలో ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయింది. విపక్షాల్లో ఉన్న శక్తిమంతమైన మహిళలే మోదీకి ఈ ఎన్నికల్లో ముప్పుగా మారుతారు‘‘ అని బీజేపీకి గుడ్‌ బై కొట్టేసిన యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. మాయావతి, మమతా బెనర్జీ వంటి నేతల పట్ల కేవలం మహిళా ఓటర్లే మొగ్గు చూపిస్తారనుకోవడం సరికాదని అంటున్నారు బీఎస్పీ అధికార ప్రతినిధి సుధీంద్ర భదోరియా.

బీజేపీవైపే ఉన్నారా?
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో కొంత అపప్రధను మూటకట్టుకున్నప్పటికీ మోదీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడే. ఓ ముగ్గురు మహిళలు చేతులు కలిపినంత మాత్రాన మోదీకి వచ్చే ముప్పేమీ లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆడవాళ్ల కోసం టాయిలెట్ల నిర్మాణం, సబ్సిడీ రేట్లకే గ్యాస్‌ సిలిండర్లు వంటివి మోదీ సర్కార్‌ పట్ల మహిళల్లో సానుకూలతనే పెంచాయి. అంతే కాకుండా మోదీ తన కేబినెట్‌లో కూడా మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారు. మొత్తం 26 మంది మంత్రులున్న కేబినెట్‌లో ఆరుగురు మహిళలున్నారు. ఇవన్నీ మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలేనని మహిళలు తమవైపే ఉంటారన్న ధీమాలో బీజేపీ ఉంది.

మరిన్ని వార్తలు