‘వేల మందిని చంపిన పాపం నెహ్రూదే’

1 May, 2019 20:55 IST|Sakshi

లక్నో : ప్రధాని నరేం‍ద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశాంబీలో పర్యటించిన మోదీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుంభమేళా నిర్వహణ విషయంలో ఎలా వ్యవహరించాయో వివరించారు. ఈ క్రమంలో 1954లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కుంభమేళాను చాలా చక్కగా నిర్వహించారు. కానీ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్వర్యంలో 1954లో అలహాబాద్‌లో కుంభమేళా నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగింది. వేల మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అంతేకాక వారికి కనీసం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేద’ని మోదీ ఆరోపించారు.

నెహ్రూను కాపాడటం కోసమే అప్పటి మీడియా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకురాలేదన్నారు మోదీ. అంతేకాక ఆ తొక్కిసలాటలో వేల మంది మరణించారని.. ఈ పాపం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూదే అని ఆరోపించారు. గతంలో కూడా మోదీ.. నెహ్రూను ఉద్దేశిస్తూ.. గులాబీలు ధరించే వారికి తోటల గురించి అవగాహన ఉంటుందేమో కానీ.. రైతుల కష్టాల గురించి వారికి ఏ మాత్రం తెలియదని విమర్శించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు