మోదీ, మాయా మాటల యుద్ధం

13 May, 2019 04:17 IST|Sakshi

అల్వార్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై పరస్పర విమర్శలు

మాయావతిది మొసలి కన్నీరన్న ప్రధాని

మోదీవి చిల్లర రాజకీయాలంటూ ధ్వజమెత్తిన బీఎస్పీ అధినేత్రి

కుషీనగర్‌/డియోరియా/లక్నో (యూపీ)/ఖాండ్వా (మధ్యప్రదేశ్‌): రాజస్తాన్‌లోని అల్వార్‌లో గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య ఆదివారం మాటల తూటాలు పేలాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నారని మోదీ విమర్శిస్తే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధానిపై మాయావతి విరుచుకుపడ్డారు. ఈ విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని మోదీ సవాల్‌ విసిరితే.. దళితులపై గతంలో జరిగిన అత్యాచారాలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్‌ చేశారు. రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్‌ 26న మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతుల్ని అటకాయించిన దుండగులు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి భర్తను కొట్టి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై ఆలస్యంగా ఈ నెల 2న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళిత మహిళ భర్త ఆరోపించాడు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతివ్వకండి
ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్, డియోరియాల్లో ఎన్నికల సభల్లో మాట్లాడిన మోదీ.. బీఎస్పీ అధినేత్రిపై, రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ‘అయ్యిందేదో అయ్యింది..’ అన్నట్టుగా పార్టీ తీరు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసును నీరుగార్చాలని చూస్తోందని అన్నారు. ‘ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల కల్తీ కూటమి ఎలా పని చేస్తోందో చెప్పడానికి రాజస్తాన్‌ ఒక ఉదాహరణ, లక్నో గెస్ట్‌హౌస్‌ ఘటన (1995లో మాయావతిపై ఎస్పీ కార్యకర్తల దాడి) జరిగినప్పుడు యావత్‌ దేశం బాధపడింది. ఇప్పుడు మీకలాంటి బాధ కలగకపోవడాని కారణమేంటి? ఇప్పుడొక దళిత మహిళ లైంగిక దాడికి గురైంది.

ఆడపడుచుల ఆత్మగౌరవంపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ రాజస్తాన్‌ గవర్నర్‌కు లేఖ రాయండి..’ అని విపక్షాలను డిమాండ్‌ చేశారు.   కేవలం ప్రకటనల జారీకే పరిమితమవుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. కానీ అవినీతి, ధరల పెరుగుదల, సిక్కుల ఊచకోత ఏదైనా సరే జరిగిందేదో జరిగింది అన్నట్టుగా కాంగ్రెస్‌ తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రజలు సమర్ధవంతమైన, నిజాయితీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తున్నారని, ఈ ఎన్నికల్లో విపక్షాలు మట్టి కరవడం ఖాయమని మోదీ అన్నారు.

మోదీ రాజీనామా  చేయాలి: మాయా
దళిత మహిళ గ్యాంగ్‌రేప్‌ ఘటన నేపథ్యంలో ప్రధాని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాయావతి విమర్శించారు. ఈ కేసులో కఠినమైన, చట్టపరంగా సరైన చర్యలు తీసుకోనిపక్షంలో త్వరలోనే తగిన రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు బీఎస్పీ సిద్ధమని తెలిపారు. ఈ మేరకు లక్నోలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఊన, రోహిత్‌ వేముల వంటి దళితులపై గతంలో జరిగిన అనేక దాడులు, అత్యాచారాలను ప్రస్తావిస్తూ.. వీటికి మోదీ నైతిక బాధ్యత వహించాలని, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధిత మహిళ కుటుంబాన్ని భయపెట్టి అక్కడ ఎన్నికలు పూర్తయ్యే వరకు విషయం వెలుగులోకి రాకుండా చూసిందని మాయావతి శనివారం ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత మహిళకుతగిన న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని  సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు