బెయిల్‌పై ఉండి.. నన్ను విమర్శిస్తారా?

13 Nov, 2018 03:38 IST|Sakshi
వారణాసిలో జాతీయరహదారులు, నీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

సోనియా, రాహుల్‌పై ప్రధాని మోదీ ధ్వజం

వారి నుంచి నిజాయితీ సర్టిఫికెట్‌ అక్కర్లేదని వెల్లడి

ఛత్తీస్‌లో రెండో విడత ప్రచారం

బిలాస్‌పూర్‌: కాంగ్రెస్‌ పార్టీ, గాంధీల కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బిలాస్‌పూర్‌లో పర్యటించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలను ప్రస్తావిస్తూ ‘బెయిలుపై బయట ఉన్న తల్లీ కొడుకుల నుంచి నాకు నిజాయితీ ధ్రువపత్రమేమీ అవసరం లేదు’ అని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నోట్లరద్దు నిర్ణయాన్ని సోనియా, రాహుల్‌లు వ్యతిరేకిస్తూ మోదీ అవినీతికి పాల్పడ్డారని వారు చేసిన ఆరోపణలకు సమాధానంగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక సంస్థలో ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి 2015 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్‌లకు బెయిలు మంజూరు చేయడం గమనార్హం. ‘నోట్లరద్దు నిర్ణయానికి మీకు సమాధానం కావాలా? ఆ చర్య వల్లే నకిలీ కంపెనీలను గుర్తించాం. అందువల్లే మీరు బెయిలు కోరాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు’ అంటూ సోనియా, రాహుల్‌లపై మోదీ విరుచుకుపడ్డారు. మోదీ వ్యాఖ్యలు ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్‌ అన్నారు.

ఒకే కుటుంబంతో ఆరంభం, అంతం..
కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయాలు ఒకే కుటుంబంతో ఆరంభమై, అంతమవుతాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ ఓ అవినీతి పార్టీ అనీ, ఛత్తీస్‌గఢ్‌ను ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి ఆ పార్టీకైతే 50 ఏళ్లు పట్టేదని పోల్చారు.  మాజీ ప్రధాని, రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ 1985లో అన్న మాటలను గుర్తుచేస్తూ.. ‘ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతోందని రాజీవ్‌ గాంధీయే అన్నారు. 85 పైసలను అదృశ్య హస్తం (కాంగ్రెస్‌ ఎన్నికల చిహ్నం) లాగేసింది? ఆ డబ్బంతా నోట్ల రద్దు తర్వాత బయటకొచ్చింది’ అని మోదీ ఆరోపించారు.

జల మార్గాలపై తొలి టర్మినల్‌
వారణాసి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో అభివృద్ధి వేగాన్ని ప్రధాని మోదీ పెంచారు. మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందే ఎందుకు చేపట్టలేదంటూ గత ప్రభుత్వాలను దుయ్యబట్టారు. దేశీయ జల మార్గాలపై దేశంలోనే తొలి మల్టీ–మోడల్‌ టర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్‌ను నిర్మించారు.

జాతీయ జల రహదారి–1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా, సోమవారం ప్రారంభమైన టర్మినల్‌ వాటిలో మొదటిది. ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ – ఇన్లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్‌ మార్గ్‌ వికాస్‌’ ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

తొలి నౌకకు స్వాగతం పలికిన మోదీ
టర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం కోల్‌కతా నుంచి ఆహార, పానీయాలను మోసుకుంటూ జలమార్గంలో వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. ఈ నౌక అక్టోబర్‌ చివరి వారంలో కోల్‌కతా నుంచి వారణాసికి బయలుదేరింది. కాగా, తన నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన, మొత్తంగా 34 కి.మీ. పొడవైన రెండు రహదారులను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో 16.55 కి.మీ. పొడవైన వారణాసి రింగ్‌రోడ్డు తొలి దశ రహదారి కూడా ఉంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు