ప్రజలను మభ్య పెట్టి గెలవాలనుకోవట్లేదు: మోదీ

26 Apr, 2018 10:37 IST|Sakshi
బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ ; ప్రజలను మభ్యపెట్టి గెలవాలని బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి నమో యాప్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కుల-మతాలను వాడుకోం... ప్రస్తుతం దేశంలో కులం, మతాలను కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని మోదీ దుయ్యబట్టారు. ‘కులం, మతం కోసం పోరాటం అంటూ కొందరు రాద్ధాంతాలు చేస్తున్నారు. కానీ, ఈ హంగామా అంతా ఎన్నికలు అయ్యే వరకే. గెలిచాక వాళ్లు ప్రజలను పట్టించుకోరు. కానీ, బీజేపీకి అలాంటి సిద్ధాంతాలు లేవు. అభివృద్ధే ధ్యేయంగా మేం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కర్ణాటక అభివృద్ధి కోసం మూడు ఎజెండాలు సిద్ధం చేసుకున్నాం.. అభివృద్ధి-త్వరగతిన అభివృద్ధి-రాష్ట్రాభివృద్ధి’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన ప్రస్తుతం దేశంలో రాజకీయాల దుస్థితికి ఆ పార్టీ చేసిన నిర్వాకాలే కారణమని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా తుడిచిపెడితేనే రాజకీయాల్లో స్వచ్ఛత సాధ్యమౌతుందని ఆయన పేర్కొన్నారు. ‘అభివృద్ధి నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. తద్వారా వారి విశ్వసనీయత చురగొంటామన్న నమ్మకం ఉంది. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకోవాలన్న ఉద్దేశ్యం మాకు లేదు’ అని మోదీ తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న నేరుగా ఆయన కర్ణాటకకు వెళ్లి.. ఉడిపిలో నిర్వహించబోయే భారీ ర్యాలీలో పాల్గొననున్నారు.  

ఇదిలా ఉంటే 225 సీట్లు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి మే 12 ఎన్నికలు జరగనున్నాయి. మే 15న ఫలితాలు వెలువడతాయి. తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ... అద్భుతాలు చేస్తామంటూ జేడీఎస్‌ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

మరిన్ని వార్తలు