మోదీ ఏది చేసినా ఓ లెక్కుంటుంది!

28 May, 2018 19:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు అట్టహాసంగా నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కేరింతలు కొడుతూ ఆయనపై పూరేకులు విరజిమ్మారు. ఢిల్లీ–మీరట్‌ మధ్య పూర్తయిన 82 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రారంభించిన మోదీ అదే రహదారిపై 9 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌ ఎక్కి ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌ వెళ్లారు. 

ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభోత్సవం చేయడానికే అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అట్టహాసంగా రిబ్బన్‌ కత్తిరించి ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. తాను లేకపోతే అసలు అభివృద్ధే లేదన్నట్టుగా అక్కడ ఆయన ఫోజిచ్చారు. వాస్తవంగా ఢిల్లీ నగరం గుండా కాకుండా ఢిల్లీ వెలుపలి నుంచి వెళ్లే విధంగా ఓ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాల్సిందిగా 2015లో సుప్రీం కోర్టు అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరం ఈ రోడ్డు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 11 వేల కోట్ల రూపాయలతో 17 నెలల కాలంలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నా విషయంలో సరైన సమయం కోసం మోదీ ఎదురు చూస్తున్నారు. 

గత ఏప్రిల్‌ నెలలోనే ఈ రోడ్డు నిర్మాణం విషయమై సుప్రీం కోర్టు జాతీయ రహదారుల అథారిటీ ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ప్రధాని మోదీకి సమయం చిక్కక పోవడం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించలేక పోయామని అథారిటీ సమాధానం ఇచ్చింది. అధికారిక ప్రారంభోత్సవం జరిగినా, జరక్కపోయినా ఫర్వాలేదు, మే 31వ తేదీలోగా హైవేలోకి వాహనాలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు మే 10వ తేదీన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయినా మోదీ వీలున్నా వెంటనే స్పందించకుండా ఆదివారం నాడు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అధికారికంగా ప్రారంభించారు.

దీనికి ఓ లెక్కుంది.మోదీ ప్రారంభోత్సం చేసిన బాఘ్‌పట్‌కు పక్కనే ఉన్న కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం ఉప ఎన్నికలుండడమే ఆ లెక్క. మోదీ దేన్ని ప్రారంభోత్సవం చేసినా అందుకు పక్కా లెక్కలుంటాయనడంలో సందేహం లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘రోల్‌ ఆన్‌ రోల్‌ ఆఫ్‌ ఫెర్రీ’ని ప్రారంభించడం కూడా అందులో భాగమే. ఆయన దాన్ని ప్రారంభించి ఆరేళ్లు గడిచాక ఇటీవల వాహనాలను తీసుకెళ్లే ఫెర్రీ ఇప్పుడు వచ్చింది. దానికి రిబ్బన్‌ కత్తిరించేందుకు కూడా మోదీ వెళ్లవచ్చు. 

మరిన్ని వార్తలు